
మెహబూబాకు పెద్ద పరీక్ష
జమ్మూ-కశ్మీర్‌లో మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడ్డ పీడీపీ-బీజేపీ కూటమి ప్రభుత్వానికి 48 గంటలు గడవకుండానే సంక్లిష్ట సమస్య వచ్చిపడింది. శ్రీనగర్ ఎన్‌ఐటీలో కశ్మీర్ విద్యార్థులకూ, స్థానికేతర విద్యార్థులకూ మధ్య తలెత్తిన వివాదం చివరకు లాఠీచార్జికీ, సీఆర్‌పీ బలగాల మోహరింపునకూ దారితీసింది. ఈమధ్య కాలంలో ఎక్కడో ఒకచోట విశ్వవిద్యాలయాలు ఆందోళనలతో అట్టుడుకుతు న్నాయి. క్యాంపస్‌లలోకి పోలీసులు ప్రవేశించి విద్యార్థులను చితకబాదడం, ఆడపిల్లలని కూడా చూడకుండా నిర్దాక్షిణ్యంగా ఈడ్చిపారేయడం వంటి దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి.
హైదరాబాద్‌లోని కేంద్రీయ విశ్వవిద్యాలయం మొద లుకొని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ), బెంగాల్‌లోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ వరకూ అలజడులు రేకెత్తడం అందరూ గమనిస్తూనే ఉన్నారు. జేఎన్‌యూ, జాదవ్‌పూర్ వర్సిటీలు సద్దుమణిగినా...దళిత యువ మేధావి రోహిత్ ఆత్మహత్య విషయంలో ఆరోపణలు ఎదుర్కొని సెలవుపై వెళ్లిన హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పొదిల అప్పారావు పునరాగమనంతో ఆ క్యాంపస్ మళ్లీ రాజుకుంది. దానికొక పరిష్కారం లభించ కుండానే ఇప్పుడు శ్రీనగర్ ఎన్‌ఐటీ అంటుకుంది.
అక్కడ తలెత్తిన సమస్య నిజానికి చాలా చిన్నది. గత వారం టీ20 సెమీ ఫైనల్‌లో వెస్టిండీస్‌పై భారత్ టీం ఓడిపోయాక కొందరు విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. దీన్ని జాతి వ్యతిరేక చర్యగా భావించిన స్థానికేతర విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. వెనువెంటనే ఎన్‌ఐటీ డెరైక్టర్, ప్రొఫెసర్లు బాధ్యత తీసుకుని రెండు వర్గాలతోనూ మాట్లాడివుంటే ఆ వివాదం బహుశా అక్కడితో సద్దుమణిగేది. కానీ ఆ పని జరగకపోవడం వల్ల అది క్రమేపీ ముదిరి పెను వివాదంగా మారింది. విద్యార్థులు లేవనెత్తే సమస్యలనైనా, విద్యార్థుల్లో వచ్చే పొరపొచ్చాలనైనా పరిష్క రించడానికి తామొక ప్రయత్నం చేసి చూద్దామనే ధోరణి విద్యా సంస్థల నిర్వా హకుల్లో కొరవడుతోంది. పిల్లలు తరగతులకొస్తే పాఠం చెప్పడమే తమ బాధ్యతని, మిగిలినవేమైనా ఉంటే పోలీసులు చూసుకుంటారనే మనస్తత్వం పెరుగుతోంది.
అసలు క్రికెట్‌లాంటి క్రీడల్లో దేశభక్తి, జాతీయవాదంవంటి అంశాలను తీసుకు రావడమే అసంగతం. మన జట్టే గెలవాలనుకోవడం తప్పేమీ కాదు. ఓడిపోయి నప్పుడు నిరాశ కలగడంలోనూ దోషం లేదు. అయితే స్టేడియంలో నువ్వా నేనా అన్నట్టు రెండు జట్లు పోరాడుతుంటే ఆ ఆటను చూసి ఆనందించగలిగే మనస్తత్వం ఉండాలి. మంచి ఆట తీరును ప్రదర్శించిన జట్టు...అది ఏ దేశానికి సంబంధించిన దైనప్పటికీ గెలిస్తే అభినందించగలిగే క్రీడాస్ఫూర్తి ఉండాలి. ఇప్పుడు శ్రీనగర్ ఎన్‌ఐటీలో సంబరాలు చేసుకున్నవారు అవతలి జట్టు బాగా ఆడిందన్న కారణంతో కాక ఎదుటి వర్గం విద్యార్థుల్ని రెచ్చగొట్టవచ్చునన్న ఉద్దేశంతో కూడా అలా చేసి ఉండొచ్చు. మన జట్టు గెలుపోటములపై స్పందించే తీరు ఆధారంగా ఒకరి దేశభక్తినీ లేదా అది లేకపోవడాన్నీ నిర్ధారించడానికి పూనుకోవడం సరికాదు.
ఢిల్లీ జేఎన్‌యూ లేదా హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో జాతీయ వాదం వంటి అంశాలపై వివాదాలు చోటుచేసుకోవడం వేరు. శ్రీనగర్ ఎన్‌ఐటీలో అలాంటి సమస్య తలెత్తడం వేరు. అనేక చారిత్రక కారణాల వల్ల జమ్మూ-కశ్మీర్‌లో సమస్యల విస్తృతి ఎక్కువ. ఉగ్రవాదాన్నీ, మిలిటెన్సీని అణచడం కోసం తీసుకున్న చర్యలవల్ల అయితేనేమి, కేంద్రంలో ఉన్న పాలకులు జమ్మూ-కశ్మీర్‌లో ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వాలతో వ్యవహరించిన తీరువల్ల అయితేనేమి అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీనికితోడు నిరుద్యోగం, అభివృద్ధి స్తంభించడం ఆ అసం తృప్తిని మరింతగా పెంచాయి. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు మిలిటెన్సీ తగ్గుముఖం పట్టింది. ఉగ్రవాద ఉదంతాలు కూడా గణనీయంగా తగ్గాయి.
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో భిన్న ధ్రువాలుగా ఉన్న పీడీపీ, బీజేపీలు కలిసి ప్రభు త్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇది అక్కడి ప్రజల్లో ఉన్న అపనమ్మకాన్నీ, అవిశ్వాసాన్నీ తొలగించడానికి దోహదపడుతోంది. ఇలాంటి తరుణంలో అందుకు భిన్నమైన పరిస్థితులు తలెత్తేలా వ్యవహరించడం మంచిది కాదు. విద్యార్థుల్లో ఆవేశాన్ని అర్ధం చేసుకోవచ్చు. కానీ ఆ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న సునీల్ సేఠి రాష్ట్రం వెలుపల ఉండే కశ్మీరీ విద్యార్థుల క్షేమానికి ఇలాంటి పరిణామాలు ముప్పు కలిగిస్తాయంటూ హెచ్చరించడం ఏం సబబు? శ్రీనగర్ ఎన్‌ఐటీలో 2,800మంది విద్యార్థులుంటే వారిలో 1,200మంది కశ్మీర్ విద్యార్థులు. మిగిలినవారు వెలుపలి ప్రాంతాలవారు. ఎవరో కొద్దిమంది చేసుకున్న సంబరాలను జాతి వ్యతిరేక చర్యగా పరిగణించడమేకాక...దాన్ని అందరికీ ఆపాదించి మిగిలినచోట్ల చదువుకునే కశ్మీర్ విద్యార్థులకు ముప్పు కలుగుతుందనడం బాధ్యతారాహిత్యం. జేఎన్‌యూలో జరిగిన తంతును శ్రీనగర్ ఎన్‌ఐటీలో పునరావృతం చేద్దామనుకుంటే మేలు కన్నా కీడే జరుగుతుందని గుర్తించాలి. ఇది దేశ శ్రేయస్సును కాంక్షించేవారు చేయాల్సిన పనికాదు.
భిన్న భాషలు, సంస్కృతి సంప్రదాయాలు ఉన్న మన దేశంలో వివిధ రాష్ట్రాల విద్యార్థులు ఒకచోట చదువుకుంటే అది జాతీయ సమైక్యతకూ, సమగ్రతకూ దోహదపడుతుందని ఎన్‌ఐటీ వంటి సంస్థలు నెలకొల్పినప్పుడు భావించారు. కానీ ఎన్‌ఐటీ యాజమాన్యం వైఫల్యం కారణంగా ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థి తులు తలెత్తాయి. ‘ఇది భారత్ కాదు సార్...ఇక్కడ మేం ఉండలేం. మమ్మల్ని మరేదైనా ప్రాంతానికి మార్చండ’ని కేంద్ర హెచ్‌ఆర్‌డీ మంత్రిత్వ శాఖ బృందంతో స్థానికేతర విద్యార్థులు అన్నారంటే వైషమ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. అలాగే స్థానిక పోలీసులకు బదులు అక్కడ సీఆర్‌పీ బలగాలను మోహరించడం కూడా దీన్నే సూచిస్తోంది. ఇప్పటికైనా ఎన్‌ఐటీ యాజమాన్యం తమ బాధ్యత గుర్తెరిగి సామరస్యపూర్వక వాతావరణం ఏర్పడటానికి తమ వంతు ప్రయత్నం చేయాలి.