
శ్రీనగర్: కశ్మీర్‌లో ఉగ్రవాదం పెరుగుదల, శాంతి భద్రతల హీనతను సాకుగా చూపి సంకీర్ణ ప్రభుత్వం నుంచి వైదొలిగిన బీజేపీకి పీడీపీ చీఫ్, సీఎం మెహబూబా ముఫ్తీ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. కశ్మీర్‌ను శత్రుస్థావరంగా చూసే అలవాటును మానుకోవాలని హితవుపలికారు. 30 ఏళ్ల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడినందున, వారి ద్వారానైనా కశ్మీర్‌కు న్యాయం దక్కుతుందన్న ఆశతోనే బీజేపీతో పీడీపీ పొత్తు పెట్టుకుందే తప్ప అధికారం కోసం కానేకాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
మాకు కావలసింది సాధించుకున్నాం: బీజేపీతో మేమేమీ ఊరికే పొత్తు పెట్టుకోలేదు. 370వ అధికరణ కొనసాగింపు (జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి), ఇరువైపుల నుంచి కాల్పుల విరమణ ఒప్పందం అమలు, యువకులపై కేసుల ఎత్తివేత, పాకిస్తాన్ సహా ఇక్కడి అన్ని వర్గాలతో చర్చలు జరపడం... అనే అంశాల ప్రాతిపదికన మేము వారితో(బీజేపీతో) కలిశాం. ఈ మూడేళ్లలో 370వ అధికరణకు సంబంధించి వివాదాలు రాలేదు... ప్రధాని మోదీ స్వయంగా పాకిస్తాన్ వెళ్లి అప్పటి ప్రధానిని కలిసి వచ్చారు... 12వేల మంది యువకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయించాం... అన్ని వర్గాలతో చర్చలు కొనసాగుతాయని కేంద్రం ప్రకటించేలా చేయగలిగాం... ఇలా సంకీర్ణ ప్రభుత్వంలో మాకు కావలసినవి మేం సాధించుకున్నాం.
రాజకీయంగా నష్టపోయినా భరించాం: బీజేపీతో పొత్తు వల్ల పీడీపీ నష్టపోయినమాట నిజం. మా కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినాసరే, రాస్ట్ర సంక్షేమం కోసం మాత్రమే బీజేపీని భరించాం. ఇవాళ వారు పొత్తును తెంచుకోవడం మాకేమీ శరాఘాతం కాదు. మేం పొమ్మనలేదు. వాళ్లంతట వాళ్లే వెళ్లిపోయారు. మా వైపు నుంచి తప్పేమీ లేదు. కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలు జరిగేలా పాకిస్తాన్‌తో చర్చలు జరపాలన్నది మా రెండో ప్రధాన డిమాండ్..’’ అని మెహబూబా ముఫ్తీ అన్నారు.
సీఎం పదవికి రాజీనామా: సంకీర్ణ ప్రభుత్వం నుంచి బీజేపీ వైదొలడంతో మెహబూబా ముఫ్తీ తన సీఎం పీఠానికి రాజీనామా ప్రకటించారు. గవర్నర్‌కు రాజీనామా లేఖ పంపానని, కశ్మీర్‌లో శాంతి, సుస్థిరతల కోసం పీడీపీ ఎప్పటికీ పాటుపడుతుందని ఆమె చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment