జేఈఈ మెయిన్‌లో మనోళ్ల జయకేతనం
Published Wed, Jul 9 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో తెలుగు విద్యార్థులకు ర్యాంకుల పంట పండింది. ఆల్ ఇండియా టాప్-10 ర్యాంకర్లలో ఎక్కువ మంది మనవాళ్లే ఉన్నారు. సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) మంగళవారం రాత్రి జేఈఈ మెయిన్ ర్యాంకులను ప్రకటించింది. బీటెక్ విభాగంలో టాప్-10 ర్యాంకర్లలో నలుగురు తెలుగు విద్యార్థులు ఉండగా, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీఆర్క్) విభాగంలో టాప్-10లో ఏడుగురు తెలుగు వారే కావడం విశేషం.
బీటెక్‌లో ఆల్ ఇండియా ప్రథమ ర్యాంకును బెంగళూరుకు చెందిన శ్రీనిధి ప్రభు సాధించారు. తెలుగు విద్యార్థులకు 2, 4, 7, 9వ ర్యాంకులు దక్కాయి. నెల్లూరుకు చెందిన డి.శ్రీలేఖ రెండో ర్యాంకు సాధించగా, ఖమ్మం జిల్లాకు చెందిన గీతాంజలికి 4వ ర్యాంక్, మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన పి.సింధూజకు 7వ ర్యాంకు(ఈమెకే బీఆర్క్‌లో ఐదో ర్యాంకు లభించింది), హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన మాగంటి నిఖిల్ హర్షకు 9వ ర్యాంకు వచ్చింది. ఇక బీఆర్క్‌లో హైదరాబాద్‌కు చెందిన ఆశిష్ టాపర్‌గా నిలిచారు.
రెండో ర్యాంకును నిశ్చయ్, 4వ ర్యాంకును గడ్డెం సూరజ్, ఐదో ర్యాంకును సింధూజ, 6వ ర్యాంకును కర్నూలుకు చెందిన దివాకర్‌రెడ్డి సాధించారు. డి.శ్రీలేఖ(బీటెక్‌లో 2వ ర్యాంకర్)కు 8వ ర్యాంక్, దీపక్‌కు 10వ ర్యాంక్ వచ్చింది. అలాగే బీటెక్‌లో 14, 27, 48, 51 ర్యాంకులు కూడా తెలుగు వారికే దక్కాయి. మొత్తానికి జేఈఈ మెయిన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ర్యాంకులు సాధించినట్లు హైదరాబాద్‌లోని ఐఐటీ నిఫుణులు ఎ.కృష్ణకుమార్ తెలిపారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు తమ పూర్తి ఫలితాలను జేఈఈ మెయిన్ వెబ్‌సైట్‌లో (jeemain.nic.in)పొందవచ్చు.
Advertisement
Advertisement