
తాడేపల్లిగూడెం నిర్మాణంలో ఉన్న నిట్ హాస్టళ్ల భవనాలు
పశ్చిమగోదావరి, తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో తొమ్మిది పీజీ కోర్సులను ప్రవేశపెట్టడానికి సన్నాహాకాలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెంలో ఏపీ నిట్ ఏర్పాటుచేసి నాలుగేళ్లు గడిచింది. ఈ ఏడాది తొలి బ్యాచ్ విద్యార్థులు బయటకు వెళ్లనున్నారు. పెదతాడేపల్లి వాసవి ఇంజినీరింగ్ కళాశాలలో నిట్ తాత్కాలిక తరగతులు, ల్యాబ్‌లు, బాలికల హాస్టళ్లు కొనసాగుతున్నాయి. నిట్ శాశ్వత భవనాల నిర్మాణ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది ఆగస్టు 19 నాటికి వీటిని పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. తొలి బ్యాచ్ సర్టిఫికెట్లతో విద్యార్థులు నిట్ సొంత ప్రాంగణం నుంచి బయటకు వెళ్లే విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. నిట్‌లో పీజీ కోర్సుల ఏర్పాటుకు గాను సన్నాహాకాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని 31 నిట్‌లలో ఏపీ నిట్‌కు తక్కువ కాలంలోనే గుర్తింపు వచ్చింది. ఈ నేపథ్యంలో పీజీ కోర్సులను కూడా ఇక్కడ ప్రారంభిస్తే ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తొమ్మిది కోర్సులకు అనుమతి కోసం కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖకు ఫైల్ చేరినట్టు సమాచారం. బయోటెక్నాలజీ, కెమికల్ , సివిల్ ఇంజినీరింగ్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ, మెటలర్జీ ఇంజినీరింగ్‌తో పాటు మేనేజ్‌మెంటు కోర్సుల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ఫైల్ వెళ్లిందని తెలిసింది. బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఆమోదం తెలిపితే, ఈ విద్యాసంవత్సరం నుంచి నిట్ ప్రాంగణంలో పీజీ కోర్సులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
మూడు కంపెనీలతో ఎంఓయూ
హైదరాబాద్‌కు చెందిన మూడు కంపెనీలతో నిట్ ఎంఓయూలను కుదుర్చుకుంది. మెక్‌లీన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌తో నెట్ వర్కింగ్ ఫీల్డ్‌కు సంబంధించి గతేడాది అక్టోబర్ 26న ఒప్పందం చేసుకున్నారు. ఫెర్‌వెంటెజ్ సెమికండక్టర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో నెట్ వర్కింగ్, కమ్యూనికేషన్స్‌కు సంబంధించి అక్టోబర్ 22న ఒప్పందం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఎనిక్సాట్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్‌పై గతేడాది నవంబర్ ఒకటో తేదీన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాలు మూడేళ్లు ఉంటాయి.
జూలై నాటికి హాస్టళ్లు షిఫ్టింగ్
నిట్ తొలిదశ శాశ్వత భవనాల నిర్మాణ పనులు రూ.202 కోట్లతో ప్రారంభించారు. ఒప్పందం ప్రకారం పూణెకు చెందిన కాంట్రాక్టు కంపెనీ షిర్కే ఈఏడాది ఆగస్టు 19 నాటికి భవన నిర్మాణాలను పూర్తి చేయాల్సి ఉంది. జూలై నాటికి నిట్ కొత్త ప్రాంగణంలో హాస్టళ్లు ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు హాస్టల్ భవనాల నిర్మాణాలు ఊపందుకున్నాయి. బాలికల వసతి గృహాల నిర్మాణం, అకడమిక్ భవనాల నిర్మాణ పనులు, గేట్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ల్యాబ్, స్టాఫ్ క్వార్టర్స్, ఫ్యాకల్టీ క్వార్టర్స్, అకడమిక్ భవనాల నిర్మాణాల పనులు ఊపందుకున్నాయి. తొలిదశ భవనాల నిర్మాణ పనులు పూర్తయితే రెండో దశ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. గడువులోపు నిర్మాణాలు పూర్తవుతాయని డైరెక్టర్ సీఎస్‌పీ రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment