జేఈఈ అడ్వాన్స్‌డ్ పూర్తిస్థాయి షెడ్యూల్ జారీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్ నోటిఫికేషన్ ఒకటి రెండు రోజుల్లో జారీ అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లపై సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) దృష్టి సారించింది. ప్రవేశాల విధానంలో మార్పుల పేరుతో ఇప్పటికే నోటిఫికేషన్ జారీ ఆలస్యమైన దృష్ట్యా ఈ నెల నుంచే దరఖాస్తులను స్వీకరించాలని యోచిస్తోంది. 2016లో ప్రవేశాలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని ఇప్పటికే నిపుణుల కమిటీ సిఫారసు చేసిన నేపథ్యంలో వేగంగా చర్యలు చేపడుతోంది.
ఇక ఎన్‌ఐటీల్లో ప్రవేశాలకు తుది ర్యాంకు ఖరారులో ఇంటర్ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇవ్వాలా, కేవలం జేఈఈ మెయిన్ ర్యాంకు ఆధారంగానే ప్రవేశాలు చేపడతారా? అన్న దానిపై నోటిఫికేషన్‌లో స్పష్టత ఇవ్వనుంది. మరోవైపు ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ పూర్తిస్థాయి షెడ్యూల్‌ను గౌహతి ఐఐటీ సోమవారం ప్రకటించింది. పరీక్ష షెడ్యూల్, అర్హతల వివరాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఈసారి జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన అభ్యర్థుల్లో టాప్ 2 లక్షల మందిని అడ్వాన్స్‌డ్ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది.
అడ్వాన్స్‌డ్ పరీక్షకు అర్హతలు..
జేఈఈ మెయిన్ టాప్ 2 లక్షల మందిలో ఉండాలి.
ఇందులో 50.5 శాతం (1,01,000) మందిని ఓపెన్ టు ఆల్ కింద, 27 శాతం (54,000) మందిని ఓబీసీ కేటగిరీలో, 15 శాతం మందిని (30,000) ఎస్సీ కేటగిరీలో, 7.5 శాతం (15,000) మందిని ఎస్టీ కేటగిరీలో ఎంపిక చేస్తారు.
ఈ పరీక్షకు హాజరయ్యే వారు 1991 అక్టోబర్ 1 లేదా ఆ తరువాత జన్మించిన వారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. అంటే 1986 అక్టోబర్ 1 లేదా ఆ తరువాత జన్మించి ఉండాలి.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అభ్యర్థులు వరుసగా 2సార్లు మాత్రమే రాసేందుకు అర్హులు.
అడ్వాన్స్‌డ్ పరీక్ష పూర్తిస్థాయి షెడ్యూల్
2016 ఏప్రిల్ 29 - మే 4 జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్
మే 11 - 22 హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
మే 22 ఉదయం పేపరు-1, మధ్యాహ్నం పేపరు -2 పరీక్షలు
జూన్ 1 - 4 ఆన్‌లైన్‌లో జవాబు పత్రాలు
జూన్ 5 జవాబుల ‘కీ’ల ప్రకటన
జూన్ 5 -7 ‘కీ ’లపై అభ్యంతరాలు స్వీకరణ
జూన్ 12 ఆన్‌లైన్‌లో ఫలితాలు వెల్లడి
జూన్ 12 - 13 ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు(ఏఏటీ) కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్
జూన్ 15 ఏఏటీ పరీక్ష
జూన్ 19 ఏఏటీ ఫలితాలు
జూన్ 20 - జూలై 19 ఐఐటీ ల్లో సీట్ల కేటాయింపు