ఐఐటీ, ఎన్‌ఐటీల్లో మొదటి దశ ప్రవేశాలు ఖరారు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీ తదితర జాతీయ స్థాయి సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం వెబ్ ఆప్షన్లు ఇచ్చుకున్న విద్యార్థులకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ (జోసా) గురువారం సీట్లు కేటాయించింది. ఆయా విద్యా సంస్థల్లో సీట్లు పొందిన విద్యార్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. జూలై 1 నుంచి 5 లోగా సీట్ యాక్సెప్టెన్సీ ఫీజు చెల్లించి సంబంధిత కాలేజీల్లో రిపోర్టు చేయాలని, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాలని వెల్లడించింది. వెరిఫికేషన్‌కు ఆన్‌లైన్ స్లాట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. ఇక ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు వచ్చిన జనరల్, ఓబీసీ విద్యార్థులు ఇంటర్ బోర్డు నుంచి పరీక్షకు హాజరైన విద్యార్థుల్లో టాప్ 20 పర్సంటైల్‌లోగా గానీ, ఇంటర్‌లో 75 శాతం మార్కులు(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులైతే 70 శాతం) గానీ సాధించి ఉండాలన్న నిబంధన ఉంది. దీంతో వివిధ ఇంటర్ బోర్డుల వారీగా టాప్ 20 పర్సంటైల్ కటాఫ్ మార్కులను ప్రకటించింది. తెలంగాణ ఇంటర్ బోర్డులో జనరల్ అభ్యర్థుల్లో టాప్ 20 పర్సంటైల్ మార్కుల కటాఫ్‌ను 475గా వెల్లడించింది. ఓబీసీలకు 460, ఎస్సీలకు 445, ఎస్టీలకు 449, వికలాంగులకు 445 మార్కులు కటాఫ్ ప్రకటించింది. ఏపీలో జనరల్‌కు 470, ఓబీసీకి 457, ఎస్సీ 442, ఎస్టీ 439, వికలాంగులకు 439 మార్కులను టాప్-20 పర్సంటైల్ కటాఫ్ మార్కులుగా పేర్కొంది.
262 మందికి ఐఐటీ బాంబేలో సీట్లు
టాప్ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఐఐటీ బాంబేలో చేరేందుకు వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. 1000లోపు ర్యాంకు ఉన్న వారిలో 262 మందికి ఐఐటీ బాంబేలో సీట్లు వచ్చాయి. టాప్ 500 లోపు ర్యాంకు వచ్చిన వారిలో 164 మందికి, టాప్ 100 లోపు ర్యాంకు వచ్చిన వారిలో 67 మందికి సీట్లు ఖరారయ్యాయి. ఐఐటీ బాంబే తర్వాత ఐఐటీ ఢిల్లీలో ఎక్కువ మంది సీట్లు లభించాయి. సీట్ల కోసం ఏ ఆప్షన్లు ఇవ్వని విద్యార్థులు టాప్ 500 ర్యాంకులోపు ఇద్దరు, 1000 ర్యాంకులోపు 5 మంది ఉన్నారు.
ఐఐటీ బాంబే వైపు టాపర్ల చూపు
Published Fri, Jul 1 2016 3:46 AM | Last Updated on Mon, Sep 4 2017 3:49 AM
Advertisement
Advertisement