దరఖాస్తుల్లో కనిపించని తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు
లక్ష మంది రాష్ట్ర విద్యార్థులకు నష్టం జరిగే ప్రమాదం
ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో సీట్లు కోల్పోయే ముప్పు
తెలంగాణ బోర్డు ఏర్పాటైనా సమాచారమివ్వని రాష్ట్ర ప్రభుత్వం
దరఖాస్తుల్లో ఏపీ ఇంటర్ బోర్డును మాత్రమే ఉంచిన సీబీఎస్‌ఈ
అదే ఆప్షన్‌తో దరఖాస్తు చేసుకున్న రాష్ట్ర విద్యార్థులు
ఈ నెల 31 వరకు పొరపాట్లు దిద్దుకునేందుకు అవకాశం
ఆలస్యంగా కళ్లు తెరిచిన తెలంగాణ విద్యా శాఖ
తెలంగాణ బోర్డును వేరుగా చూపాలని తాజాగా లేఖ
దరఖాస్తుల్లో సవరణకు గడువు పొడిగించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ విద్యా సంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) విషయంలో రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. జేఈఈ దరఖాస్తుల్లో ‘తెలంగాణ రాష్ర్ట ఇంటర్మీడియెట్ బోర్డు’ను ఎంపిక చేసుకునే వీలు లేకపోవడమే ఇందుకు కారణం. ఇంటర్ బోర్డుల జాబితాలో తెలంగాణ ఇంటర్ బోర్డును చేర్చకపోవడం రాష్ర్ట విద్యార్థులకు శాపంగా మారే ప్రమాదముంది.
గత నవంబర్‌లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల జారీ సమయంలో తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఏర్పాటు కాకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ బోర్డు పేరుతోనే రాష్ట్రానికి చెందిన దాదాపు లక్ష మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) చేపట్టిన ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఏపీ ఇంటర్ బోర్డు ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత తెలంగాణ ఇంటర్ బోర్డును రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తమ బోర్డును ప్రత్యేకంగా గుర్తించాలని సీబీఎస్‌ఈని కోరలేదు.
తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో కలిపి కాకుండా ప్రత్యేక యూనిట్‌గానే తీసుకోవాలని రాష్ర్ట ఇంటర్ బోర్డు అధికారులు కూడా సీబీఎస్‌ఈకి లేఖ రాయకపోవడం, విద్యా శాఖ మంత్రి సైతం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ప్రస్తుతం సీబీఎస్‌ఈ ఆన్‌లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. రాష్ట్రం నుంచి ఎలాంటి సమాచారం అందని కారణంగా తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియెట్ బోర్డు ఆప్షన్‌ను ఇప్పటికీ పొందుపరచలేదు. దీంతో తెలంగాణ విద్యార్థులు తమ ఇంటర్ బోర్డును మార్చుకునే అవకాశం లేకుండా పోయింది.
ఆలస్యంగా మేల్కొన్న బోర్డు
జేఈఈ మెయిన్ పరీక్షలో వచ్చిన మార్కులతోపాటు సదరు విద్యార్థికి ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇచ్చి, పర్సంటైల్ నార్మలైజేషన్ చేసి తుది ర్యాంకును ఖరారు చేస్తారు. దాని ఆధారంగానే ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో టాప్ ర్యాంకు సాధించడంతోపాటు ఆ రాష్ట్రం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థుల్లో టాప్-20 పర్సంటైల్ లేదా 75 శాతం మార్కులను సాధించి ఉండాలన్నది సీబీఎస్‌ఈ నిబంధన . జేఈఈ అడ్వాన్స్‌డ్ దరఖాస్తుల ప్రక్రియ ఏప్రిల్‌లో ఉండనుంది.
అయితే జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో తెలంగాణ ఇంటర్‌బోర్డు లేకపోవడం వల్ల విద్యార్థులకు నష్టం వాటిల్లనుంది. దరఖాస్తు ఫారంలో ఏపీ విద్యార్థి అని ఉండి, వెయిటేజీ కోసం పంపించే వివరాల్లో మాత్రం తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థిగా ఉంటే ఆ విద్యార్థి ఇంటర్ మార్కులకు వెయిటేజీ ఇవ్వరు. దీనివల్ల విద్యార్థికి సీటు దక్కే అవకాశముండదు. ఈ విషయాన్ని గుర్తించిన టీ ఇంటర్ బోర్డు బుధవారం సీబీఎస్‌ఈకి లేఖ రాసింది. దరఖాస్తుల్లో మార్పులకు ఇచ్చిన గడువును పొడిగించాలని, అందులో టీ ఇంటర్‌బోర్డు ఆప్షన్‌ను చేర్చాలని పేర్కొంది. ఈ విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో సీఎం కేసీఆర్, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి మాట్లాడి తమకు నష్టం వాటిల్లకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.
జేఈఈ ఝలక్!
Published Thu, Jan 29 2015 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM
Advertisement