శ్రీనగర్లో తెలుగు విద్యార్థుల కష్టాలు
శ్రీనగర్: టి-20 ప్రపంచ కప్ సందర్భంగా శ్రీనగర్ ఎన్ఐటీ విద్యార్థుల మధ్య ఏర్పడ్డ ఘర్షణ కారణంగా తెలుగు విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 120 మంది తెలుగు విద్యార్థులు నిట్లో చదువుకుంటున్నారు. వారం రోజులుగా శ్రీనగర్ నిట్లో కొనసాగుతున్న అల్లర్ల కారణంగా భద్రత పెంచాలంటూ తెలుగు విద్యార్థులతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన నాన్ లోకల్ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. లోకల్ విద్యార్థులు.. నాన్ లోకల్ విద్యార్థులపై దాడులకు దిగుతున్నారు. దీంతో నాన్ లోకల్ విద్యార్థులు క్యాంపస్ విడిచి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకుని వారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
టి-20 ప్రపంచ కప్లో టీమిండియాకు మద్దతుగా నాన్ లోకల్ విద్యార్థులు సెలెబ్రేషన్స్ చేసుకోగా, లోకల్ విద్యార్థులు టీమిండియాకు వ్యతిరేకంగా పాకిస్తాన్కు మద్దతుగా సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ విషయంలో లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు ఘర్షణ పడటంతో వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. క్యాంపస్లో గొడవల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. భారీగా భద్రత బలగాలను మోహరించారు. అయితే నాన్ లోకల్ విద్యార్థులపై వివక్ష చూపుతున్నారని విద్యార్థులు ఆరోపించారు. నిట్లో పరిస్థితిని కేంద్ర హోం శాఖ నిరంతరం పర్యవేక్షిస్తోంది.