ఇంకా చల్లారని టీమిండియా ఓటమి సెగలు
శ్రీనగర్: టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఓటమి శ్రీనగర్ లో సెగలు పుట్టిస్తోంది. విద్యార్థుల మధ్య మ్యాచ్ ఓటమి విషయంలో మొదలైన వివాదం ఇంకా కొనసాగుతోంది. నిన్న శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) లో జరిగిన ఘర్షణ నేపథ్యంలో... పరిస్థితులను అధ్యయనం చేయడానికి కేంద్రం ఇద్దరు వ్యక్తులతో కూడిన టీంను బుధవారం అక్కడకు పంపింది.
నిట్ లో నాన్ లోకల్ విద్యార్థులు మూడు రంగుల జెండాలు చేతిలో పట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలంటూ మంగళవారం భారీ ఎత్తున నిరసనలు తెలిపారు. వారు మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా అక్కడున్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు పోలీసుల పైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ఘర్షణలో పలువురు అధికారులతో పాటూ విద్యార్థులకు స్వల్పగాయాలయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో భారీ ఎత్తున పోలీసులు, బెటాలియన్లను అక్కడ మోహరించారు.
' శ్రీనగర్ ఎన్‌ఐటీ విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పరీక్షల గురించి ప్రభుత్వం చూసుకుంటుంది' అని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ పేర్కొన్నారు. మరోవైపు ఎన్‌ఐటీలో పరిస్థితులపై జమ్మూకశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడి తెలుసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు తక్షణమే తగిన చర్యలు తీసుకుంటామని ముఫ్తీ హామీ ఇచ్చారని రాజ్ నాథ్ ట్విట్ చేశారు.
కాగా టీ-20 వరల్డ్ కప్ సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో భారత్ ఓటమి పాలవ్వడంతో శ్రీనగర్ నిట్లో కశ్మీర్ స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య గొడవ తలెత్తిన విషయం తెలిసిందే. టీమిండియా ఓడిపోగానే స్థానిక విద్యార్థులు పెద్ద ఎత్తున టపాసులు కాల్చి భారత వ్యతిరేక నినాదాలు, పాక్ అనుకూల నినాదాలు చేశారు. దాంతో స్థానికేతర విద్యార్థులు భారత అనుకూల, పాక్ వ్యతిరేక నినాదాలు చేయడం మొదలుపెట్టారు. ఇది రెండు వర్గాల మధ్య గొడవకు కారణమైంది. విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకున్నారు. ఆ తర్వాత మళ్లీ శుక్రవారం కూడా మరోసారి గొడవలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.