ఈద్ నమాజ్ ముగియగానే ఘర్షణలు
జమ్మూకశ్మీర్‌లో మళ్లీ ఉద్రిక్తత
శ్రీనగర్: వేసవి రాజధాని శ్రీనగర్ సహా జమ్మూకశ్మీర్‌లో పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈద్ ప్రార్థనలు ముగిసిన వెంటనే ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పదిమంది గాయపడ్డారు. శ్రీనగర్‌లోని అతి పెద్ద మైదానమైన ఈద్ఘా బయట ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. ఇక్కడ ప్రార్థనల సందర్భంగా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. స్థానికులు ఇక్కడ నమాజ్ చేసిన అనంతరం ఈ ఘర్షణలు జరిగాయి. ఇక్కడ ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌గ్యాస్ ఉపయోగించారు. దాదాపు 20 నిమిషాల తర్వాత ఇక్కడ మూగిన ఆందోళనకారులు చెదిరిపోయారు.
దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ పట్టణంలోనూ దాదాపు గంటసేపు ఘర్షణలు జరిగాయి. జంగ్లత్ మండీ వద్ద ఈద్ ప్రార్థనలు ముగిసిన తర్వాత ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణపడ్డారు. బారాముల్లా జిల్లాలోని సోపూర్, పఠాన్ పట్టణాల్లోనూ ఘర్షణలు జరిగినట్టు సమాచారం.