సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ బీటెక్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కోసం మే 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు జేఈఈ నిర్వహణ సంస్థ అయిన ఐఐటీ ఢిల్లీ వెల్లడించింది. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులను 6 రోజులే స్వీకరించేలా షెడ్యూల్‌ను ఖరారు చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను శుక్రవారం వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంచింది. మే 1 నుంచి 6 సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో(jeeadv.ac.in) దరఖాస్తు చేసు కోవచ్చని అందులో పేర్కొంది. ఫీజు చెల్లింపునకు 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అవకాశం కల్పించింది. మే 17న అడ్వాన్స్‌డ్ పరీక్షను నిర్వహిస్తామని, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్ష ఉంటుందని పేర్కొంది. వికలాంగులకు గంట అదనంగా సమయం ఇస్తామని, జూన్ 8న ఈ పరీక్షల ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించింది.
ఈసారి జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంది. అందులో ఓపెన్ కేటగిరీలో 1,01,250 మందిని (అందులో వికలాంగులు 5,063 మంది), ఈడబ్లు్యఎస్‌లో 25 వేల మందిని (వికలాంగులు 1,250 మంది), ఓబీసీ నాన్ క్రీమీలేయర్‌లో 67,500 మందిని (వికలాంగులు 3,375 మంది), ఎస్సీల్లో 37,500 మందిని (వికలాంగులు 1,875 మందిని), ఎస్టీల్లో 18,750 మందిని (వికలాంగులు 938 మంది) పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇక 2020–21 విద్యా సంవత్సరంలో ఐఐటీల్లో కనీసంగా 20 శాతం (2,676) సూపర్ న్యూమరీ సీట్లను మహిళలకు కేటాయించేలా ఐఐటీల కౌన్సిల్ నిర్ణయం తీసుకుందని వెల్లడించింది. గత ఏడాది అందుబాటులో ఉన్న మొత్తం సీట్లకు అదనంగా ఈ సీట్లను కేటాయించాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, నిజమాబాద్, వరంగల్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment