జేఈఈ మెయిన్‌కు రెండుసార్లే చాన్స్‌ | Jee Entrance Exam 2022: Exams Attempt Likely Reduced To 2 Times National Test Agency | Sakshi
Sakshi News home page

జేఈఈ మెయిన్‌కు రెండుసార్లే చాన్స్‌

Published Sat, Feb 19 2022 4:07 AM | Last Updated on Sat, Feb 19 2022 9:24 AM

Jee Entrance Exam 2022: Exams Attempt Likely Reduced To 2 Times National Test Agency - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తదితర జాతీయ విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామినేషన్‌ మెయిన్‌ను ఇక నుంచి రెండుసార్లు మాత్రమే నిర్వహించనున్నారు. ఈ ఏడాది (2022) నుంచి ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ను జరపాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కి హాజరయ్యేందుకు విద్యార్థులకు రెండు చాన్సులు మాత్రమే ఉంటాయి. గతేడాది కరోనా నేపథ్యంలో మెయిన్‌ పరీక్షను నాలుగుసార్లు నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా విద్యార్థులకు నాలుగుసార్లు పరీక్ష రాసుకునే అవకాశం కల్పించారు.

గతేడాది అస్తవ్యస్తం.. 
జేఈఈ మెయిన్‌ను గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలలో నిర్వహించాలని ముందు నిర్ణయించారు. అయితే.. కోవిడ్‌తో ఏప్రిల్, మే నెలల పరీక్షలు సెప్టెంబర్, అక్టోబర్‌ల్లో కానీ పూర్తి కాలేదు. గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు 26 లక్షల మంది ఈ పరీక్షలు రాశారు. మల్టీసెషన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో జేఈఈ మెయిన్‌ను నిర్వహించారు. అయితే ఈ నాలుగు చాన్సుల విధానంలో కొన్ని లోపాలు తలెత్తిన సంగతి తెలిసిందే. మొదటి చాన్సులో ప్రతిభ చూపని అభ్యర్థులు చివరి దశ పరీక్షలో అధిక మార్కులు సాధించడం గమనార్హం. గతేడాది నాలుగుసార్లు నిర్వహించిన పరీక్ష స్కోరుల్లో అత్యుత్తమమైన దాన్ని అభ్యర్థి తుది స్కోర్‌గా ఎన్‌టీఏ పరిగణించింది. దాని ఆధారంగానే ర్యాంకులను ప్రకటించింది. ఇలా నాలుగుసార్లు రాసుకునే అవకాశం కల్పించడం వల్ల కొంతమంది విద్యార్థులు గణనీయంగా లబ్ధి పొందారు.   

ఈసారి త్వరగా ప్రవేశాలు.. 
గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టింది. గతేడాది కరోనాతో వివిధ బోర్డుల 12వ తరగతి పరీక్షలను చాలా ఆలస్యంగా నిర్వహించారు. ఈ ఏడాది సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 12వ తరగతి పరీక్షలు సకాలంలో అంటే.. ఏప్రిల్‌ 26 నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ (ఐఎస్‌సీ) పరీక్షలను ఏప్రిల్‌ చివరి వారం నుంచి నిర్వహించనున్నారు. దీంతో ఈసారి జేఈఈ మెయిన్‌ను రెండుసార్లకే పరిమితం చేయాలని ఎన్‌టీఏ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ ఫిబ్రవరి నెలాఖరులోగా విడుదల కానుంది. అనంతరం రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement