
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష నీట్ యూజీ- 2023 తేదీలు ఖరారయ్యాయి. నీట్ యూజీ ప్రవేశ పరీక్షల క్యాలెండర్‌ను విడుదల చేసింది జాతీయ పరీక్షల మండలి(ఎన్‌టీఏ). మే 7వ తేదీన దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈ పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు వెల్లడించింది.
నీట్ యూజీ 2023 దరఖాస్తు ఫారమ్ ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ nta.ac.in, neet.nta.nic.inలలో లభిస్తాయి. ప్రక్రియ ప్రారంభం కాగానే అర్హులైన విద్యార్థులు నిర్ణీత పరీక్ష ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే.. నీట్ యూజీ ఎగ్జామ్ విధానం, సిలబస్, దరఖాస్తు వివరాలు, అర్హత, విద్యార్హతల వంటి వివరాలను విడుదల చేయనుంది ఎన్‌టీఏ. ఈ పరీక్ష రాసేందుకు 17 ఏళ్లు ఆపైబడిన వారు మాత్రమే అర్హులు. ఇంటర్‌మీడియెట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారు నీట్ పరీక్ష రాయవచ్చు. దేశవ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయూష్, 47 బీవీఎస్‌సీ, ఏహెచ్ కళాశాలలు నీట్ స్కోర్‌ను అనుమతిస్తున్నాయి.
మరోవైపు.. ఉమ్మడి విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష క్యూట్-2023 తేదీలను సైతం ఎన్‌టీఏ ప్రకటించింది. మే 21 నుంచి 23 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. క్యూట్ పరీక్షలకు సంబంధించి రిజర్వ్ తేదీ జూన్ 1 నుంచి జూన్ 7 వరకు ఉంటాయని ప్రకటించింది ఎన్‌టీఏ.
ఇదీ చదవండి: కొత్త వైద్య కళాశాలల దరఖాస్తుకు గడువు పెంపు
Comments
Please login to add a commentAdd a comment