జేఈఈ అభ్యర్థులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు | Online Troubles For JEE Applicants | Sakshi
Sakshi News home page

జేఈఈ అభ్యర్థులకు ‘ఆన్‌లైన్‌’ కష్టాలు

Published Fri, Sep 14 2018 9:04 AM | Last Updated on Fri, Sep 14 2018 9:23 AM

Online Troubles For JEE Applicants - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీలు) నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీలు) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి తొలిసారిగా నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారా నిర్వహించనున్న జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ)– మెయిన్‌ విద్యార్థులకు అగ్నిపరీక్షలా మారుతోంది. ఈ పరీక్షను ఇక నుంచి కేవలం ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌)లోనే నిర్వహించనుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 12 నుంచి 14 లక్షల మంది హాజరవుతారని అంచనా. గతేడాది వరకు పరీక్షను ఆఫ్‌లైన్‌ (పేపర్, పెన్ను విధానం)తోపాటు ఆన్‌లైన్‌లో నిర్వహించే వారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం లేని విద్యార్థులు ఆఫ్‌లైన్‌ పరీక్షకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈసారి ఆఫ్‌లైన్‌ను రద్దు చేసి ఆన్‌లైన్‌లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో కంప్యూటర్‌పై అవగాహన లేని వారు ఆన్‌లైన్‌లో పరీక్ష ఎలా రాయాలని ఆందోళనలో ఉన్నారు.

కంప్యూటర్లే లేవు
రాష్ట్రంలో 1100 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు, 2700 ప్రైవేటు జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్‌ సెకండియర్‌ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో 2 లక్షల మంది ఉండగా.. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. వీరికి ఆన్‌లైన్‌ టెస్టులపై శిక్షణ ఇవ్వడానికి కళాశాలల్లో కంప్యూటర్లు లేవు. దీంతో విద్యార్థులకు మాక్‌ ఆన్‌లైన్‌ టెస్టులపై శిక్షణ అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే కావడంతో వారికి ఆన్‌లైన్‌ పరీక్ష మరింత గడ్డుగా మారనుంది. ప్రైవేటు కాలేజీల్లోనూ విద్యార్థులతో బట్టీ పట్టించడమే తప్ప ఆన్‌లైన్‌లో జరిగే పరీక్షలను ఎలా ఎదుర్కొనాలో శిక్షణ ఇవ్వడం లేదు.

రఫ్‌ వర్క్‌ చేసుకుంటూ ఆన్‌లైన్‌లో గుర్తించడం కష్టమే
జేఈఈ మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో ఇచ్చే ప్రశ్నలకు ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ సరైన సమాధానాలు గుర్తించడం కష్టం. వీటికి సంబంధించి రఫ్‌ వర్క్‌కే ఎంతో సమయం పడుతుంది. కంప్యూటర్‌ స్క్రీన్‌పై ఆయా ప్రశ్నలను చదివి, ఆప్షన్లను పరిశీలించి మరోపక్క బయట అందుకు సంబంధించిన రఫ్‌ వర్క్‌ పూర్తిచేసి సమాధానాన్ని గుర్తించడంలో తీవ్ర తడబాటుకు గురయ్యే ప్రమాదముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా జేఈఈ మెయిన్‌లో తప్పు సమాధానాలకు నెగెటివ్‌ మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం తప్పుగా టిక్‌ చేసినా మార్కుల్లో కోతపడే ప్రమాదముందని విద్యార్థులు భయపడుతున్నారు.

టీపీసీలు ఏర్పాటు చేసినా అదే పరిస్థితి
మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా టెస్టు ప్రాక్టీస్‌ సెంటర్స్‌ (టీపీసీ)లను ఏర్పాటు చేసినట్లు ఎన్‌టీఏ ప్రకటించింది. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్‌టీఏ.ఏసీ.ఐఎన్‌’ వెబ్‌సైట్‌లో సెప్టెంబర్‌ 8 నుంచి వీటిని యాక్టివ్‌లోకి తెచ్చింది. ఈ సెంటర్లు శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్‌టీఏ స్టూడెంట్‌ యాప్‌ను ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవడం ద్వారా టెస్టు ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. అయితే కళాశాలల విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో వారు మాక్‌ టెస్టులకు ఎలా ప్రిపేర్‌ అవుతారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు టీపీసీలపై విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అటు మాక్‌ టెస్టులకు అవకాశం లేక, ఇటు టీపీసీ కేంద్రాల్లోనూ తర్ఫీదులేక తమ పిల్లలు నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement