National Testing Service
-
సెల్ఫ్ డిక్లరేషన్.. కొత్త మాస్క్
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 6 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌కు రాష్ట్రం నుంచి 67,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారికి ఆన్లైన్లో రోజూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత జనవరిలో 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 1,00,129 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే వచ్చేనెల 13న నిర్వహించనున్న నీట్ పరీక్షకు 55,800 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతేడాది 54,073 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. అప్పుడు 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 112కి పెంచారు. కరోనా నేపథ్యంలో ఎన్టీఏ ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులకు పలు సూచనలు జారీచేసింది. ఇవీ సూచనలు.. ►విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులో ఉన్న కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్‌టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి. దానిపై ఫొటో అతికించి సంతకంతోపాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి. ►గత 14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమ స్యలు, శరీర నొప్పులు లేవని ఆ డిక్లరేషన్‌లో పేర్కొనాలి. కోవిడ్ పాజిటివ్ కేసు కాంటాక్ట్‌లో ఉన్నారా? లేదా? అన్న వివరాలను నమోదు చేయాలి. ►నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. ూ గుంపులుగా కాకుండా భౌతికదూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి. ►అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్ తీసేసి కొత్త మాస్క్ ధరించాలి. ►శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు. ►పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవకూడదు. ►అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి. ►ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ►అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తేవాలి. ►రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. ఇంకా కావలిస్తే అదనంగా ఇస్తారు. ►అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్ బాక్స్‌లో వాటిని వేయాలి. ►సరిగా నింపిన అడ్మిట్ కార్డును కూడా డ్రాప్ బాక్స్‌లో వేయాలి. ►ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు. -
పరీక్ష కేంద్రాల్లో ఐసోలేషన్ గదులు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులకు 99.4 డిగ్రీల కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లు తేలితే వారికి ప్రత్యేక ఐసోలేషన్ గదిలో ‘నీట్’పరీక్ష నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) తెలిపింది. కరోనా అనుమానిత లక్షణాలున్న వారికి కూడా ఐసోలేషన్ గదిలోనే పరీక్ష నిర్వహిస్తారని పేర్కొంది. ఇందుకోసం పరీక్షా కేంద్రాల్లో ప్రత్యేక గదులను ఏర్పాటు చేస్తారు. కరోనా విజృంభణ నేపథ్యంలో వచ్చేనెల 13న జరగనున్న నీట్(నేషనల్ ఎలిజిబిలిటీ అండ్ ఎంట్రన్స్ టెస్ట్–2020) మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది. నీట్(అండర్ గ్రాడ్యుయేట్)–2020కు 15,97,433 మంది హాజరుకానున్నారు. రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. నీట్ నిర్వహణ మార్గదర్శకాలివీ.. ►పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులందరూ గుంపులుగా రాకుండా స్లాట్ల విధానం అమలు చేస్తారు. ళీ ఉదయం 11 గంటల నుంచే విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ఎవరు ఏ సమయంలో రావాలో హాల్‌టికెట్లపై ముద్రిస్తారు. విద్యార్థుల సెల్ఫోన్లకు ఆయా వివరాలను మెసేజ్ రూపంలో పంపిస్తారు. ►పరీక్ష కేంద్రాల వద్ద గుమిగూడకుండా భౌతిక దూరం పాటించేందుకు గేటు బయట తాళ్లు కడతారు. వాటి వరుసల మధ్య నుంచే విద్యార్థులు లోపలికి ప్రవేశించేలా ఏర్పాట్లు చేస్తారు. ►థర్మోగన్స్ ద్వారా ప్రవేశ ద్వారం వద్ద సిబ్బంది సహా విద్యార్థులందరి శరీర ఉష్ణోగ్రతను పరీక్షిస్తారు. కరోనాకు సంబంధించిన స్థానిక హెల్ప్‌లైన్ నెంబర్‌ను పరీక్షా కేంద్రాల్లో ప్రముఖంగా ప్రదర్శిస్తారు. అత్యవసరమైతే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసేలా ఏర్పాట్లు ఉంటాయి. ►పరీక్షా గదిలోకి విద్యార్థులతోపాటు మాస్క్, గ్లోవ్స్, వాటర్ బాటిల్, సొంత శానిటైజర్ (50 మి.లీ.), అడ్మిట్ కార్డ్, ఐడీ కార్డ్‌లకు మాత్రమే అనుమతిస్తారు. మరే ఇతర వస్తువులను అనుమతించరు. మా స్క్, శానిటైజర్ తప్పనిసరి తెచ్చుకోవాలి. ►పరీక్షా కేంద్రంలో సిబ్బందికి, గేటు వద్ద ఉండే సెక్యూరిటీ గార్డులకు గ్లోవ్స్, మాస్క్‌లు ఉండాలి. ►పరీక్షా కేంద్రాల లోపల టేబుల్, డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్స్ వంటి వాటిపై వైరస్ చేరకుండా సోడియం హైపోక్లోరైడ్‌ను పిచికారీ చేయాలి. ►పరీక్షా కేంద్రాల అంతస్తులు, గోడలపై స్ప్రే చేయాలి. అన్ని వాష్‌రూమ్‌లను శుభ్రపరచాలి. చేతులు కడుక్కోవడానికి వీలుగా వాష్‌రూంలలో సబ్బు ఉండాలి. -
జేఈఈలో న్యూమరిక్ వ్యాల్యూ ప్రశ్నలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్‌లో కొత్తగా ప్రవేశపెడుతున్న న్యూమరిక్ వ్యాల్యూ ప్రశ్నల శాంపిల్ జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ విభాగాల్లో ఇచ్చే ప్రశ్నల్లో 5 న్యూమరిక్ వ్యాల్యూకు చెందినవి ఉంటాయి. కొత్త విధానాన్ని వచ్చే ఏడాది నిర్వహించే తొలిదశ మెయిన్స్ నుంచి అమలు చేయనున్నారు. మూడు విభాగాల శాంపిల్ ప్రశ్నలను జేఈఈ–2020 వెబ్సైట్లో పొందుపరిచారు. మెరిట్ విద్యార్థులు నష్టపోకుండా.. జేఈఈ మెయిన్స్‌లో మల్టిపుల్ ఆన్సర్ల ప్రశ్నలకు సంబంధించి ఏదో ఒక సమాధానానికి గుడ్డిగా టిక్ చేస్తుండటంతో సామర్థ్యంలేని కొంతమంది విద్యార్థులకు కూడా ఎక్కువ మార్కులు వస్తున్నాయి. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు నష్టం జరుగుతోందన్న సూచనలు ఎన్టీఏకు అందాయి. దాంతో పాటు జేఈఈలో ప్రశ్నల సంఖ్యను కూడా తగ్గిస్తూ కొత్త ప్యాట్రన్‌ను ఎన్టీఏ ప్రకటించింది. అడ్మిట్ కార్డులు సిద్ధం జేఈఈ–2020 మెయిన్స్ తొలిదశ ఆన్లైన్ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 6 నుంచి 9వ తేదీ వరకు జరుగుతాయి. అడ్మిట్ కార్డులను వెబ్సైట్లో పొందుపరిచినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. విద్యార్థులు ‘జేఈఈ మెయిన్.ఎన్టీఏ.ఎన్ఐసీ.ఐఎన్’ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. డౌన్లోడ్ కాని పక్షంలో ‘జేఈఈ మెయిన్.ఎన్‌టీఏఎట్‌దరేట్‌జీఓవీ.ఐఎన్’ అడ్రస్‌కు అభ్యర్థనను ఈ–మెయిల్ చేయాలని సూచించింది. గతంలో ఎలా..ఇప్పుడెలా... ►గతంలో జేఈఈ మెయిన్స్‌లోని ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్ విభాగాల్లో 30 చొప్పున బహుళ సమాధానాల ప్రశ్నలు ఇచ్చేవారు. ►ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. సమాధానాలు తప్పుగా టిక్ పెడితే ఒక మార్కుచొప్పున కోత పడేలా మైనస్ మార్కుల విధానం అమలు చేస్తున్నారు. ►కొత్త ప్యాట్రన్ ప్రకారం 30 ప్రశ్నల సంఖ్యను 25కు కుదించి విద్యార్థులపై భారాన్ని తగ్గించారు. ►ఈ 25 ప్రశ్నల్లో 20 మల్టిపుల్ ఆన్సర్లతో కూడిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. మిగతా 5 న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలు ఉంటాయి. ►ఈ విభాగంలో మల్టిపుల్ ఆన్సర్స్ ఇవ్వకుండా కేవలం ప్రశ్న మాత్రమే అడుగుతారు. ప్రశ్నకు సమాధానంగా కేవలం సంఖ్య మాత్రమే ఉంటుంది. ఆన్సర్ స్థానంలో ఖాళీని ఉంచుతారు. సరైన సమాధానం వచ్చే సంఖ్యను మాత్రమే విద్యార్థి రాయాల్సి ఉంటుంది. ►ఇలా మూడు విభాగాల్లోనూ న్యూమరికల్ వాల్యూ ప్రశ్నలు ఐదేసి ఉంటాయి. ►మల్టిపుల్ ఆన్సర్ ఆబ్జెక్టివ్‌గా ఇచ్చే 20 ప్రశ్నలకు మాత్రమే మైనస్ మార్కులు ఉంటాయి. ►న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నలకు ఇది వర్తించదు. ►గతంలో జేఈఈ మెయిన్స్‌లో మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల పేపర్లలో ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలకు 120 మార్కుల చొప్పున మొత్తం 90 ప్రశ్నలు 360 మార్కులకు ఉండేవి. ►తాజాగా ప్రశ్నల కుదింపుతో ఇప్పుడు మూడు కేటగిరీల్లో 75 ప్రశ్నలతో 300 మార్కులకు ఉంటుంది. మెరిట్ విద్యార్థులకు ఎంతో మేలు ‘కొత్త ప్యాట్రన్‌లో న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల విధానం వల్ల మెరిట్ విద్యార్థులకు మేలు జరుగుతుంది. గతంలో సబ్జెక్టుపై పట్టులేకున్నా గుడ్డిగా ఏదో ఒక ఆన్సర్‌కు టిక్ చేసే వారు అదృష్టవశాత్తు అది కరెక్టు అయితే మెరిట్‌లోకి చేరేవారు. దీనివల్ల ప్రతిభగల అభ్యర్థులకు నష్టం వాటిల్లేది. ఇప్పుడు న్యూమరికల్ వ్యాల్యూ ప్రశ్నల వల్ల కేవలం ఆ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసినవారే రాయగలుగుతారు. తద్వారా మెరిట్ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. – కేతినేని శ్రీనివాసరావు కెమిస్ట్రీ అధ్యాపకుడు, విజయవాడ -
ఇంగ్లిష్, హిందీల్లోనే జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్స్ పరీక్షను ఇంగ్లిష్, హిందీ భాషల్లోనే నిర్వహిస్తున్నామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ద్వారా ఆయా రాష్ట్రాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు చేపట్టేందుకు అంగీకరించిన, తమ ప్రాంతీయ భాషలో పరీక్షను నిర్వహించాలని కోరిన రాష్ట్రాల భాషల్లో మాత్రమే (ఇంగ్లిష్, హిందీతోపాటు) జేఈఈ మెయిన్స్ నిర్వహి స్తున్నామని తెలి పింది. 2013లో జేఈఈ మెయిన్స్ ప్రారంభమయ్యాక గుజరాతీలో పరీక్ష నిర్వహిం చాలని గుజ రాత్ కోరిందని తెలిపింది. 2014లో మహారాష్ట్ర కూడా మరాఠీతోపాటు ఉర్దూలో పరీక్ష నిర్వహించాలని కోరిందని పేర్కొంది. దాంతో గుజరాతీ, మరాఠీ, ఉర్దూ భాషల్లోనూ జేఈఈ మెయిన్స్ ప్రశ్న పత్రం ఇస్తున్నామని వెల్లడించింది. మిగతా రాష్ట్రాలు తమ ప్రాంతీయ భాషల్లో ప్రశ్న పత్రం ఇవ్వాలని తమను అడగలేదని ఎన్టీఏ స్పష్టం చేసింది. జేఈఈ మెయిన్స్ ప్రశ్నపత్రం ఏ భాషలో ఇచ్చినా మూల్యాంకనంలో మాత్రం ఇంగ్లిష్ ప్రశ్నపత్రాన్నే ప్రామాణికంగా తీసుకుంటామని వెల్లడించింది. -
రేపటి నుంచి జేఈఈ మెయిన్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7 నుంచి జేఈఈ మెయిన్–2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 7న బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్) కోర్సులో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 8, 9, 10, 12 తేదీల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.34 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కోదాడ, నిజామాబాద్ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్–1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 9,29,198 మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా, 8,74,469 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్–2 పరీక్షలకు 9.34 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అందులో కొత్తవారు 3.14 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి దాదాపు 74 వేల మంది పరీక్షకు హాజరుకానున్నారు. రెండు దశల్లో నిర్వహణ.. ఐఐటీ, ఎన్ఐటీల్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్ పరీక్షను రెండు దశలుగా ఎన్టీఏ నిర్వహిస్తోంది. రెండు విడతల పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ ప్రకారం ర్యాంకులు కేటాయించనుంది. దీంతో జనవరిలో పరీక్షలు రాసినవారు స్కోర్ పెంచుకోవడానికి ఏప్రిల్ పరీక్షలకు హాజరవుతున్నారు. మొదటి విడత పరీక్షల్లో 8,816మంది విద్యార్థులు 99–100 పర్సంటైల్ సాధించినట్లు సమాచారం. ఇదీ పరీక్ష షెడ్యూల్.. ఆన్లైన్లో పరీక్షలను రోజూ రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్ట్ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందే. ఉదయం పరీక్షకు 8.30 గంటలలోపు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లేలా అనుమతిస్తారు. పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల వరకే అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.45 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు. -
ఏప్రిల్ 8, 9, 10, 12 తేదీల్లో జేఈఈ మెయిన్స్
సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి జేఈఈ మెయిన్స్–2019 పరీక్షలను వచ్చే నెల 8, 9, 10, 12 తేదీల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. బీఆర్క్/బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్షను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. లోక్‌సభ ఎన్నికలు వచ్చే నెల 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో నిర్వహించనున్న నేపథ్యంలో తాజా షెడ్యూలును ఖరారు చేసింది. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొంది. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాజా షెడ్యూలును ఖరారు చేసింది. -
జేఈఈ విద్యార్థులకు వీడియో పాఠాలు
సాక్షి, హైదరాబాద్: జేఈఈ మెయిన్ తదితర ప్రవేశ పరీక్షలను తొలిసారిగా ఆన్లైన్లో నిర్వహిస్తున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విద్యార్థుల కోసం ఎన్ఐటీలు, ఐఐటీల ప్రొఫెసర్ల ఆధ్వర్యంలో రూపొందించిన వీడియో పాఠాలను అందుబాటులోకి తెచ్చింది. జనవరిలో నిర్వహించే తొలిదశ జేఈఈ మెయిన్‌కు సిద్ధం అయ్యే విద్యార్థులకు ఆ పాఠాలను వెబ్సైట్ (nta.ac.in) ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో విద్యార్థులు జేఈఈకి ఎలా ప్రిపేర్ కావొచ్చన్న ప్రాథమిక సమాచారంతోపాటు పాఠ్యాంశాలనూ అందుబాటులో ఉంచింది. విద్యార్థులు రిజిస్టర్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది. విద్యార్థులు ఒరిజినల్ పరీక్ష తరహాలో కేంద్రానికి వెళ్లి నమూనా పరీక్ష రాసేలా టెస్ట్ ప్రాక్టీస్ సెంటర్లను (టీపీసీ) ఏర్పాటు చేస్తోంది. అయితే వాటిని పరీక్షలకు కొద్దిరోజుల ముందు అందుబాటులోకి తీసుకురానుంది. జేఈఈ మెయిన్‌తో పాటు యూజీసీ నెట్‌ను తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తున్నందున విద్యార్థుల్లో ఆన్లైన్ పరీక్షలంటే భయం పోగొట్టేందుకు ఇవి దోహదపడనున్నాయి. దేశవ్యాప్తంగా 3,400 టీపీసీలను ఏర్పాటు చేస్తోంది. యూజీసీ నెట్ పరీక్షను డిసెంబర్ 6 నుంచి 20 వరకు, జేఈఈ మెయిన్‌ను జనవరి 6 నుంచి 20 వరకు పలు స్లాట్లను కేటాయించి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జేఈఈ మెయిన్ దరఖాస్తులను 30 వరకు స్వీకరించనుంది. తెలంగాణలో 17 జిల్లాల్లో ఏర్పాటు చేసే 90 టీపీసీల్లో 7,230, ఏపీలో 13 జిల్లాల్లోని 122 టీపీసీల్లో 14,437 చొప్పున కంప్యూటర్లు అందుబాటులోకి తెచ్చేలా చర్యలు చేపట్టింది. ఈ టీపీసీ కోసం విద్యార్థులు ఎన్టీఏ వెబ్సైట్ లేదా ‘ఎన్టీఏ స్టూడెంట్’యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. వారికి టీపీసీ వివరాలను పరీక్షకు కొద్ది రోజుల ముందు ఎస్ఎంఎస్ రూపంలో పంపించనుంది. రిజిస్ట్రేషన్ సమయంలో విద్యార్థులు తమ సమీపంలోని టీపీసీలను ఎంపిక చేసుకుంటే అందులో ఏదోక కేంద్రాన్ని కేటాయించనుంది. -
జేఈఈ అభ్యర్థులకు ‘ఆన్లైన్’ కష్టాలు
సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీలు) నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీలు) తదితర జాతీయ విద్యా సంస్థల్లో ప్రవేశానికి సంబంధించి తొలిసారిగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ద్వారా నిర్వహించనున్న జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)– మెయిన్ విద్యార్థులకు అగ్నిపరీక్షలా మారుతోంది. ఈ పరీక్షను ఇక నుంచి కేవలం ఆన్లైన్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్)లోనే నిర్వహించనుండడంతో ఈ పరిస్థితి తలెత్తుతోంది. జేఈఈ మెయిన్‌కు దేశవ్యాప్తంగా 12 నుంచి 14 లక్షల మంది హాజరవుతారని అంచనా. గతేడాది వరకు పరీక్షను ఆఫ్‌లైన్ (పేపర్, పెన్ను విధానం)తోపాటు ఆన్లైన్లో నిర్వహించే వారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని విద్యార్థులు ఆఫ్‌లైన్ పరీక్షకే ప్రాధాన్యత ఇచ్చేవారు. ఈసారి ఆఫ్‌లైన్‌ను రద్దు చేసి ఆన్లైన్లో మాత్రమే పరీక్ష నిర్వహించనున్నారు. దీంతో కంప్యూటర్‌పై అవగాహన లేని వారు ఆన్లైన్లో పరీక్ష ఎలా రాయాలని ఆందోళనలో ఉన్నారు. కంప్యూటర్లే లేవు రాష్ట్రంలో 1100 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 2700 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఇంటర్మీడియెట్ సెకండియర్ విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో 2 లక్షల మంది ఉండగా.. ప్రైవేటు కాలేజీల్లో దాదాపు 4 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో అత్యధిక శాతం మంది జేఈఈ పరీక్షకు సిద్ధమవుతున్నారు. వీరికి ఆన్లైన్ టెస్టులపై శిక్షణ ఇవ్వడానికి కళాశాలల్లో కంప్యూటర్లు లేవు. దీంతో విద్యార్థులకు మాక్ ఆన్లైన్ టెస్టులపై శిక్షణ అందడం లేదు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే వారిలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంత విద్యార్థులే కావడంతో వారికి ఆన్లైన్ పరీక్ష మరింత గడ్డుగా మారనుంది. ప్రైవేటు కాలేజీల్లోనూ విద్యార్థులతో బట్టీ పట్టించడమే తప్ప ఆన్లైన్లో జరిగే పరీక్షలను ఎలా ఎదుర్కొనాలో శిక్షణ ఇవ్వడం లేదు. రఫ్ వర్క్ చేసుకుంటూ ఆన్లైన్లో గుర్తించడం కష్టమే జేఈఈ మెయిన్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లలో ఇచ్చే ప్రశ్నలకు ఎంతో లోతుగా ఆలోచిస్తే కానీ సరైన సమాధానాలు గుర్తించడం కష్టం. వీటికి సంబంధించి రఫ్ వర్క్‌కే ఎంతో సమయం పడుతుంది. కంప్యూటర్ స్క్రీన్‌పై ఆయా ప్రశ్నలను చదివి, ఆప్షన్లను పరిశీలించి మరోపక్క బయట అందుకు సంబంధించిన రఫ్ వర్క్ పూర్తిచేసి సమాధానాన్ని గుర్తించడంలో తీవ్ర తడబాటుకు గురయ్యే ప్రమాదముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పైగా జేఈఈ మెయిన్‌లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ మాత్రం తప్పుగా టిక్ చేసినా మార్కుల్లో కోతపడే ప్రమాదముందని విద్యార్థులు భయపడుతున్నారు. టీపీసీలు ఏర్పాటు చేసినా అదే పరిస్థితి మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థుల శిక్షణ కోసం దేశవ్యాప్తంగా టెస్టు ప్రాక్టీస్ సెంటర్స్ (టీపీసీ)లను ఏర్పాటు చేసినట్లు ఎన్టీఏ ప్రకటించింది. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్టీఏ.ఏసీ.ఐఎన్’ వెబ్సైట్లో సెప్టెంబర్ 8 నుంచి వీటిని యాక్టివ్‌లోకి తెచ్చింది. ఈ సెంటర్లు శనివారం మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు, ఆదివారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, తిరిగి 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అలాగే ఎన్టీఏ స్టూడెంట్ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా టెస్టు ప్రాక్టీస్‌లో పాల్గొనవచ్చు. అయితే కళాశాలల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉండవు. ఈ నేపథ్యంలో వారు మాక్ టెస్టులకు ఎలా ప్రిపేర్ అవుతారనేది ప్రశ్నగా మారింది. ఇప్పటివరకు టీపీసీలపై విద్యార్థులకు కాలేజీలు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. అటు మాక్ టెస్టులకు అవకాశం లేక, ఇటు టీపీసీ కేంద్రాల్లోనూ తర్ఫీదులేక తమ పిల్లలు నష్టపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఎంట్రెన్స్ పరీక్షలపై కీలక ప్రతిపాదన
-
ఎంట్రెన్స్ పరీక్షలపై బడ్జెట్లో సంచలన ప్రతిపాదన
దేశమంతటా పరీక్షల నిర్వహణకు ఎన్టీఎస్ ఏర్పాటు దేశమంతటా ప్రవేశ పరీక్షలను సమర్థంగా నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ సర్వీస్ (ఎన్టీఎస్)ను ఏర్పాటుచేయబోతున్నట్టు కేంద్ర బడ్జెట్లో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ప్రస్తుతం ప్రవేశ పరీక్షలను సీబీఎస్ఈ, ఐఐటీలు, ఏఐసీటీఈ వంటి విభిన్న సంస్థలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఎస్ పేరిట ఏర్పాటుచేస్తున్న నోడల్ ఏజెన్సీకి ఇక నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించే అన్ని ప్రవేశ పరీక్షల బాధ్యతలను అప్పగించనున్నారు. సీబీఎస్ఈ, ఐఐటీలు,ఐఐఎంలు, ఏఐసీటీఈ వంటి సంస్థలు ప్రతి ఏడాది నిర్వహిస్తున్న క్యాట్, జేఈఈ (మెయిన్), జేఈఈ (అడ్వాన్స్డ్), గేట్, సీఎంఏటీ, నీట్, నెట్ వంటి ప్రవేశ పరీక్షలకు 40లక్షలకు పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. ఇక విద్యాసంస్థలకు మరింత స్వతంత్రత (అటానమీ) ఇచ్చేందుకు యూనివర్సిటీ నిధుల సంఘం (యూజీసీ)ని పునర్వ్యవస్థీకరిస్తామని బడ్జెట్ లో జైట్లీ స్పష్టం చేశారు. దీనివల్ల ఎంచుకున్న కాలేజీలకు అటానమీ హోదా లభించనుంది. అదేవిధంగా ఫలితాల ఆధారంగా విద్యాసంస్థలకు అక్రిడిటేషన్ (గుర్తింపు) ఇవ్వబోతున్నామని జైట్లీ వెల్లడించారు. విద్యారంగం అంశాన్ని ప్రస్తావిస్తూ.. స్వామి వివేకానంద సూక్తిని ఉటంకించిన జైట్లీ.. ‘నాణ్యమైన విద్యే యువతకు శక్తిని ఇస్తుందని’ పేర్కొన్నారు. -
ఒకే సంస్థ ఆధ్వర్యంలో ‘జాతీయ’ పరీక్షలు
► నేషనల్ టెస్టింగ్ సర్వీసు ఏర్పాటు దిశగా అడుగులు ► కసరత్తు చేస్తున్న కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ ► 2018 నుంచి అమల్లోకి తెచ్చే ఆలోచనలు సాక్షి, హైదరాబాద్: జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశపరీక్షలను ఇకపై ఒకే సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించేలా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) ఆధ్వర్యంలో జేఈఈ మెయిన్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు(నెట్), నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్టు(నీట్) వంటి పరీక్షలు నిర్వహిస్తుండగా, అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ) సీమ్యాట్, జీప్యాట్ వంటి పరీక్షలను నిర్వహిస్తోంది. ఇక ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఏదేని ఓ ఐఐటీ ఏటా జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను నిర్వహిస్తోంది. ఇలా ఒక్కో సంస్థ ఒక్కో ప్రవేశ పరీక్షలను నిర్వహించడం వల్ల సమస్యలు తలెత్తుతున్నాయన్న వాదన చాలాకాలంగా ఉంది. ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు సీబీఎస్ఈ జేఈఈ మెయిన్ నిర్వహిం చడం, ఆ ఫలితాలు వస్తేనే ఐఐటీల్లో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించాల్సి ఉంది. అయితే ఫలి తాల వెల్లడి వంటి విషయాల్లో ఒక్కోసారి సమన్వయం కొరవడుతోంది. మరోవైపు వేర్వేరు ప్రవేశాల వల్ల కూడా గందరగోళం నెలకొంటోంది. అందుకే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐటీల్లో సంయుక్త ప్రవేశాలకు జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ(జోసా)ని ఏర్పాటు చేసింది. అలాగే ప్రవేశ పరీక్షలను కూడా ఒకే సంస్థ ఆధ్వర్యంలో చేపట్టాలన్న నిర్ణయానికి కేంద్రం వచ్చింది. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ సర్వీసు(ఎన్టీఎస్) ఏర్పాటును వేగవంతం చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులను ఆ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఇటీవల ఆదేశించారు. దీంతో ఎన్టీఎస్ ఏర్పాటుపై అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎన్టీఎస్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షల నిర్వహణను 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉంది.