సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల ఒకటో తేదీ నుంచి 6 వరకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్‌కు రాష్ట్రం నుంచి 67,319 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వారికి ఆన్‌లైన్‌లో రోజూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహించేందుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) 27 కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత జనవరిలో 37 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి 1,00,129 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే వచ్చేనెల 13న నిర్వహించనున్న నీట్ పరీక్షకు 55,800 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. గతేడాది 54,073 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయగా.. అప్పుడు 79 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ సంఖ్యను 112కి పెంచారు. కరోనా నేపథ్యంలో ఎన్‌టీఏ ఈసారి ప్రత్యేక చర్యలు చేపట్టింది. విద్యార్థులకు పలు సూచనలు జారీచేసింది.
ఇవీ సూచనలు..
►విద్యార్థులు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసిన అడ్మిట్‌కార్డులో ఉన్న కోవిడ్–19 సెల్ఫ్ డిక్లరేషన్ (అండర్‌టేకింగ్)లో వివరాలు నమోదు చేయాలి. దానిపై ఫొటో అతికించి సంతకంతోపాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి.
►గత 14 రోజులుగా తనకు జ్వరం, దగ్గు, గొంతు సమస్యలు, శ్వాస సమ స్యలు, శరీర నొప్పులు లేవని ఆ డిక్లరేషన్‌లో పేర్కొనాలి. కోవిడ్ పాజిటివ్ కేసు కాంటాక్ట్‌లో ఉన్నారా? లేదా? అన్న వివరాలను నమోదు చేయాలి.
►నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు. ూ గుంపులుగా కాకుండా భౌతికదూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి.
►అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్ తీసేసి కొత్త మాస్క్ ధరించాలి.
►శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు.
►పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్ చెప్పే వరకూ సీటు నుంచి లేవకూడదు.
►అడ్మిట్ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. బీఆర్క్ అభ్యర్థులు డ్రాయింగ్ టెస్ట్ కోసం జామెంట్రీ బాక్స్ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్ పెన్సిల్స్ లేదా క్రేయాన్స్ తెచ్చుకోవాలి.
►ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
►అటెండెన్స్ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తేవాలి.
►రఫ్ వర్క్ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. ఇంకా కావలిస్తే అదనంగా ఇస్తారు.
►అభ్యర్థులు తమ పేరు, రోల్ నంబర్‌ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్ బాక్స్‌లో వాటిని వేయాలి.
►సరిగా నింపిన అడ్మిట్ కార్డును కూడా డ్రాప్ బాక్స్‌లో వేయాలి.
►ప్రతి షిఫ్ట్ ప్రారంభమయ్యే ముందు సీటింగ్ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్‌ని పూర్తిగా శుభ్రపరుస్తారు.
Comments
Please login to add a commentAdd a comment