జేఈఈ మెయిన్స్ 2020 పరీక్ష సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం నుంచి ప్రారంభం అయ్యింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 6 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. కోవిడ్-19 నేపథ్యంలో ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో పాటు ప్రతిపక్ష నేతలు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు పలువురు నాయకులు కోరారు. అయితే పరీక్షలు మాత్రం యధావిధిగా ప్రకటించిన తేదీనే నిర్వహిస్తున్నారు.
ఈ పరీక్షకు సంబంధించి 10 ఆసక్తికరమైన విషయాలు:
1. జేఈఈ మెయిన్ 2020 ను దేశంలోని వివిధ పరీక్షా కేంద్రాల్లో సుమారు 8.58 లక్షల మంది రిజిస్టర్డ్ అభ్యర్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది.
2. జేఈఈ మెయిన్ 2020 పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు సహకరించాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోక్రియాల్ 'నిశాంక్' వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు విజ్ఞప్తి చేశారు.
3. అధికారిక సమాచారం ప్రకారం, సోమవారం సాయంత్రం 6 గంటల వరకు 7.78 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకున్నారు.
4. జేఈఈ మెయిన్స్ 2020 కోసం పరీక్షా కేంద్రాల సంఖ్యను 570 నుంచి 660 కు పెంచారు.
5. నీట్, జేఈఈ మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను పరీక్ష రోజులలో ముంబైలో ప్రత్యేక సబర్బన్ సర్వీసుల ద్వారా ప్రయాణించడానికి రైల్వే అనుమతిస్తుందని రైల్వే మంత్రి పియూష్ గోయల్ సోమవారం తెలిపారు.
6. ఈ సంవత్సరం, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ప్రధాన పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. జేఈఈ మెయిన్స్ మొదట ఏప్రిల్ 7 నుంచి ఏప్రిల్ 11 వరకు జరగాల్సి ఉంది.
7. అలాగే, నీట్, జేఈఈ మెయిన్స్ నిర్వహించడాన్ని నిరసిస్తూ సమాజ్ వాదీ పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు ఆందోళనకు దిగగా పోలీసులు వారిపై లాఠీ ఛార్జ్ చేసి సోమవారం వారిని అదుపులోకి తీసుకున్నారు.
8. ఐఐటి పూర్వ విద్యార్థుల బృందం అవసరమైన అభ్యర్థులకు పరీక్షా కేంద్రాలకు రవాణా సౌకర్యాలు కల్పించడానికి ఒక పోర్టల్‌ను ప్రారంభించింది.
9. బాలీవుడ్ నటుడు సోను సూద్ జేఈఈ మెయిన్స్ 2020 పరీక్ష కోసం విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాలకు వెళ్లడానికి సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. "రవాణా సదుపాయాలు లేని కారణంగా ఎవరూ వారి పరీక్షలను కోల్పోకూడదు" అని ఆయన అన్నారు.
10. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని, కరోనావైరస్ మహమ్మారి భయాల మధ్య ఇబ్బందులు లేకుండా జేఈఈ , నీట్‌లను ఆతిథ్యం ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గుజరాత్ విద్యాశాఖ మంత్రి భూపేంద్రసింగ్ చుదాసామా హామీ ఇచ్చారు. రాష్ట్రంలో జేఈఈ మెయిన్స్ 2020 కోసం మొత్తం 38,167 మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంది.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు:
1. కోవిడ్ -19 నేపథ్యంలో ముందుజాగ్రత్తగా, అభ్యర్థి సూచించిన సమయంలోపే పరీక్ష హాలుకు చేరుకోవాలి. గేట్ మూసివేసిన తర్వాత అభ్యర్థి రావడానికి అనుమతించరు.
2. పరీక్ష ముగిసేంత వరకు ఏ అభ్యర్థిని పరీక్ష గది నుంచి బయటకు వెళ్లడానికి అనుమతించరు. పరీక్ష పూర్తయిన తర్వాత ఇన్విజిలేటర్ సూచనల మేరకు బయటకు వెళ్లాలి.
3. అభ్యర్థులందరూ అడ్మిట్ కార్డులో ఇచ్చిన కోవిడ్ -19 సూచనలు, సలహాలను డౌన్‌లోడ్ చేసి జాగ్రత్తగా చదవాలి
4. అడ్మిట్ కార్డు, చెల్లుబాటు అయ్యే ఐడి ప్రూఫ్ లేకుండా ఏ అభ్యర్థిని పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించడానికి అనుమతించరు. కావున అభ్యర్థులు సరైన పత్రాలను తీసుకొని పరీక్షా కేంద్రానికి రావాలి.
పరీక్షా కేంద్రంలో తీసుకుంటున్న జాగ్రత్తలు:
1. ప్రతి పరీక్ష షిఫ్ట్ ప్రారంభానికి ముందు, చివరి షిఫ్ట్ ముగిసిన తరువాత, అన్ని సీట్లను పూర్తిగా శానిటైజర్లతో శుభ్రపరచడానికి ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2 సీట్ల మధ్య దూరం ఉంచనున్నారు.
2. పరీక్షా కేంద్రం ప్రవేశద్వారం వద్ద, పరీక్షా హాల్ లోపల అన్ని చోట్ల హ్యాండ్ శానిటైజర్లను అందుబాటులో ఉంచనున్నారు.
3. అభ్యర్థుల అడ్మిట్ కార్డులను చేతిలో కాకుండా బార్‌కోడ్ ద్వారా తనిఖీ చేయనున్నారు.
4. గ్లౌజ్‌లను ధరించి ఇన్విజిలేటర్లు పరీక్ష ప్రారంభానికి ముందు రఫ్ షీట్లను అన్ని డెస్క్‌లలో ఉంచుతారు.
5. అభ్యర్థులను పరీక్ష హాలులోకి రాగానే వారికి మూడు పొరలలతో కూడా మాస్క్‌ను ఇవ్వనున్నారు. వాటిని ధరించే అభ్యర్థులు పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా ఉండటానికి ఎగ్జామ్‌నేషన్ హాలులోనే మాస్క్‌లను ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment