సాక్షి, అమరావతి: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ), తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ)–2024కి పలు రాష్ట్రాల అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో ఆటంకాలు తప్పేలా లేవు. జేఈఈ మెయిన్ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు జనవరి, ఏప్రిల్‌ల్లో నిర్వహిస్తోంది.
అనంతరం జూన్/జూలై నాటికి అడ్వాన్స్‌డ్‌ను కూడా నిర్వహించి ఆయా ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలను చేపడుతోంది. అయితే వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహించాల్సిన జేఈఈకి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల రూపంలో అడ్డంకులు ఎదురయ్యే ప్రమాదం కనిపిస్తోంది. దీనివల్ల పరీక్షలు ఆలస్యమై ప్రవేశాల్లో కూడా జాప్యం జరగొచ్చని నిపుణులు చెబుతున్నారు.
ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం నిమగ్నం..
దేశంలో ఎన్నికల హడావుడి డిసెంబర్‌కన్నా ముందే ఆరంభం కానుంది. ఆ నెలలో మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ శాసనసభలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లలో ఆయా రాష్ట్రాల అధికార యంత్రాంగం మొత్తం నిమగ్నమై ఉంటుంది.
ఈ రాష్ట్రాల్లో ఎన్నికల తంతు ముగిశాక 2024 మార్చి, ఏప్రిల్‌ల్లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా సహా కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు లోక్‌సభకు సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల ఏర్పాట్లలోనూ అధికార యంత్రాంగం మొత్తం తలమునకలై ఉంటుంది. ఈ ఎన్నికల ప్రభావం జేఈఈపై పడుతుందని.. ఎన్నికల సమయంలో పరీక్షల నిర్వహణ కష్టసాధ్యం కాబట్టి వాయిదా వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.
గతేడాది ఇదే పరిస్థితి..
జేఈఈ మెయిన్ 2022కు కూడా ఇలాగే ఆటంకాలు ఏర్పడ్డాయి. అప్పట్లో ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా ఎన్నికలతో పరీక్షల షెడ్యూల్ వాయిదా పడింది. ఆ విద్యా సంవత్సరానికి జేఈఈ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ ముందరి సంవత్సరం అంటే 2021 సెప్టెంబర్ నాటికే విడుదల చేయాల్సి ఉండగా 2022 ఫిబ్రవరిలో కానీ విడుదల కాలేదు. ఆ షెడ్యూల్‌ను కూడా మూడుసార్లు మార్చి విద్యార్థులను తీవ్ర గందరగోళానికి గురిచేసింది.
ఏటా జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించేలా ఈ పరీక్షల సాధారణ షెడ్యూల్ ఉండగా జేఈఈ–2022 మెయిన్ మొదటి సెషన్ పరీక్షలు ఏప్రిల్ 16 నుంచి 21 వరకు, రెండో సెషన్ పరీక్షలు మే 24 నుంచి 29 వరకు ఉంటాయని ప్రకటించింది. వివిధ రాష్ట్రాల బోర్డుల పరీక్షలు అదే సమయంలో ఉండడం, సీబీఎస్‌ఈ ప్లస్2 తరగతుల పరీక్షల నేపథ్యంలో మళ్లీ రెండుసార్లు వేరే తేదీలను ప్రకటించినా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు ఆ ఏడాది జూన్, జూలైకు పరీక్షలను వాయిదా వేశారు.
ఫలితంగా జూన్ 3న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఆగస్టు 28కి వాయిదా పడింది. ఈసారి అంతకన్నా ఎక్కువగా డిసెంబర్ ముందు నుంచే ఎన్నికల హడావుడి ఆరంభం కానుండడం, ముఖ్యమైన పార్లమెంటు ఎన్నికలు కూడా జరగాల్సి ఉండడంతో జేఈఈ పరీక్షలు ఆలస్యమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ఆయా విద్యాసంస్థల నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 2024 జేఈఈ షెడ్యూల్ సెప్టెంబర్‌లో విడుదల చేస్తారో, లేదో అనుమానమేనని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment