ఏదైనా సాధించాలనే తపన మనసులో గాఢంగా ఉంటే ఏదీ అసాధ్యం కాదు. ఇందుకు నీట్, జేఈఈ పోటీపరీక్షలు మినహాయింపు కాదని నిరూపించాడు అసోంకు చెందిన ఓ కుర్రాడు. సీబీఎస్‌సీ 12వ తరగతి బోర్డు పరీక్షలో టాపర్‌గా నిలవడమే కాకుండా నీట్, జేఈఈలలో మంచి స్కోర్ సాధించాడు. అయినప్పటికీ తన అభిరుచికే పట్టంకడుతూ.. మెడికల్ సీటు, ఐఐటి మద్రాస్ అవకాశాన్ని వదిలి ఐఐఎస్‌సీలో సైన్స్ గ్రాడ్యుయేషన్ చేయాలని నిర్ణయించుకున్నాడు.
ఆ కుర్రాడి పేరు అధిరాజ్ కర్. అసోంతోని గౌహతి నివాసి. ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించి, సీబీఎస్‌సీ బోర్డు 12వ తరగతి పరీక్షలో కెమిస్ట్రీలో వందశాతం మార్కులు సాధించడంతోపాటు టాపర్‌గా నిలిచాడు. అలాగే నీట్ యూజీలో అసోంలో టాపర్‌గా నిలిచాడు. అదేవిధంగా మద్రాస్ ఐఐటీలోనూ సీటు దక్కించుకున్నాడు. అయితే అధిరాజ్ అటు ఐఐటీగానీ, ఇటు ఎంబీబీఎస్‌లను ఎంచుకోకుండా బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో సైన్స్ గ్రాడ్యుయేట్ డిగ్రీలో అడ్మిషన్ తీసుకున్నాడు.
అధిరాజ్ కెమిస్ట్రీ, బయాలజీలో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ తరహాలోని వివిధ జాతీయ స్థాయి పరీక్షలలో మంచి ప్రతిభ కనబరిచాడు. పరిశోధనారంగంలో అతనికున్న అభిరుచి అతనిని ఐఐఎస్‌సీ వైపు నడిపించింది. అకడమిక్ విద్యకు అతీతంగా అధిరాజ్‌కు వన్యప్రాణుల సంరక్షణ, సంగీతంపై అమితమైన ఆసక్తి ఉంది. ఈ నేపధ్యంలోనే డబ్ల్యుడబ్ల్యుఎఫ్ నేచర్ వైల్డ్ విజ్డమ్ క్విజ్‌లో మూడుసార్లు జాతీయ ఛాంపియన్‌గా నిలిచాడు. అధిరాజ్ గౌహతి యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బిమల్ కర్, డాక్టర్ మధుశ్రీ దాస్‌ల కుమారుడు.
Comments
Please login to add a commentAdd a comment