ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : ఎఫ్‌ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదుకు సంబంధించి కీలక ముందడుగు పడనుంది. ఘటనపై ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసే అంశంపై కేంద్ర హోం శాఖ.. లా కమిషన్ సలహా కోరింది. దీనిపై స్పందించిన లా కమిషన్ ఎఫ్‌ఐఆర్ నమోదుకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసినా సరిపోతుందని తెలిపింది. అయితే, ఆన్‌లైన్ విధానంలో ఫిర్యాదు స్వీకరణ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఉద్దేశపూర్వకంగా ఇతరుల పరువుకు భంగం కలిగించేందుకు ఈ విధానాన్ని కొందరు దుర్వినియోగం చేసే వీలుందని పేర్కొంది.
ఆన్‌లైన్‌లో ఫిర్యాదు స్వీకరించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అంశం సాధ్యాసాధ్యాలపై చర్చిస్తామని తెలిపింది. ఒకవేళ ఈ-ఎఫ్‌ఐఆర్‌కు అనుమతిస్తే దాని అమలుకు సంబంధించి ఒక చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ జరగాలని న్యాయశాఖ మాజీ సెక్రటరీ ఒకరు వ్యాఖ్యానించారు. కాగా, 2013లో లలితా కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మధ్య కేసులో సుప్రీం కోర్టు.. సీఆర్పీసీలోని సెక్షన్ 154 ప్రకారం తీవ్రమైన, ప్రాథమిక విచారణ అవసరంలేని నేరాల్లో ఎఫ్‌ఐఆర్ నమోదు తప్పనిసరి అని పేర్కొంది. సీఆర్పీసీలోని సెక్షన్ 154 కు సవరణలు చేస్తే ఈ-ఎఫ్‌ఐఆర్‌కు మార్గం సుగమం అవుతుందని గత జనవరిలో జరిగిన సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. ఈ సమావేశ సూచనల ప్రాతిపదికగా హోంశాఖ.. లా కమిషన్ సలహా కోరింది.
‘బాధితులు నేరుగా వెళ్లి పోలీసులని ఆశ్రయించి ఘటన గురించి వివరించడం కష్టమైన పనే. ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయడం చాలా సులభం. కానీ, పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడానికి వచ్చిన వ్యక్తులు లేదా బాధితులు మాతో అబద్ధం చెప్పడానికి సంశయిస్తారు. నేరుగా ఫిర్యాదు స్వీకరించడం వల్ల ఫిర్యాదుదారుడి వైఖరి తెలుసుకునే వీలుంటుంద’ని ఒక సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.
ఉపయోగకరమే.. కానీ..!
హోంశాఖ అభిప్రాయాలను మానవ హక్కుల కార్యకర్త కవితా కృష్ణన్ స్వాగతించారు. ఎంతోమందికి ‘ఆన్‌లైన్‌లో ఫిర్యాదు’ విధానం మేలు చేకూరుస్తుందని అన్నారు. అయితే, బాధితుల దగ్గరనుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకున్న అనంతరం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి పోలీసులు కావాలని ఆలస్యం చేయొచ్చని వ్యాఖ్యానించారు. పేదప్రజలకు ఆన్‌లైన్ సేవలు పొందడం ఇబ్బందిగా మారొచ్చని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment