ఇంజనీరింగ్‌ సీటు ఇలా.. | Engineering Seat Higher Education Process Can Be Completed Online From Home | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌ సీటు ఇలా..

Published Sat, Aug 28 2021 2:46 AM | Last Updated on Sat, Aug 28 2021 2:46 AM

Engineering Seat Higher Education Process Can Be Completed Online From Home - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ ఖరారైన నేపథ్యంలో ధ్రువ పత్రాల పరిశీలన కోసం సహాయ కేంద్రానికి వెళ్లడం మినహా మిగతావన్నీ ఇంట్లోంచే ఆన్‌లైన్‌లో పూర్తి చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది. స్లాట్‌ బుకింగ్‌ మొదలు కాలేజీలో చేరే వరకూ విద్యార్థులు ఏం చేయాలనే వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచింది. 

ముందు ఇలా చేయండి 
ఈ నెల 30వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ మొదలవుతుంది. వచ్చే నెల 9వ తేదీ వరకూ ఎంసెట్‌ అర్హత పొందిన అభ్యర్థులు ‘ ్టట్ఛ్చఝఛ్ఛ్టి. nజీఛి. జీn’ పేజీకి లాగిన్‌ అవ్వాలి. అక్కడ రిజిస్ట్రేషన్‌ కాలమ్‌లోకి వెళ్లాలి. ఎంసెట్‌ హాల్‌ టికెట్, పుట్టిన తేదీ, ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష హాల్‌టికెట్‌ నంబర్‌ను నిర్ణీత కాలమ్స్‌లో నింపాలి. ఇందులోనే ఆధార్‌ సంఖ్య, మొబైల్‌ నంబర్, కుల ధ్రువీకరణ పత్రం నంబర్‌ ఇవ్వాలి. ఇచ్చిన మొబైల్‌ నంబర్‌ చివరి వరకూ ఉంటుంది. మార్చడం కుదరదు.  

ప్రాథమిక సమాచారం పొందుపరిచిన తర్వాత రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీలు రూ. 600) ఫీజు ఆన్‌లైన్‌ ద్వారానే చెల్లించాలి. అప్పుడు మీ పేరుతో అకౌంట్‌ క్రియేట్‌ అవుతుంది. దీని ద్వారా సర్టిఫికెట్‌ పరిశీలన తేదీని, దగ్గర్లోని కేంద్రాన్ని, సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. దీంతో మొదటి మెట్టు పూర్తవుతుంది. స్లాట్‌ బుకింగ్‌ను ఈ నెల 30 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకూ చేసుకోవచ్చు. 
పరిశీలనకు ఏయే సర్టిఫికెట్లు కావాలి? 

మీరు ఎంచుకున్న సహాయ కేంద్రానికి టీఎస్‌ఎంసెట్‌ ర్యాంక్‌ కార్డు, హాల్‌ టికెట్, ఆధార్, ఎస్సెస్సీ తత్సమాన మార్కుల మెమో, ఇంటర్‌ మెమో, ఆరు నుంచి ఇంటర్‌ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, టీసీ, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు తీసుకెళ్లాలి. ఇవన్నీ ఒరిజినల్స్‌తోపాటు మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. 

సర్టిఫికెట్ల పరిశీలన వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకూ కొనసాగుతుంది. సహాయ కేంద్రంలో పరిశీలన అనంతరం సంబంధిత అధికారి ధ్రువీకరించినట్టు రసీదు ఇస్తారు. 
ఆప్షన్‌ వేళ కంగారొద్దు... 

వెరిఫికేషన్‌ ప్రక్రియ పూర్తయిన వెంటనే అభ్యర్థి రిజిస్టర్డ్‌ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత తిరిగి టీఎస్‌ఎంసెట్‌ పేజీకి మీ యూజర్‌ ఐడీ ద్వారా లాగిన్‌ అవ్వాలి. అప్పుడు ఆప్షన్స్‌ను ఎంపిక చేసుకోవాలి.    రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్‌ కాలేజీల వివరాలు ఎంసెట్‌ వెబ్‌ పోర్టల్‌లోనే ఉంటాయి. ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉందో తెలుస్తుంది. ఆ కాలేజీ కోడ్‌ పక్కనే ఉంటుంది. జిల్లాలవారీగా కాలేజీల వివరాలూ ఉంటాయి. అభ్యర్థి ఎంపిక చేసుకొనే కోర్సు, కాలేజీ కోడ్‌ ముందుగా రాసుకొని ఆ తర్వాత వెబ్‌లో క్లిక్‌ చేస్తే కంగారు పడాల్సిన అవసరం ఉండదు. వరుస క్రమంలో ప్రాధాన్యతను ఎంపిక చేసుకున్న తర్వాత డేటాను సబ్మిట్‌ చేయాలి. 

ఆప్షన్స్‌ను ఎన్నిసార్లయినా మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటు సెప్టెంబర్‌ 13 రాత్రి వరకూ ఉంటుంది. రాత్రి 12 తర్వాత సైట్‌ ఫ్రీజ్‌ అవుతుంది. ఇక ఎలాంటి మార్పుకు అవకాశం ఉండదు. 
15న సీటు ఖరారు... 

సెప్టెంబర్‌ 15వ తేదీన తొలిదశ సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థి తన ఐడీకి లాగిన్‌ అయి సీటు వచ్చిందా లేదా? చూసుకోవచ్చు. సీటొస్తే కేటాయింపు ఆర్డర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అందులో పేర్కొన్న ఫీజును అదే నెల 20వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించాలి. సీటు రాని పక్షంలో మళ్లీ రెండో దశ వెబ్‌ ఆప్షన్‌కు వెళ్లొచ్చు. ఈసారి ఎలాంటి ఎంట్రీ ఫీజు ఉండదు. అన్ని దశల కౌన్సెలింగ్‌ పూర్తయిన తర్వాతే అభ్యర్థి కాలేజీకి వెళ్లి ఒరిజినల్‌ సర్టిఫికెట్లు సమర్పించాల్సి ఉంటుంది.  

ఇదీ షెడ్యూల్‌.. 
స్లాట్‌ బుకింగ్‌: 30–8–21 నుంచి 9–9–21 
ధ్రువపత్రాల పరిశీలన: 4 నుంచి 11 వరకు 
వెబ్‌ ఆప్షన్స్‌: 4 నుంచి 13 వరకు 
తొలి దశ సీట్ల కేటాయింపు: 15–9–21 
సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: 20–9–21  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement