అఖిల భారత సాంకేతిక విద్యామండలి నిర్ణయం... ఇదే జరిగితే తెలంగాణకు ఈ ఏడాది మరో 10 వేల సీట్లు
ఉత్తరాది రాష్ట్రాల్లో బీటెక్‌పై అయిష్టత
కొత్త సీట్లకు కాలేజీల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలకు ఇంజనీరింగ్ సీట్లు పెరగనున్నాయి. అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఈ మేరకు వెసులుబాటు కల్పిస్తోంది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తున్న డిమాండ్‌ను ఏఐసీటీఈ పరిగణనలోకి తీసుకున్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌పై విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు.
దీంతో అక్కడ మేనేజ్‌మెంట్ కోర్సుల పెంపునకు అనుమతి ఇవ్వాలని భావిస్తున్నారు. ఇదే జరిగితే తెలంగాణవ్యాప్తంగా 10 వేల ఇంజనీరింగ్ సీట్లు పెరుగుతాయని రాష్ట్ర అధికారులు అంచనా వేస్తున్నారు. కంప్యూటర్ కోర్సుల్లోనే సీట్లు పెంచాలని ఇంజనీరింగ్ కాలేజీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ బ్రాంచ్‌లలో సీట్లకు కోత పడొచ్చు.గత ఏడాది 7 వేల సీట్లు ఈ బ్రాంచ్‌లలో తగ్గాయి. వీటి స్థానంలో కంప్యూటర్ కోర్సుల్లో పెంచారు. దీంతోపాటు మరో 7 వేల వరకూ కంప్యూటర్ బ్రాంచ్‌ల్లో సీట్లు పెరిగాయి.
మారుతున్న ట్రెండ్
కొన్నేళ్లుగా దక్షిణ, ఉత్తరాది రాష్ట్రాల మధ్య కోర్సుల ఎంపికలో తేడా కనిపిస్తోందని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఏఐసీటీఈ గుర్తించాయి. తమిళనాడు, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్ఛేరిలో బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ (బీటెక్), ఎంబీఏ, ఎంసీఏల్లో ఎక్కువగా చేరుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యార్థులు ఎక్కువగా సంప్రదాయ డిగ్రీ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు ఇంజనీరింగ్ తర్వాత ఎంఎస్‌కు విదేశాలకు వెళ్లేందుకు, లేదా సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లోని విద్యార్థులు డిగ్రీ తర్వాత సివిల్స్, ఇతర పోటీ పరీక్షల వైపు దృష్టి పెడుతున్నారు. ఈ డిమాండ్‌ను బట్టే ఎక్కువ ఇంజనీరింగ్ సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి.
► దేశవ్యాప్తంగా 12,47,667 బీటెక్ సీట్లు అందుబాటులో ఉంటే, వీటిల్లో 6,74,697 (54 శాతం) సీట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి.
►ఎంసీఏలో 70,065 సీట్లు ఉంటే, 30,812 (44 శాతం) దక్షిణాదిలో ఉన్నాయి.
►ఎంబీఏ, పీజీడీఎం వంటి మేనేజ్‌మెంట్ కోర్సులకు సంబంధించిన సీట్లు 3,39,405 దేశవ్యాప్తంగా ఉంటే, దక్షిణాదిన 1,57,632 సీట్లున్నాయి.
►రానురాను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ సీట్లు దక్షిణాదిలోనే పెరగడానికి ఇదే కారణమని ఏఐసీటీఈ భావిస్తోంది.
►2015–16లో దక్షిణాది రాష్ట్రాల్లో 48.77 బీటెక్ సీట్లు ఉంటే, కేవలం ఆరేళ్లలో అవి 5.3 శాతం పెరిగాయి. ఇప్పుడిది 7 శాతానికి చేరొచ్చని అంచనా వేస్తున్నారు.
నైపుణ్యంపై దృష్టి
ఇంజనీరింగ్ విద్యలో కొత్త కోర్సులు వస్తున్నా, విద్యార్థుల్లో నైపుణ్యం ఉండటం లేదని పలు సర్వేలు చెబుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఇంజనీరింగ్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే ప్రాక్టికల్‌గా అవసరమైన నైపుణ్యం పొందేలా ప్రాజెక్టులు రూపొందిస్తున్నారు. తరగతిగది కన్నా, నైపుణ్యం పొందే పారిశ్రామిక సంస్థల్లో పనిచేసేలా చేయాలని ఏఐసీటీఈ సూచిస్తోంది.
టెక్నాలజీలో దక్షిణాది ముందంజ
దక్షిణాది రాష్ట్రాల విద్యార్థులు బీటెక్ చదవడానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ ట్రెండ్ రానురాను పెరుగుతోంది. తక్షణ ఉపాధితో పాటు, నైపుణ్యం పెంచే విధంగా ఇంజనీరింగ్‌లో వస్తున్న మార్పులూ ఇందుకు కారణమే. అందుకే తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ సీట్ల పెంపు అనివార్యమవుతోంది. గణితం నేపథ్యం విద్యార్థులూ ఉత్తరాది కన్నా, దక్షిణాదిలో ఎక్కువగా ఉంటున్నారు. ఇది కూడా బీటెక్ సీట్ల డిమాండ్‌కు కారణమవుతోంది. – ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ఉన్నత విద్య మండలి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment