కళ్లు బైర్లు కమ్మే అవినీతి, అక్రమాలు | TDP MLA Atchannaidu Arrested By ACB In ESI Scam | Sakshi
Sakshi News home page

అచ్చెన్న గారి అవినీతి, అక్రమాలు

Published Fri, Jun 12 2020 12:25 PM | Last Updated on Fri, Jun 12 2020 12:59 PM

TDP MLA Atchannaidu Arrested By ACB In ESI Scam - Sakshi

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పాలనలో చోటుచేసుకున్న అనేక అవినీతి అక్రమాలు ఒక్కొక్కటీ వెలుగుచూస్తున్నాయి. అమరావతి భూ కుంభకోణం నుంచి కార్మికుల సొమ్మును కాజేసిన పచ్చ నేతల అవినీతి బండారం బయటపడుతోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని.. ఇష్టారాజ్యంగా దోచుకున్న సొమ్ము నేడు బహిర్గతమవుతోంది. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈఎస్‌ఐ స్కాంలో మాజీమంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును ఎట్టకేలకు ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. రూ. 988.77 కోట్ల విలువైన మందులతో పాటు వైద్య పరికరాల కొనుగోలులో సుమారుగా రూ.150 కోట్లపైన అవినీతి అక్రమాలు జరిగినట్లు  ఏసీబీ తేల్చింది. దీంతో ఈఎస్‌ఐ స్కాం మరోసారి తెరపైకి వచ్చింది.

సాక్షి, అమరావతి : చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) డైరెక్టర్లుగా డాక్టర్‌ బీ.రవికుమార్, సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్‌ జీ.విజయ్‌కుమార్‌ వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషథాలు, వైద్య ఉపకరణాలు, ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు, ల్యాబ్‌ కిట్స్, ఫర్నీచర్‌ పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. రూ.975.79 కోట్ల రూపాయల మేర కొనుగోలు జరిగాయి. అయితే ఈ ప్రక్రియలో యథేచ్ఛగా నియమాలు, మార్గదర్శకాలను ఉల్లంఘించారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన డ్రగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. మరోవైపు ఆ కొనుగోళ్ల ప్రక్రియలో ఎక్కడా ఓపెన్‌ టెండర్లు కూడా పిలవలేదు. దీని వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడింది. (నకిలీ బిల్లులతో అచ్చెన్నాయుడు స్కాం)

ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలలో చోటు చేసుకున్న అవకతవకలు, అక్రమాలు – ముఖ్యమైన పాయింట్స్‌:

విజిలెన్సు విచారణలో బయటపడ్డ అంశాలు
నాన్‌ రేటు కాంట్రాక్ట్‌ సంస్థలకు సంబంధించి దాఖలైన కొటేషన్లన్నీ నకిలీవి అని విచారణలో గుర్తించారు. కొటేషన్లు, వాటి కవర్లపై చేతి రాతలన్నీ ఒకేలా ఉన్నాయి. అవి డెరెక్టర్‌ ఆఫ్‌ ఇన్సూరెన్సు మెడికల్‌ సర్వీసెస్‌ (డీఐఎంఎస్‌) సిబ్బందివిగా తేల్చారు. వాటిని తామే రాసినట్లు  డీఐఎంఎస్‌కు చెందిన ఫార్మసిస్ట్‌ కె.ధనలక్ష్మి, సీనియర్‌ అసిస్టెంట్‌ ఇ.రమేష్‌బాబు అంగీకరించారు. ఆ కొటేషన్ల ఆధారంగా ఈఎస్‌ఐ ఆస్పత్రులకు అవసరమైన మందులు, ఔషధాలు సర్జికల్‌ ఐటెమ్స్, ల్యాబ్‌ కిట్లు, ల్యాబ్‌ ఎక్విప్‌మెంట్, ఫర్నీచర్‌ కొనుగోలుకు డైరెక్టర్లు కొనుగోళ్లు ఆర్డర్లు జారీ చేశారు. తమకు అనుకూలమైన కంపెనీకే ఆర్డర్‌ ఇచ్చేలా ఆ విధంగా నకిలీ కొటేషన్లు సృష్టించారు.

పరిమితికి మించి ఔషధాల కొనుగోలు
ఆ డైరెక్టర్ల హయాంలో మందులు, ఔషధాల కొనుగోలు కోసం రూ.293.51 కోట్లు కేటాయించగా, యథేచ్ఛగా ఆ పరిమితిని మించి రేట్‌ కాంట్రాక్ట్, నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ఏకంగా రూ.698.36 కోట్ల విలువైన మందుల, ఔషధాలు కొనుగోలు చేశారు. నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు ప్రయోజనం కలిగించేందుకు నిబంధనలను తుంగలో తొక్కారు. నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి మందులు, ఔషధాలు కొనుగోలు చేసిన తీరులో జరిగిన అక్రమాలు చూస్తే, కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి నెలకొంది. (టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్ట్)

అదనంగా చెల్లింపులు
ర్యాన్‌డమ్‌గా చేసిన తనిఖీలో పర్చేజ్‌ ఇన్‌వాయిస్‌ ప్రైజ్, సేల్‌ ఇన్‌వాయిస్‌ ప్రైజ్‌ మధ్య చాలా తేడా ఉన్నట్లు గుర్తించారు. రాశి ఫార్మా, వీరేశ్‌ ఫార్మాల నుంచి రూ.15.93 కోట్ల విలువైన మందులు, ఔషధాలు కొనుగోలు చేశారు. ఆ మేరకు ఐఎంఎస్‌ డైరెక్టర్లు పర్చేజ్‌ ఆర్డర్లు జారీ చేశారు. అయితే ఆ రెండు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌  సంస్థల ఇన్‌వాయిస్‌ ప్రైజ్‌ ప్రకారం ఆ మందులు, ఔషథాల అసలు ధర రూ.8.52 కోట్లు మాత్రమే. దానికి 20శాతం మార్జిన్‌ (లాభం) వేసుకుంటే ఆ ధర రూ.10.22 కోట్లు అవుతుంది. కానీ ఐఎంఎస్‌ డైరెక్టర్లు మాత్రం ఏకంగా రూ.15.93 కోట్లు చెల్లించారు. ఆ విధంగా కేవలం ఆ రెండు సంస్థలకు మాత్రమే రూ.5.70 కోట్లు అదనంగా చెల్లించారు. ఆ విధంగా అనేక నాన్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఇష్టారాజ్యంగా అధిక ధరలు చెల్లించి మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు.

నిబంధనలు బేఖాతరు.. అధిక ధరలకు కొనుగోలు
నిబంధనల ప్రకారం రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి మాత్రమే అత్యధికంగా కొనుగోళ్లు జరపాల్సి ఉన్నప్పటికీ ఐఎంఎస్‌ డైరెక్టర్లు మాత్రం ఎక్కడా వాటిని పట్టించుకోలేదు. అన్నింటినీ తుంగలో తొక్కి అత్యధిక కొనుగోళ్లు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచే జరిపారు. తద్వారా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించారు. ఆ విధంగా 2014–15 నుంచి 2018–19 వరకు 5 ఏళ్లలో ఐఎంఎస్‌ డైరెక్టర్లు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి రూ.89.58 కోట్ల విలువైన మందులు, ఔషథాలు కొనుగోలు చేశారు. అయితే అవే ఔషధాలు రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి కొనుగోల చేసి ఉంటే కేవలం రూ.38.56 కోట్లకు వచ్చేవి. కానీ ఆ సంస్థలకు పర్చేజ్‌ ఆర్డర్‌ ఇవ్వకుండా నాన్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి మందులు, ఔషథాలు కొనుగోలు చేయడం ద్వారా రూ.51.02 కోట్లు అదనంగా చెల్లించారు. ఇది ఏకంగా 132 శాతం అధికం. ఆ విధంగా నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలకు 2014–15లో 131.80 శాతం, 2015–16లో 159.40 శాతం, 2016–17లో 136.27 శాతం, 2017–18లో 198.66 శాతం, 2018–19లో 80.04 శాతం అధికంగా చెల్లించారు. అలా గత 5 ఏళ్లలో సగటున 132.30 శాతం అధికంగా చెల్లించారు.

అనవసర కొనుగోళ్లు.. తమ వారికే ఆర్డర్లు
అవసరాలకు మించి కొనుగోలు చేయడం వల్ల వాటిలో చాలా వరకు నిరుపయోగంగాను ఉండిపోయాయి. ఈఎస్‌ఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలలో గత ఏడాది కాలంగా రూ.232.32 కోట్ల విలువైన ఔషధాలు, సర్జికల్‌ ఐటెమ్స్‌ నిరుపయోగంగా ఉన్నట్లు విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు తనిఖీలో గుర్తించారు. ఐఎంఎస్‌ డైరెక్టర్లు పర్చేజ్‌ ఆర్డర్‌ ఇచ్చిన నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల్లో జెర్కాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రావిల రవితేజస్వికి చెందినది కాగా, ఆమె డిఐఎంఎస్‌ సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్స్‌కు చెందిన ఫార్మసిస్టు కె.ధనలక్ష్మి కోడలు. అందుకే ఆ సంస్థకు ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఉదారంగా పర్చేజ్‌ ఆర్డర్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్, డాక్టర్‌ జి.విజయకుమార్‌ ఇద్దరూ జెర్కాన్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు ఏకంగా రూ.9.50 కోట్ల పర్చేజ్‌ ఆర్డర్లు ఇచ్చారు. ఆ విధంగా ఆ సంస్థకు ఆర్థిక ప్రయోజనం కల్పించారు.

ఔషధాలు
డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్‌ ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థలు.. విజయనగరానికి చెందిన ఎస్‌కేపీ ఎంటర్‌ప్రైజెస్, నర్సారావుపేటకు చెందిన సీతారామ్‌ ఫార్మాస్యూటికల్స్‌ నుంచి రూ.5.71 కోట్ల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు.

ల్యాబ్‌ కిట్స్‌
వాస్తవానికి ల్యాబ్‌ కిట్స్‌ను హెమోక్యూ, బయోరాడ్, సీమెన్స్‌ వంటి ప్రొప్రైటరీ సంస్థల నుంచి కొనుగోలు చేయాల్సి ఉన్నప్పటికీ, ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక్కడ కూడా యథేచ్ఛగా నియమావళి ఉల్లంఘించి నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి ల్యాబ్‌ కిట్స్‌ కొనుగోలు చేశారు. లెజెండ్‌ ఎంటర్‌ప్రైజెస్, అవాంతర్‌ పర్ఫార్మెన్సెస్‌ ఇండియా లిమిటెడ్, ఓమ్ని మెడి వంటి నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి నామినేషన్‌ పద్ధతిలో రూ.237 కోట్ల విలువైన ల్యాబ్‌ కిట్స్‌ కొనుగోలు చేశారు. ఆ విధంగా ఆయా సంస్థలకు 36 శాతం అధిక ధరలు చెల్లించారు.

సర్జికల్‌ ఐటెమ్స్‌.. ఫర్నీచర్‌ కొనుగోలు
 ఇక్కడ కూడా ఐఎంఎస్‌ డైరెక్టర్లు బహిరంగ టెండర్లు పిలవకుండా నాన్‌ రేట్‌ కాంట్రాక్ట్‌ సంస్థల నుంచి రూ.47.77 కోట్ల విలువైన సర్జికల్‌ ఉపకరణాలు కొనుగోలు చేశారు. దీంతో పాటు ఏ ఇండెంట్‌ లేకుండా మరో రూ.8.06 కోట్ల విలువైన సర్జికల్‌ ఐటెమ్స్‌ కూడా సేకరించారు. ఫర్నీచర్‌ కొనుగోలులో కూడా ఐఎంఎస్‌ డైరెక్టర్లు నిబంధనలు పాటించలేదు. ఎక్కడా బహిరంగ టెండర్లు పిలవకుండా రూ.6.62 కోట్ల విలువైన ఫర్నీచర్‌ కొనుగోలు చేశారు. వారు చెల్లించిన ధరతో, మార్కెట్‌లో వాస్తవ ధరలను ఇదమిద్ధంగా పోల్చి చూసిన అధికారులు షాక్‌ అయ్యారు. ఫర్నీచర్‌ కొనుగోలులో ఐఎంఎస్‌ డైరెక్టర్లు 70 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు.

అచ్చెన్నాయుడు – టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
ఈ టెలి హెల్త్‌ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్‌ పనులు అప్పగించాలని నాడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న కె.అచ్చెన్నాయుడు స్వయంగా ఐఎంఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్‌కు లేఖ రాశారు. దీంతో ఏ టెండర్‌ పిలవకుండానే నామినేషన్‌ పద్ధతిలో ఆయన, టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు కాంట్రాక్ట్‌ పనులు అప్పగించారు. టోల్‌ఫ్రీ సర్వీసులు, ఈసీజీ సర్వీసులకు సంబంధించి ఐఎంఎస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్‌ ఆ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకున్నారు.

ఇదీ కాంట్రాక్ట్‌ రేటు
వివిధ అవసరాలతో పాటు, సహాయం కోరుతూ టోల్‌ ఫ్రీ సర్వీసుకు రోగులు చేసే ప్రతి కాల్‌కు (ఆ కాల్‌ అటెండ్‌ చేయకపోయినా సరే) నెలకు రూ.1.80, రోగులకు చేసే ప్రతి ఈసీజీకి రూ.480 చొప్పున చెల్లించేలా డాక్టర్‌ రమేష్‌కుమార్‌ ఆ సంస్థతో ఎంఓయూ చేసుకున్నారు. ఆ విధంగా ఎలాంటి విచారణ లేకుండా దాఖలు చేసిన అన్ని బిల్లులను టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెల్లించినట్లు విజిలెన్సు దర్యాప్తులో గుర్తించారు.

అర్హత లేని వారితో పరీక్షలు
అయితే ఇక్కడ కూడా టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ నిబంధనలు ఉల్లంఘించింది. ఎంఓయూ ప్రకారం వైద్య పరీక్షల కోసం డీఎం కార్డియాలజిస్టులను నియమించుకోవాల్సి ఉన్నప్పటికీ, పీజీ డిప్లొమా క్లినికల్‌ కార్డియాలజిస్టులను ఏర్పాటు చేసుకుని పని కానిచ్చారు. ప్రతి వైద్య పరీక్షకు పక్కాగా బిల్లులు పొందారు.

టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు బిల్లులు
కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం ఐఎంఎస్‌ డైరెక్టర్లు డాక్టర్‌ సీ.కే.విజయకుమార్, డాక్టర్‌ జి.విజయకుమార్‌ ఇద్దరూ టెలి హెల్త్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు టోల్‌ఫ్రీ సర్వీస్‌కు గానూ రూ.4.15 కోట్లు, ఈసీజీ పరీక్షలకు సంబంధించి రూ.3.81 కోట్లు చెల్లించారు. 

ఎస్‌టీపీ–జలం ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
తిరుపతి ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మురుగునీటి పారిశుద్ధ్య కేంద్రం (ఎస్‌పీటీ) ఏర్పాటు కోసం ఎలాంటి టెండర్లు పిలవకుండానే అప్పుడు ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా ఉన్న డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు రూ.1.94 కోట్ల మొత్తానికి వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారు. ఇందు కోసం కనీసం ప్రభుత్వం నుంచి అనుమతి కూడా తీసుకోలేదు. దీంతో పాటు, రాజమండ్రి, విజయవాడ, తిరుపతిలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లోని ఎస్‌పీటీలు, కర్నూలు జిల్లా అదోనిలోని డయాగ్నస్టిక్‌ కేంద్రంలో ఉన్న ఎస్‌పీటీ.. అలా మొత్తం నాలుగు ఎస్‌పీటీల వార్షిక నిర్వహణ కాంట్రాక్ట్‌ కూడా డాక్టర్‌ రమేష్‌కుమార్, జలం ఎన్విరాన్‌మెంట్‌ సంస్థకు రూ.3.49 కోట్లకు అప్పగించారు. వాస్తవానికి ఆ కేంద్రాలేవీ పని చేసే స్థితిలో లేవు. అదోనిలో తొలుత ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్‌ కేంద్రాన్ని 2 కిలోమీటర్ల దూరంలో మరో చోటకు తరలించారు. రెండేళ్ల క్రితం ఆ కేంద్రాన్ని తరలించినా, తొలుత డయాగ్నస్టిక్‌ కేంద్రం ఏర్పాటు చేసిన ప్రదేశం వద్ద ఉన్న ఎస్‌పీటీకి వార్షిక నిర్వహణ వ్యయం చెల్లిస్తూనే ఉన్నారు. ఇంఛార్జ్‌ సివిల్‌ సర్జెన్‌ ఇస్తున్న ఒక సర్టిఫికెట్‌ను ఆధారంగా చేసుకుని ఐఎంఎస్‌ డైరెక్టర్లు ఆ బిల్లు చెల్లిస్తున్నారు.

బయోమెట్రిక్‌ ఉపకరణాలు
హైదరాబాద్‌కు చెందిర ప్రొడిగీ కంప్యూటర్స్‌–ల్యాప్‌టాప్స్‌ సంస్థ డిఐఎంఎస్‌కు 100 బయోమెట్రిక్‌ ఉపకరణాలు సరఫరా చేసింది. అప్పుడు ఐఎంఎస్‌ డైరెక్టర్‌గా డాక్టర్‌ సీ.కే.రమేష్‌కుమార్‌ ఉన్నారు. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తూ, ఏపీ టెక్నాలజీ సర్వీసెస్‌ మార్గదర్శకాలను బేఖాతరు చేస్తూ, డాక్టర్‌ రమేష్‌కుమార్‌ ఒక్కో బయోమెట్రిక్‌ ఉపకరణానికి ఏకంగా రూ.70,670 చెల్లించారు. వాస్తవానికి మార్కెట్‌లో ఒక్కో బయోమెట్రిక్‌ ఉపకరణం ధర కేవలం రూ.16,992 మాత్రమే. అయినా ఓపెన్‌ టెండర్లకు వెళ్లకుండా నామినేషన్‌ పద్ధతిలో ప్రొడిగీ కంప్యూటర్స్‌ నుంచి 100 బయోమెట్రిక్‌ ఉపకరణాలు కొనుగోలు చేసిన డాక్టర్‌ రమేష్‌కుమార్, అందుకోసం రూ.53.67 లక్షలు అదనంగా చెల్లించారు. వాటిలో చాలా వరకు యంత్రాలు పని చేయడం లేదని విజిలెన్సు అధికారులు దర్యాప్తు సమయంలో గుర్తించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement