సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో అవినీతిపై యుద్ధం ప్రకటించి సీఎం వైఎస్ జగన్ అక్రమార్కుల భరతం పడుతుంటే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు ధ్వజమెత్తారు. విశాఖలో ఆదివారం రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 'చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ గత ఐదేళ్లూ రాష్ట్రాన్ని దోచుకున్నారు. వారి హయంలో జరిగిన ప్రతి దోపిడీ వెనుక వీరిద్దరి హస్తం ఉంది. చంద్రబాబు అవినీతిని బయటపెడుతుంటే.. తప్పుడు ఆరోపణలతో విషయాన్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నారు. అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ చేస్తే బీసీ కార్డు వాడుతున్నారు. జేసీ ప్రభాకరరెడ్డి అరెస్టయితే కక్ష సాధింపు అని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. సీఎం జగన్ గేట్లు ఎత్తితే టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం వైఎస్సార్‌సీపీలో చేరేవారు. కానీ వైఎస్ జగన్ విలువలు కలిగిన వ్యక్తి కాబట్టే మీలాగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించలేదు. పార్టీలో చేరాలనుకున్నా వారు రాజీనామా చేసి రావాలని చెప్పారు. మీరు అధికారంలో ఉన్పప్పుడు 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి కొందరికి మంత్రి పదవి ఇచ్చిన చరిత్ర మీది. చదవండి: 'మీ అలీబాబా 40 దొంగల స్టోరీ అంతా వారికి తెలుసు'
సీఎం వైఎస్ జగన్ ఒక సంవత్సరం పాలనలో 4 కోట్ల మంది ప్రజలకి రూ. 44వేల కోట్ల లబ్ధి చేకూరింది. అవినీతికి ఆస్కారం లేకుండా దళారీ వ్యవస్థ లేకుండా నడుపుతున్న ప్రభుత్వం మాది. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎపుడైనా అవినీతి నిర్మూలనపై తగిన ఆదేశాలు ఇచ్చారా..? అవినీతిపరులకి మీరే అండగా ఉంటూ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి ధర్నాలు చేయమంటున్నారు. ఎన్నికల ముందు పోలవరంలో అవినీతి జరిగిందని ప్రధానిమోదీ చంద్రబాబుపై ఆరోపణలు చేశారు. పోలవరంపై ప్రధాని మోదీ విచారణ చేసి ఉంటే ఈ రోజు చంద్రబాబు ఎన్నికలలో పోటీచేసే అవకాశమే ఉండేది కాదు. ఈఎస్ఐలో మంత్రి అచ్చెన్నాయుడు 150 కోట్ల కుంభకోణం చేశారు. ఈఎస్ఐ కుంభకోణంలో లోకేష్ పాత్ర, మిగిలిన వారి పాత్ర ఎంత ఉందో వెలికి తీయాలి. ఈఎస్ఐ కుంభకోణంలో మంత్రి ప్రమేయం లేనప్పుడు ఆయన ఎందుకు సిఫార్సు లేఖలు ఇచ్చారు. ఈఎస్ఐ కుంభకోణంలో మాజీ మంత్రి ప్రమేయం లేదంటే మీ హస్తముందా చంద్రబాబూ అంటూ ప్రశ్నించారు. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యక్తిని పరామర్శించాలంటే కోర్టు అనుమతి ఉండాలని మీకు తెలియదా..? అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై చంద్రబాబు, లోకేష్ అతిగా బాధపడటం చూస్తుంటే వీరి పాత్రపై అనుమానాలు కలుగుతున్నాయి. చదవండి: టీడీపీ వ్యూహం.. అట్టర్ ఫ్లాప్
కోడెలపై అవినీతి ఆరోపణలు వచ్చినపుడు కనీసం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఆయన ఆత్మహత్యకి చంద్రబాబు కారణం కాదా..! అచ్చెన్నాయుడిపై చూపిన ప్రేమ మీరు కోడెలపై ఎందుకు చూపలేదు.. కోడెలపై కక్ష సాధింపు చేపట్టారా. అచ్చెన్నాయుడి కుటుంబం మొదటి నుంచి పార్టీకి సేవలు చేశారని చెబుతున్నారు. అయితే వాజ్‌పేయి హయాంలో ఎర్రన్నాయుడికి మీరు స్పీకర్ అవకాశం రాకుండా చేయలేదా..? అచ్చెంన్నాయుడు బీసీలకి నేత కాదు. అతను మీ పార్టీలో మాత్రమే నేత. మాకు ఎవరికీ నేత కాదు. చంద్రబాబు తన హయాంలో బీసీలకి చేసిందేమీ లేదు. ఎన్టీఆర్ బ్రతికున్నప్పుడు మాత్రమే టీడీపీ బీసీలపార్టీగా ఉంది. ఇప్పుడున్న టీడీపీ మనీ పార్టీ. దోచుకో.. దాచుకో..ఎన్నికల సమయంలో ఖర్చుపెట్టుకో ఇదే నినాదం. జేసీ ప్రభాకర్ రెడ్డి ట్రాన్స్ పోర్ట్ అక్రమాలపై గతంలోనే నేను కౌన్సిల్‌లో ప్రశ్నించాను. నిబంధనలకి విరుద్ధంగా 200 బస్సులు ఫిట్‌నెస్ లేకుండా జేసీ ఎలా తిప్పుతారు. గత ప్రభుత్వంలో మంత్రుల అవినీతికి చంద్రబాబే బాధ్యత వహించాలి. తను అధికారంలో ఉన్నప్పుడు చట్టం తనపని తాను చేసుకుపోతుంది అన్న బాబు ఇప్పుడు ఎందుకు ఆ మాట చెప్పలేకపోతున్నారు' అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment