టీడీపీ వ్యూహం.. అట్టర్‌ ఫ్లాప్‌ | TDP Strategy In Atchannaidu Kinjarapu Arrest Has Not Materialized | Sakshi
Sakshi News home page

టీడీపీ వ్యూహం.. అట్టర్‌ ఫ్లాప్‌

Published Sun, Jun 14 2020 8:54 AM | Last Updated on Sun, Jun 14 2020 8:54 AM

TDP Strategy In Atchannaidu Kinjarapu Arrest Has Not Materialized - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: ‘నువ్వు మగాడివైతే... రాయలసీమ రక్తం నీలో ఉంటే... ఆరోపణలను నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి తప్పుకోవాలి. టెండర్లు పిలిచి అవినీతి చేసినట్టు సోదాల్లో తేలితే వెంటనే రాజకీయాల నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నీకు మగతనం ఉంటే ఈ చాలెంజ్‌కు రమ్మంటున్నా’ అంటూ అసెంబ్లీ సమావేశాల్లో ఓ సందర్భంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. టెండర్లు పిలిచిన పనుల సంగతి ఏమిటో.. ప్రస్తుతం పలు అభివృద్ధి పనులకు నిర్వహిస్తున్న రివర్స్‌ టెండర్ల ద్వారా ప్రభుత్వానికి ఆదా అవుతున్న వేల కోట్ల రూపాయలే నిరూపిస్తున్నాయి.

వాటిని పక్కన పెడితే టెండర్లు పిలవకుండానే ఈఎస్‌ఐ మందులు, పరికరాల కొనుగోలులో నామినేషన్‌ పద్ధతిలో కోట్లు కొల్లగొట్టారని అటు విజిలెన్స్, ఇటు ఏసీబీ నిగ్గు తేల్చాయి. పక్కా ఆధారాలతోనే అచ్చెన్నాయుడిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇప్పుడు చేయాల్సింది తాను అవినీతి చేయలేదని న్యాయస్థానంలో నిరూపించుకోవడమే. లేదంటే శాసనసభలో చేసిన ప్రకటనకు కట్టుబడి ఉండాలని విశ్లేషకులు ఒకవైపు అంటుండగా... అవినీతికి పాల్పడి దాన్ని కులానికి ఆపాదించడం ఎంతమేరకు సమంజసమని బీసీ వర్గాలు బాహాటంగా విమర్శిస్తున్నాయి. చదవండి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్

రివర్స్‌ అయిన బీసీ కార్డు వ్యూహం 
బీసీ నినాదంతో ఈఎస్‌ఐ స్కామ్‌ను పక్కదారి పట్టిద్దామని టీడీపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. వారికి కనీస మద్దతు లభించలేదు. పసలేని ప్రచారం అంటూ బీసీ వర్గాలు కొట్టి పారేశాయి. ఇలాంటి వాటికి మద్దతు ఎందుకిస్తామని ఎదురు ప్రశ్నిస్తున్నాయి. తప్పు చేస్తే ఏ కులమైనా ఒకటేనని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని, దాన్ని కులానికి అంటగట్టడమేంటని, బీసీలను అణగదొక్కుతున్నట్టు టీడీపీ నేతలు కామెంట్లు చేయడమేంటని బీసీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. అందుకనే రాష్ట్రంలో ఎక్కడా బీసీల నుంచి అచ్చెన్నాయుడికి మద్దతు లభించలేదు.

అంతెందుకు సొంత జిల్లాలోనే బీసీలు అండగా నిలవలేదు. అచ్చెన్నాయుడి అరెస్టును ఖండించాలని అంతర్గతంగా సంకేతాలు వెళ్తున్నా ఏ ఒక్కరూ స్పందించడం లేదు. ఎంతసేపూ టీడీపీ నేతలు పచ్చ మీడియా ద్వారా పదేపదే బీసీ నేతపై కక్ష సాధింపు చర్యగా అభివర్ణించుకుంటూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారు. టీడీపీ నేతలు చేసిన అవినీతికి తామెందుకు మద్దతిస్తామని, తప్పు చేసినవారు అరెస్టయితే తామెందుకు ఖండిస్తామని బాహాటంగానే బీసీ నేతలు చెబుతున్నారు.  

వీటి సంగతి తేల్చితే అచ్చెన్న గుట్టంతా రట్టే  
అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నంతకాలం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. తిత్లీ పరిహారంపై సమగ్ర విచారణ జరిపితే అచ్చెన్న బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. నీరు చెట్టు, చంద్రన్న బీమా, సాగునీటి ప్రాజెక్టుల అంచనాల రూపకల్పన, గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు పక్కదారి పట్టించడం, సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడం వంటి వాటిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే ఈయనగారి బాగోతం మరింత బయటపడనుంది.

ఇప్పటికే అచ్చెన్న అక్రమాలపై టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్‌ పలు విచారణ సంస్థలకు ఫిర్యాదులు కూడా ఇచ్చారు. వాటి లెక్క తేలితే అచ్చెన్నకు ఉచ్చు మరింత బిగుస్తుంది. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం ఏ స్థాయిలో అవినీతి జరిగిందో జిల్లా ప్రజలందరికీ తెలిసిందే. అందుకనే అచ్చెన్న అరెస్టును జిల్లా ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. తప్పు చేశాడు కాబట్టి అరెస్టయ్యాడని అంటున్నారు.  చదవండి: కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌.. అచ్చెన్న ఆటకట్టు 

ఈఎస్‌ఐ స్కామ్‌ నిందితుడికీ బీసీలకు ముడిపెట్టడం సరికాదు 
ఈఎస్‌ఐ స్కామ్‌లో రూ.150 కోట్లకు పైగా అవినీతి చేసి అడ్డంగా దొరికిపోయిన అచ్చెన్నాయుడి అరెస్ట్‌ను బీసీలతో ముడిపెట్టడం హేయమైన చర్య. గతంలో బీసీ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు సమక్షంలో కాపు రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టినప్పుడే వెనుకబడిన వర్గాలకు చెందినవాడిగా చెప్పుకునే నైతిక హక్కు కోల్పోయారు. అవినీతి చేసిన వారెవ్వరైనా శిక్ష అనుభవించాల్సిందే.  
–బొడ్డేపల్లి దామోదరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆల్‌ఇండియా బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ఫెడరేషన్‌  

నిందితులు ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే 
అంబేడ్కర్‌ రాజ్యాంగంలో అవినీతి చేసే వారి కోసం ప్రత్యే క రిజర్వేషన్‌ ఏమీ ఇవ్వలేదు. చట్టం ముందు అందరూ సమానమే. కారి్మకుల కోసం ఏర్పాటు చేసిన ఈఎస్‌ఐ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్‌ వస్తువులు, కంప్యూటర్ల కొనుగోలులో నాన్‌రేట్‌ కాంట్రా క్ట్‌కి అప్పగించడం దారుణం. ప్రజాధనం దోచుకున్నవారికి శిక్ష వేయాలి. అవినీతి చేసి బీసీలనడం బీసీ జాతికే అవమానకరం.  –డబ్బీరు శ్రీనివాసరావు (వాసు), ఏఐబీసీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు  

మోపిదేవిని అరెస్ట్‌ చేయించినప్పుడు ఏమైంది బీసీ కార్డు 
టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాని కి చెందిన మోపిదేవి వెంకటరమణను అరెస్ట్‌ చేసినప్పుడు ఏమైంది బీసీల మీద ఈ ప్రేమ? ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసినప్పుడు ఏమైంది అణగారిన వర్గాలపై ప్రేమ. 2014 ఎన్నికల ముందు నాయీబ్రాహ్మణులకు, మత్స్యకారులకు హామీలిచ్చి మోసగించినప్పుడు ఏమైంది ఈ ప్రేమ? ఈఎస్‌ఐ స్కామ్‌లో అడ్డంగా దొరికిన అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసినప్పుడే బీసీలు గుర్తొచ్చారా? 
– డి.పి.దేవ్, ఏఐబీసీఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షుడు, శ్రీకాకుళం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement