అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా...  | TDP Former Minister Atchannaidu Corruption | Sakshi
Sakshi News home page

అచ్చెన్న లీలలు ఇన్నన్ని కావయా... 

Published Tue, Feb 25 2020 9:21 AM | Last Updated on Tue, Feb 25 2020 9:40 AM

TDP Former Minister Atchannaidu Corruption - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఈఎస్‌ఐలో మందులు, పరికరాల కొనుగోళ్ల స్కామ్‌ గురించి ఇప్పుడు రాష్ట్రమంతా గగ్గోలు పెడుతున్నారు.. దానిని మించిన ఎన్నో కుంభకోణాలు శ్రీకాకుళం జిల్లావాసులకు తెలుసు.. అచ్చెన్నాయుడు కన్నేస్తే కోట్లాది రూపాయలు హాంఫట్‌ కావలసిందే. ఆయన అవినీతికి రాగద్వేషాలు లేవు. అయ్యో పాపం కార్మికులని గానీ.. తిత్లీ తుపానులో తన జిల్లావాసులు సర్వం కోల్పోయారని గానీ ఆయనకు బాధ ఉండదు. ఎక్కడ దొరికితే అక్కడ స్వాహా చేయడమే ఆయన తత్వం. నీరు చెట్టు పథకం పేరుతో కోట్లు కొల్లగొట్టిన అనుభవాలు గానీ.. తిత్లీ తుఫాన్‌ పరిహారం పంపిణీలో అన్యాయమైపోయిన సామాన్యుల కన్నీటి గాథలు గానీ ఇవే చెబుతున్నాయి. ఈ రెండింటిలోనూ వందల కోట్ల అవినీతి జరిగింది. వీటిపై సమగ్ర విచారణ చేపడితే మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడితో పాటు ఎమ్మెల్యే బెందాళం అశోక్, నాటి టీడీపీ ఎమ్మెల్యేల బాగోతమంతా బయటపడుతుంది.

‘తిత్లీ‘ని మించిన ఉపద్రవం 
తిత్లీ తుఫాన్‌ సమయంలో గ్రామాల వారీగా కాగితాల్లో పంచేసుకుని పరిహారాన్ని కొట్టేశారు. గ్రామాల్లో ఉన్న భూములను తమకింత అని చూపించుకుని, ఫలానా చెట్లు పడిపోయాయని చెప్పి తిత్లీ పరిహారాన్ని నొక్కేశారు. ఏదో ఒక సర్వే నెంబర్‌తో భూమిని చూపించి, నచ్చినంత సంఖ్యలో చెట్లు పడిపోయినట్టు నమోదు చేయించుకుని కోట్లాది రూపాయల పరిహారాన్ని మింగేశారు. అచ్చెన్నాయుడు, అశోక్‌ల అడుగు జాడల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు కూడా పరిహారాన్ని పట్టేశారు. నేతల  కుటుంబసభ్యుల పేరున ఎటువంటి భూములు లేనప్పటికీ వారి పేరున నష్టపరిహారాన్ని లక్షల రూపాయల్లో అందుకొన్నారు. ఇవన్నీ అప్పట్లోనే వెలుగు చూశాయి. కాకపోతే వారి పార్టీ అధికారంలో ఉండటంతో విచారణ జోలికి పోలేదు. ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం రావడం, అక్రమాలపై లిఖితపూర్వక ఫిర్యాదులు రావడం, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిహారాన్ని పెంచడంతో అక్రమాల డొంక కదిలింది. కాకపోతే, తిత్లీ తుఫాను పరిహారాన్ని అప్పనంగా కాజేసిన తెలుగు తమ్ముళ్లు  దర్యాప్తులో బయటపడకుండా ఉండేందుకు వ్యూహాత్మక ఎత్తుగడలు వేశారు. భూముల్లేకపోయినప్పటికీ పరిహారం పొందిన వారు మ్యూటేషన్‌ చేయించి, పట్టాదారు పాసు పస్తకాలను తయారు చేయించారు. కంచిలి, కవిటి మండలాల్లో ఎక్కువగా ఈ రకమైన అక్రమాలు జరిగాయి. ఉదాహరణలివి..

కవిటి రెవెన్యూ ప్రగడపుట్టుగకు చెందిన బి.సంహిత పేరిట రూ.1,03,500 తిత్లీ తుఫాన్‌ నష్టపరిహారాల మంజూరులో పరిహారం నమోదైంది. ఒక సర్వే నెంబరులో 3.93 ఎకరాల భూమి ఉన్నట్టు జాబితాలో నమోదు చేశారు. వాస్తవానికి రెవెన్యూ రికార్డులలో ఈ భూమి యజమాని పేరు ప్రసాదరావుగా ఉంది.  
కవిటి రెవెన్యూలో డొంకపుట్టుగకు చెందిన మరో ఆసామీ డి.వల్లభరావుకు తిత్లీ తుఫాన్‌కు సంబంధించి కొబ్బరి నష్టపరిహారం రూ.1,56,000 అందించేందుకు జాబితాలో పేర్కొన్నారు. ఆయన పేరున 4.35 ఎకరాల భూమి ఉన్నట్టుగా పరిహారాల జాబితాలో చూపించారు. వాస్తవానికి ఆయనకు 0.34 సెంట్లు భూమి మాత్రమే ఉంది.    
ఎర్రగోవిందపుట్టుగలో నివసిస్తున్న రమణమూర్తికి తిత్లీ తుఫాన్‌లో తనకున్న 4.86 ఎకరాల భూమి నష్టపోయిందని జాబితాలో ప్రకటించారు. అయితే ఈ సర్వే నెంబరులో ఇతనికి రెవెన్యూ రికార్డుల ప్రకారం 1.36 ఎకరాలు మాత్రమే ఉందని రికార్డులు చెబుతున్నాయి.

 వేలాది మంది ఇదే రకంగా పరిహారాన్ని కొట్టేశారు. జిల్లా లో 52,164మంది కొబ్బరి రైతులు, 78,108మంది జీడి రైతులు తిత్లీ భీభత్సానికి నష్టపోయినట్టుగా పరిహారం జాబితాల్లో చూపించారు. ఎన్నికలకు ముందు దాదాపు రూ.297 కోట్ల వరకు పరిహారం కింద అందించారు. ఈ లెక్కన అనర్హులకు ఎన్ని కోట్లు వెళ్లాయో వారికే తెలియాలి. భూముల్లేని టీడీపీ సానుభూతి పరులకు భూములున్నట్టుగా చూపించి, తక్కువ భూమి ఉన్న టీడీపీ శ్రేణులకు ఎక్కువ భూమి ఉన్నట్టుగా నమోదు చేసి, పల్లం భూమిని మెట్ట భూమిగా నమోదు చేసి, పంచాయతీకి చెందని వ్యక్తులను స్థానికంగా చూపించి అప్పట్లో పరిహారం జాబితాలు తయారు చేశారు.

నీరు చెట్టు.. అవినీతికి మెట్టు 
నీరు చెట్టు పనులైతే అవినీతి ఊట బావిలా పనికొచ్చాయి. రూ.5 లక్షల విలువ కన్నా ఎక్కువగా ఉండే పనుల కాంట్రాక్ట్‌లను తమ అనుయాయులకు నామినేటెడ్‌ పద్ధతిలో కట్టబెట్టారు. జిల్లాలో రూ.427.24 కోట్ల విలువైన 5696 పనుల్లో అత్యధికం అలా దక్కించుకున్నవే. వీటిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. పనులు సక్రమంగా సాగలేదు. మట్టి తవ్వకాల కింద క్యూబిక్‌ మీటర్‌కు రూ.29కు గాను రూ.82.80 చెల్లించారు. చెరువు గట్లపై మట్టిని గట్టి పరచకుండా, ఉన్న దాని కంటే అధికంగా నమోదు చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారు. నిబంధనల ప్రకారం 50 ఎకరాలు ఆయకట్టు పైబడిన చెరువుల్లో మాత్రమే నీరు చెట్టు పనులు చేపట్టాలి. కానీ అందుకు భిన్నంగా 50 ఎకరాలు కంటే తక్కువ ఉన్న చెరువుల్లో కూడా పనులు నిధులు దురి్వనియోగం చేశారు. గెడ్డ లేదా వాగు నీటి ప్రవాహాన్ని పరిగణనలోకి తీసుకోకుండా, ఎటువంటి డిజైన్‌ లేకుండా చెక్‌డ్యామ్‌లను నిర్మించారు. నాసిరకంగా కాంక్రీటు పనులు చేపట్టారు. 10 హెచ్‌ నిబంధనలకు విరుద్ధంగా  మట్టి పని చేపట్టి లబి్ధపొందారు. తక్కువ కొలతలు కలిగిన రాళ్లను ఉపయోగించి గ్రోయిన్లను నిర్మించారు. ఇలా నీరుచెట్టులో అనేక అక్రమాలకు పాల్పడ్డారు.  

అచ్చెన్నాయుడి అక్రమ సంపాదనపై సీఎంకు లేఖ 
టెక్కలి: మంత్రిగా కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన అక్రమాలు, అవినీతి కార్యకలాపాలపై ఆధారాలతో సహా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి లేఖ అందజేస్తున్నామని వైఎస్సార్‌ సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌ అన్నారు. సోమవారం టెక్కలి వైఎస్సార్‌ సీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు బినామీ కంపెనీల పేర్లతో ఈఎస్‌ఐ మందులు, కాస్మొటిక్స్‌ కొనుగోలులో రూ.975 కోట్ల అవినీతికి పాల్పడినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో వెల్లడైందన్నారు.

గత ఐదేళ్ల కాలంలో జిల్లాలో గ్రానైట్, ఇసుక కుంభకోణాలు, బీసీ కార్పొరేషన్‌ రుణాల్లో అక్రమాలు, సింగిల్‌ టెండర్‌ విధానంతో సొంత అన్నకు టెండర్లు కట్టబెట్టడం, ధాన్యం రవాణాకు వచ్చిన కోట్లాది రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, మినుముల కుంభకోణంతో కోట్ల రూపాయలు సొంత ఖాతాలకు మళ్లించుకోవడం, టెక్కలిలో సింగిల్‌ టెండర్‌ విధానంతో తన బినామీ లాడి శ్రీనివాసరావుకు ఆర్టీసీ టెండర్లు కట్టబెట్టడం, కేశినేని, దివాకర్‌ ట్రావెల్స్‌కు అడ్డగోలుగా రవాణా లైసెన్సులు జారీ చేయడంతోపాటు వేలాది కోట్ల రూపాయలు అక్రమాలకు పాల్పడిన అచ్చెన్నాయుడు ఈ రోజు నీతివంతుడిలా మాట్లాడాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేవలం 2 ఎకరాలు కలిగిన కింజరాపు కుటుంబ సభ్యులైన ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు, రామ్మోహన్‌నాయుడు, హరిప్రసాద్, ప్రభాకర్‌కు ఈ రోజు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని తిలక్‌ ప్రశ్నించారు. కింజరాపు కుటుంబ సభ్యుల అక్రమ ఆస్తులను ఆధారాలతో సహా  బహిర్గతం చేయడానికి మార్చి 2న టెక్కలి అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద బహిరంగ చర్చా వేదిక నిర్వహిస్తామని...అచ్చెన్నాయుడుకు దమ్ముంటే చర్చా వేదికకు వచ్చి తన నిజాయితీ నిరూపించుకోవాలని తిలక్‌ సవాల్‌ విసిరారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement