లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డ నాగరాజును విచారిస్తున్న ఏసీబీ డీఎస్పీ సుధాకర్
పిఠాపురం టౌన్: కొత్తగా నిర్మించిన పై అంతస్తుకు తక్కువ పన్ను వేసినందుకు బదులుగా రూ.ఆరు వేలు లంచం తీసుకుంటూ బిల్లు కలెక్టర్ నాగరాజు మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కాడు. గొల్లప్రోలు మండలం దుర్గాడ గ్రామానికి చెందిన గొల్లపల్లి కన్నయ్య 2016లో పిఠాపురంలోని వైఎస్సార్ గార్డెన్‌లో ఇటీవల ఇల్లు కొనుగోలు చేశాడు. అప్పట్లో అర్ధసంవత్సరానికి రూ.1600 పన్ను చెల్లించేవాడు.
అనంతరం అదే ఇంటిపై అంతస్తు నిర్మించాడు. దీనికి కూడా పన్ను విధించాలని సంబంధిత మున్సిపల్ రెవెన్యూ అధికారులను కోరారు. ఆ మేరకు ఇంటి కొలతలు తీసుకున్న అనంతరం బిల్లు కలెక్టర్ నాగరాజు కన్నయ్యతో మాట్లాడుతూ కొలతల ప్రకారం రూ.3400 పన్ను వేయాల్సి వస్తుందని రూ.ఎనిమిది వేలు లంచం ఇస్తే పన్ను తగ్గిస్తానని చెప్పాడు.
దాంతో రూ.ఆరు వేలు ఇస్తానని పన్ను తగ్గించి వేయాలని కన్నయ్య బిల్లు కలెక్టర్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ మేరకు పన్ను తగ్గించి రూ.2020లు వేయగా దాని ప్రకారం కన్నయ్య చెల్లించాడు. ఇంతవరకు బాగానే ఉన్నా లంచం సొమ్ములు ఇవ్వలేదని బిల్లు కలెక్టర్ నాగరాజు కన్నయ్య మీద ఒత్తిడి తీసుకొచ్చాడు. అనివార్య కారణాల వల్ల ఇవ్వలేకపోయానని ప్రాధేయపడ్డాడు.
అయినా వినకుండా నాగరాజు కన్నయ్యకు ఫోన్‌చేసి బెదిరించేవాడు. తన పై అధికారులు డబ్బులు అడుగుతున్నారని లేదంటే పన్ను పెంచేస్తానని హెచ్చరించడంతో కన్నయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఎం.సుధాకర్ నేతృత్వంలో మంగళవారం మధ్యాహ్నం పథకం ప్రకారం మున్సిపల్ కార్యాలయంపై దాడి చేసి కన్నయ్య నుంచి రూ.6వేలు లంచాన్ని బిల్లు కలెక్టర్ నాగరాజు తీసుకుంటుండగా ప్రత్యక్షంగా పట్టుకున్నారు.
రసాయన పరీక్షల ద్వారా బిల్లు కలెక్టర్ లంచం తీసుకున్నట్టు నిర్ధారించిన ఏసీబీ అధికారులు బిల్లుకలెక్టర్‌ను అదుపులోకి తీసుకుని మున్సిపల్ కమిషనర్ .రామ్మోహన్ నుంచి వివరాలు సేకరించారు. రెవెన్యూ రికార్డులను పరిశీలించిన ఏసీబీ డీఎస్పీ సుధాకర్ తదుపరి చర్యలు చేపట్టనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment