భాగ్యనగర్‌కాలనీ(హైదరాబాద్ సిటీ): ఏసీబీ వలలో మరో భారీ తిమింగలం చిక్కింది. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తూ ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడని ఏసీబీకి ఫిర్యాదు అందింది.దీంతో సదరు బిల్‌కలెక్టర్‌కు చెందిన నివాసాలపై శుక్రవారం ఏక ధాటిగా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌లో ఐదు బృందాలు, సిద్దిపేట జిల్లా నంగునూరులో మూడు బృందాలు ఒకే సారి దాడులు నిర్వహించి సుమారు 2.98లక్షల విలువచేసే ఆస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం సుమారు ఆరుకోట్ల రూపాయల విలువచేసే ఆస్తులున్నట్లు కనుగొన్నారు.
వివరాల్లోకి వెళితే..
జీహెచ్‌ఎంసీ ఆబిడ్స్ సర్కిల్9లో బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న మడప నర్సింహా రెడ్డి కూకట్‌పల్లిలోని హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లో నివాసం ఉంటున్నాడు. 1987లో బిల్‌కలెక్టర్‌గా విధుల్లో చేరిన నర్సింహారెడ్డి తక్కువ కాలంలోనే ఎక్కువ మొత్తంలో డబ్బులు ఆర్జించాడని, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నాడనే విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు నిఘావేసి ఒక్కసారిగా దాడులు నిర్వహించారు. హెచ్‌ఎంటీ శాతవాహననగర్‌లోని ఆయన నివాసంలో ఉదయం ఆరుగంటలకు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలలో 61వేల నగదుతో పాటు శాతవాహన నగర్‌లోని జీ ప్లస్ త్రీ, కళ్యాణ్‌నగర్‌లో జీ ప్లస్ వన్, బాలానగర్‌లో జీ ప్లస్ టూ, కూకట్‌పల్లిలో జీ ప్లస్ టూ అంతస్థుల భవనాలు, ఏడు ఖాళీస్థలాలు ఉన్నట్లు గుర్తించారు. అందులో నిజాంపేటలో మూడు, కేపీహెచ్‌బికాలనీలో ఒకటి, కళ్యాణ్‌నగర్‌లో మరోకటి, నంగునూరులో రెండు ఉన్నాయి. వీటితో పాటు నంగునూరులో 33.01 ఎకరాల వ్యవసాయ భూమి, చేర్యాలలో ఒక ఎకరం భూమి ఉన్నట్లు గుర్తించారు. అదేవిధంగా రెండు కిలోల బంగారు ఆభరణాలు, 3.745కేజీల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఒక మారుతి స్విప్ట్ కారు, రెండు ట్రాక్టర్‌లు, ఒక గ్లామర్ హోండా మోటర్‌సైకిల్‌లతో పాటు బ్యాంక్‌లో 16లక్షల నగదు, 10 ఇన్సూరెన్స్ పాలసీలలో పదిలక్షల విలువచేసే బాండ్లు కూడా ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. దాడుల్లో పాల్గొన్న వారిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌లు విజయబాస్కర్‌రెడ్డి, వెంకటేశ్వరరావు, మంజుల, లక్ష్మి, ఆజాద్ తదితరులు పాల్గొన్నారు.
కక్షతోనే ఫిర్యాదు...
సిద్ధిపేటలోని వ్యవసాయ భూమి విషయంలో నెలకొన్న వివాదంతో తనపై కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బంధువులు ఏసీబీకి తప్పుడు ఫిర్యాదులు చేశారని బిల్‌కలెక్టర్ మడప నర్సింహా రెడ్డి పేర్కొన్నారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎప్పటికప్పుడు ఆదాయపు పన్నులు కూడా చెల్లిస్తున్నట్లు తెలిపారు.
ఏసీబీ వలలో జీహెచ్‌ఎంసీ బిల్ కలెక్టర్
Published Fri, Oct 21 2016 8:12 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
Advertisement