ఏసీబీకి చిక్కిన బిల్ కలెక్టర్
Published Wed, Nov 23 2016 5:09 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM
కామారెడ్డి క్రైం : ఇంటి యజమాని పేరు మార్పిడి పత్రం ఇచ్చేందుకు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు కామారెడ్డి మున్సిపాలిటీలో పనిచేస్తున్న ఇన్‌చార్జి బిల్ కలెక్టర్ దేవరాజు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని కృష్ణమ్మ కాలనీకి చెందిన చిక్కలపల్లి శ్రీనివాస్ ఇటీవల తన ఇంటిపక్కనున్న ఇంటిని కొనుగోలు చేశాడు. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత ఇంటి యజమాని పేరు మార్చుకోవడానికి మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. 15 రోజులుగా కార్యాలయం చుట్టు తిరుగుతున్నాడు.
రూ. 6,500 ఇస్తేనే పనిచేస్తానని ఇన్‌చార్జి బిల్ కలెక్టర్ దేవరాజు తేల్చిచెప్పడంతో చేసేదేమీ లేక రూ. 4,500 ఇస్తానని, ఇంటి యజమాని పేరు మార్పిడి పత్రం ఇవ్వాలని కోరాడు. దీనికి ఇన్‌చార్జి బిల్ కలెక్టర్ అంగీకరించాడు. ఈ విషయాన్ని శ్రీనివాస్ ఏసీబీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. మంగళవారం రూ. 4,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకున్నారు. లంచం తీసుకుంటూ దొరికిన దేవరాజుపై కేసు నమోదు చేశామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.
అయినా మారడం లేదు..
కామారెడ్డి మున్సిపాలిటీపై గతంలోనూ పలుమార్లు ఏసీబీ దాడి చేసింది. 2005లో సానిటరీ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ మున్సిపల్ ఆటో డ్రైవర్ సమీర్ వద్దనుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంజినీరింగ్ విభాగంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేసే మల్లికార్జున్ ఎంబీ రికార్డులు చేయడం విషయంలో ఓ కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. మూడు నెలల క్రితం ఇంజినీర్‌స్థాయి అధికారిపై ఫిర్యాదులు రాగా.. ఏసీబీ దాడులు చేసింది. అయితే సమాచారం ముందుగానే లీక్ కావడంతో సదరు అధికారి తప్పించుకున్నాడు. ఏసీబీ దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా.. అధికారుల తీరు మారడం లేదనడానికి తాజాగా లంచం తీసుకుంటూ దొరికిపోయిన ఇన్‌చార్జి బిల్ కలెక్టర్ ఉదంతమే సాక్ష్యం..
Advertisement
Advertisement