సమాచార కమిషనర్ల నియామకంలో సర్కారు నిర్లిప్తత..
ప్రధాన సమాచార కమిషనర్ పదవీకాలం ముగిసి నాలుగేళ్లు.. కమిషనర్ అంటూ లేక ఏడాదిన్నర..
తమ వినతులు పరిష్కరించేవారు లేక ప్రజల అవస్తలు..
‘రాష్ట్ర సమాచార కమిషన్‌లో ఒక్కరంటే ఒక్క కమిషనర్ కూడా లేరా? ఒక్క కమిషనర్ కూడా లేకుంటే అప్పీళ్లను సిబ్బంది విచారిస్తారా? ఇలాగైతే సమాచార హక్కు చట్టం చేసి ఏం ప్రయోజనం? కౌంటర్లు అక్కర్లేదు..ఎప్పుడు నియమిస్తారో చెప్పండి?’ – పిల్ విచారణ సందర్భంగా హైకోర్టు ఆగ్రహం
‘ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు, రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులొచ్చాయి. త్వరలో సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీని ఏర్పాటు చేస్తాం. దీని కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలి’ – 2023 ఆగస్టులో హైకోర్టుకు సర్కారు నివేదన
సాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగంలో పారదర్శకత, జవాబుదారీతనం తీసురావడానికి కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన సమాచారహక్కు చట్టం కమిషనర్లు లేక నిర్వీర్యమవుతోంది. ప్రధాన సమాచార కమిషనర్ 2020, ఆగస్టు 24న, చివరి సమాచార కమిషనర్ 2023, ఫిబ్రవరి 24న తన పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరి నియామకమూ జరగలేదు. దీంతో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచారం అడిగినా సకాలంలో ఇచ్చే వారు కరువయ్యారు. దీనిపై కమిషన్‌ను సంప్రదించడానికి.. జిల్లా కమిటీలూ సరిగా లేవు. ఇక అప్పీలు చేద్దామంటే రాష్ట్రస్థాయిలో కమిషనే లేదు.
ఈ ఏడాది జూన్ 12న ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ ఇచ్చి.. జూన్ 29వ తేదీని ఆఖరు తేదీగా ప్రకటించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇది జరిగి రెండు నెలలు దాటుతున్నా.. ఇప్పటివరకూ దరఖాస్తుల పరిశీలనే జరగలేదు .
రాష్ట్ర కమిషన్..
సెక్షన్ 15(1) కింద ఈ కమిషన్ ఏర్పాటవుతుంది. దీనికి ఓ ప్రధాన కమిషనర్‌తో పాటు గరిష్టంగా 10 కమిషనర్ల వరకు నియమించవచ్చు. ముఖ్యమంత్రి చైర్‌పర్సన్‌గా శాసనసభలో ప్రతిపక్ష నేత, ఓ కేబినెట్ మంత్రి సభ్యులుగా ఉండే కమిటీ సిఫార్సు మేరకు గవర్నర్ వీరిని నియమిస్తారు. కమిషన్‌కు స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది.
» ప్రజాజీవనంలో సుప్రసిద్ధులే ఉండాలి. విశాలమైన విషయ పరిజ్ఞానం, చట్టం, శాస్త్ర సాంకేతిక రంగాలు, సామాజిక సేవ, జర్నలిజం, ప్రసార మాధ్యమాలు, కార్యనిర్వహణ, పరిపాలనలో అనుభవమున్నవారు ప్రధాన కమిషనర్, కమిషనర్‌గా అర్హులు.
» ప్రధాన కమిషనర్, కమిషనర్లు నియామకమైన నాటి నుంచి ఐదేళ్లు లేదా వయసు 65 ఏళ్లు వచ్చే వరకు బాధ్యతల్లో కొనసాగుతారు. వీరిని తిరిగి నియమించడానికి అవకాశం లేదు. కమిషనర్లకు ప్రధాన కమిషనర్‌గా నియామకం పొందే అర్హత ఉంటుంది. అయితే మొత్తంగా ఐదేళ్లు మించి బాధ్యతల్లో కొనసాగడానికి వీలులేదు.
» వీరిని తొలగించడం గవర్నర్ ఉత్తర్వు ద్వారా మాత్రమే సాధ్యం.
అధికారాలు..
సివిల్ కోర్టుకు ఉండే అధికారాలు కమిషన్‌కు ఉంటాయి
»వ్యక్తులకు సమన్లు జారీ చేసి హాజరయ్యేట్టు లేదా లిఖిత పూర్వకంగా సాక్ష్యం ఇచ్చేట్టు చేయడం
» అవసరమైన డాక్యుమెంట్లు పరిశీలించడం, తనిఖీ చేయడం
» అఫిడవిట్ల రూపంలో వాంగ్మూలం స్వీకరించడం
» కోర్టు లేదా ప్రభుత్వ కార్యా లయం నుంచి రికార్డులు, కాపీలు తెప్పించడం
» ఏపీఐసీ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్
» 2017, సెప్టెంబర్ 9 నుంచి తెలంగాణ కమిషన్ ప్రారంభం. గణాంకాలు ఆ తేదీ నుంచే.
»2024 అప్పీళ్లు, ఫిర్యాదుల గణాంకాలు ఆగస్టు 24 వరకు..
» 17,792 ఫిర్యాదుల్లో ఒకసారి కమిషన్ ఆదేశాలు జారీ చేసినా సమస్య పరిష్కారం కాలేదంటూ మళ్లీ వచి్చన కేసులు 3,210
ఎవరు అప్పీల్ చేయవచ్చు
» సమాచార హక్కు చట్టం కింద అడిగిన సమాచారం ఇచ్చేందుకు ప్రభుత్వ అధికారి నిరాకరించినప్పుడు..
» నిర్దేశించిన 30 రోజుల్లో సమాచారం రాకపోయినా..
» సమాచారం కోసం చెల్లించాల్సిన రుసుము సహేతుకంగా లేదని అనిపిస్తే..
» ఒకవేళ అధికారి తప్పుడు లేదా తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చారని భావిస్తే..
» తగిన కారణాలుంటే కమిషన్ నేరుగా విచారణకు కూడా స్వీకరించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment