సాక్షి, హైదరాబాద్: బీఆర్‌ఎస్ నల్లగొండ రైతు దీక్షకు హైకోర్టు(Telangana High Court) అనుమతినిచ్చింది. ఈ నెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు దీక్షకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. ఈ నెల 21న నల్గొండలో దీక్ష చేపట్టాలని బీఆర్‌ఎస్(BRS Party) భావించిన సంగతి తెలిసిందే. అయితే, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీఆర్‌ఎస్ నేతలు హైకోర్టుకు వెళ్లారు. విచారణ చేపట్టిన కోర్టు షరతులతో అనుమతి మంజూరు చేసింది.
రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మభ్యపెడుతోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ నల్లగొండ పట్టణంలో మహా ధర్నా చేపట్టాలని నిర్ణయించింది. రైతు భరోసాను రూ.15 వేల నుంచి రూ.12 వేలకు కుదించడం, రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500, విద్యార్థినులకు స్కూటీలు వంటి పథకాలను అమలు చేయడం లేదని, వాటిపై ప్రభుత్వ తీరును ఎండగడతామంటూ బీఆర్‌ఎస్ ఈ మహాధర్నాను తలపెట్టింది.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొనేలా ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా మహాధర్నాకు అనుమతి కోసం ఈ నెల 17వ తేదీన బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు దేవేందర్ పోలీసులకు దరఖాస్తు చేశారు. దాని విషయంలో పోలీసులు వెంటనే నిర్ణయం ప్రకటించలేదు. ధర్నాకు ముందు రోజైన సోమవారం ఉదయం అనుమతి ఇవ్వడం లేదని లేఖ ఇచ్చారు. అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక ధర్నాకు ఒకరోజు ముందు అనుమతి నిరాకరించడం ఏంటని బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడ్డాయి.
బీఆర్‌ఎస్ తలపెట్టిన రైతు మహాధర్నాకు అనుమతి నిరాకరణకు పోలీసులు పలు కారణాలను వెల్లడించారు. నల్లగొండ డీఎస్పీ పేరుతో లేఖను అందజేశారు. గడియారం సెంటర్‌లో తలపెట్టిన మహా ధర్నాకు ఉమ్మడి జిల్లా నుంచి బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వస్తారన్న సమాచారం తమకు ఉందని అందులో పేర్కొన్నారు. అయితే గడియారం సెంటర్‌లో అందుకు సరిపడా స్థలం లేదని, అన్ని రోడ్లకు జంక్షన్ అయిన గడియారం సెంటర్‌లో తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. పైగా అటునుంచి రాకపోకలు సాగించే వాహనాలను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు కూడా లేవని, పార్కింగ్ సమస్య ఉంటుందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: చింతల్ బస్తీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ హల్‌చల్
మరోవైపు కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక, ఇతర పథకాలకు లబ్ధిదారులు గుర్తింపు కోసం ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయని, పోలీస్ యంత్రాంగం అంతా ఆ బందోబస్తులో ఉంటుందని వివరించారు. మరోవైపు సంక్రాంతికి వెళ్లిన ఆంధ్రా ప్రాంతానికి వెళ్లిన వారంతా హైదరాబాద్ వస్తున్నందున జాతీయ రహదారిపై కూడా రద్దీగా ఉంటోందని, ఈ పరిస్థితిలో మహాధర్నాకు వచ్చే జనాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున అనుమతి ఇవ్వలేకపోతున్నట్లు లేఖలో వివరించారు.
ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్‌ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్‌ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ) మధ్యాహ్నం సమయంలో హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఇవాళ.. ఈ నెల 28న ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment