న్యూఢిల్లీ: ప్రతిపక్ష పార్టీల తీవ్ర అభ్యంతరాల నడుమ సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం సవరణ బిల్లును సోమవారం లోక్‌సభ ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)తోపాటు సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకునే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును తీసుకొచ్చింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం సమాచార కమిషనర్లుగా నియమితులైన వ్యక్తులు ఐదేళ్ల కాలం పాటు లేదా వారికి 65 ఏళ్ల వయసు నిండే వరకు (ఏది ముందైతే అది) ఆ పదవిలో ఉంటున్నారు. అలాగే ఎన్నికల ప్రధాన కమిషనర్(సీఈసీ)కు ఇస్తున్నంత వేతనమే సీఐసీకి, ఎన్నికల కమిషనర్లకు ఇస్తున్నంత వేతనమే సమాచార కమిషనర్లకు కూడా ఇస్తున్నారు.
ఈ రెండు నిబంధనలను మార్చి, సీఐసీ సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలాన్ని, వేతనాన్ని నిర్ణయించే అధికారాన్ని కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేలా సవరణ బిల్లు ఉంది. దీంతో సమాచార హక్కు చట్టాన్నే నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందని ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. తాము చెప్పిన మాట వినని సమాచార కమిషనర్లను వెంటనే సాగనంపేందుకు, సమాచార కమిషన్‌ను కూడా తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు, దాని స్వతంత్రతను దెబ్బతీసేందుకే కేంద్రం ఈ సవరణ బిల్లును తీసుకొచ్చిందనీ, లేకపోతే ఇప్పుడు ఈ సవరణలతో పనేంటని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్షాల అభ్యంతరాల కారణంగా లోక్‌సభలో స్పీకర్ ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించారు. 218 మంది సభ్యులు అనుకూలంగా, 79 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటేశారు. అనంతరం విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేయడంతో మూజు వాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
మోదీ విద్యార్హతలు చెప్పమన్నందుకేనా?
బిల్లుపై చర్చను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ఆర్టీఐ వ్యవస్థను నీరుగార్చేందుకు కేంద్రం ఉద్దేశపూర్వకంగా ఈ బిల్లును తెచ్చిందనీ, కేంద్రం దీనిని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాక్షేత్రంలో ఎలాంటి చర్చా జరగకుండానే కేంద్రం ఈ బిల్లును తెచ్చిందనీ, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హత వివరాలు చెప్పాల్సిందేనని గతంలో ఓ సమాచార కమిషనర్ పీఎంవోను ఆదేశించినందున, వారి అధికారాలకు కోత పెట్టేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారా అని శశిథరూర్ ప్రశ్నించారు. ప్రతిపక్ష డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎంఐఎంలతోపాటు బిజూ జనతా దళ్ వంటి పార్టీలు కూడా ఈ బిల్లును వ్యతిరేకించాయి. లోక్‌సభలో తనకున్న 303 మంది ఎంపీల బలాన్ని చూసుకుని ఆర్టీఐ స్ఫూర్తినే కేంద్రం చంపేస్తోందని కార్తీ చిదంబరం అన్నారు. ఆర్టీఐ వ్యవస్థ కోరలు పీకి, సమాచార కమినర్లను తమ ఇళ్లలో పని వాళ్లలా మార్చుకోవాలని కేంద్రం చూస్తోందని డీఎంకే ఎంపీ ఎ.రాజా వ్యాఖ్యానించారు.
పార్లమెంటు ఇతర సమాచారం..
► భారత వైద్య మండలి (ఎంసీఐ) స్థానంలో జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును లోక్‌సభలో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ ప్రవేశపెట్టారు.
► అనేక బిల్లులు ఇంకా పెండింగ్‌లో ఉన్నందున ప్రస్తుత పార్లమెంటు సమావేశాలను మరో వారం రోజులపాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తోంది. మంగళవారం జరిగే బీఏసీ సమావేశంలో దీనిపై అధికారిక నిర్ణయం తీసుకోనున్నారని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. ప్రస్తుత ప్రణాళిక ప్రకారం రానున్న శుక్రవారంతో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉంది.
బిల్లుపై కేంద్రం మాట..
స్వతంత్ర భారతంలో అత్యంత విజయవంతమైన చట్టాల్లో సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఒకటి. తమకు అవసరమైన సమాచారం కోసం ప్రభుత్వాధికారుల్ని ప్రశ్నించగలిగే అధికారాన్ని ఈ చట్టం సామాన్యులకు ఇస్తోంది. ప్రస్తుతం ఈ చట్టం కింద ఏడాదికి దాదాపు 60 లక్షల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. అయితే తాజాగా కేంద్రం తెచ్చిన సవరణలతో ఆర్టీఐ వ్యవస్థ స్వయం ప్రతిపత్తి పోయి, అది నిర్వీర్యం అవుతుందని ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. దీనికి కేంద్రం సమాధానం చెబుతూ విపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా తామేమీ చేయడం లేదనీ, కేవలం ఆ చట్టంలోని కొన్ని లోటుపాట్లను మాత్రమే సరిచేస్తున్నామంటోంది. ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్ధ కాగా, ఆర్టీఐ వ్యవస్థ శాసనం ద్వారా ఏర్పాటైంది. అయితే వేతనాలు మాత్రం ఎన్నికల కమిషనర్లు, సమాచార కమిషనర్లకు ఒకేలా ఉండటంతో దానిని తాము హేతుబద్ధీకరిస్తున్నామని అంటోంది. అలాగే ప్రస్తుతం కేంద్ర సీఐసీకి సుప్రీంకోర్టు జడ్జితో సమానమైన హోదా ఇస్తున్నప్పటికీ, సీఐసీ ఇచ్చిన తీర్పులను హైకోర్టులో సవాలు చేసే వీలు ఉండటం సమంజసంగా లేదనీ, ఇలాంటి లోటుపాట్లను సవరించడమే తాజా బిల్లు ఉద్దేశమని ప్రభుత్వం వివరిస్తోంది.
ఆర్టీఐ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
Published Tue, Jul 23 2019 6:25 AM | Last Updated on Tue, Jul 23 2019 6:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment