ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం | RTI Amendment Bill passed in Rajya Sabha | Sakshi
Sakshi News home page

ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం

Published Fri, Jul 26 2019 4:10 AM | Last Updated on Fri, Jul 26 2019 4:10 AM

RTI Amendment Bill passed in Rajya Sabha - Sakshi

మాట్లాడుతున్న జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణల బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ‘సమాచార హక్కు (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభ సోమవారమే ఆమోదించగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఆ బిల్లు పార్లమెంటులో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును క్షుణ్నంగా పరిశీలించేందుకు ఎంపిక కమిటీకి పంపాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు బిల్లును ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్‌ నిర్వహించగా, ఆ ఓటింగ్‌ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఎంపీలను మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భయపెట్టేందుకు ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.

ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్, ఓటు రశీదులను తీసుకెళ్లి సభ్యుల చేత వాటిపై సంతకాలు చేయిస్తుండటం కనిపించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. విపక్ష సభ్యులు సీఎం రమేశ్‌తో గొడవకు దిగి, ఆయన చేతుల్లో నుంచి ఆ రశీదులను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను ఎలా గెలిచిందో మనకు సభలోనే సాక్ష్యం కనిపిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్‌ అన్నారు. సీఎం రమేశ్‌ చర్యను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులంతా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంలో గతంలో ఉన్న లోటుపాట్లను తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆజాద్‌ మాట్లాడుతూ ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు.

మీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మేం బయటకు వెళ్లిపోతున్నాం’ అని అన్నారు. కాంగ్రెస్‌ ఎంపీ జైరాం రమేశ్‌ మాట్లాడుతూ సమాచార కమిషనర్లు గతంలో ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పలు తీర్పులు ఇచ్చినందున, ఇప్పుడు మోదీ సమాచార కమిషన్‌పై పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్‌ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును, సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. అనంతరం ఓట్లు లెక్కపెట్టగా, బిల్లును ఎంపిక కమిటీకి పంపవద్దని 117 ఓట్లు, పంపాలని 75 ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో విపక్ష సభ్యులెవరూ సభలో లేకపోవడంతో సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్‌ (సీఐసీ) సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలం, వేతనాలను కేంద్రమే నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement