Rajyasaba aproved
-
వైద్యరంగం మేలుకేనా?!
భ్రష్టుపట్టిన వైద్య రంగానికి, వైద్య విద్యకు చికిత్స చేయడం కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఓకే అనడంతో పార్లమెంటు ఆమోదం లభించినట్టయింది. ఈ బిల్లుకు వైద్యులు, వైద్య విద్యార్థులు మొదటి నుంచీ వ్యతిరేకం. నిరుడు జనవరిలో తొలిసారి లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు వారు దేశ వ్యాప్తంగా 12 గంటల సమ్మె చేశారు. సభలో సైతం వ్యతిరేకత వెల్లువెత్తడంతో అప్పట్లో బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపారు. అయితే తాము ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న పలు అంశాలు ఇప్పటికీ ఈ బిల్లులో ఉన్నాయన్నది వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధాన ఆరోపణ. ఈమధ్యకాలంలో ఈ స్థాయిలో వివాదాస్పదమై, తీవ్ర నిరసనలు వ్యక్తమైన బిల్లు ఇదే. ఈ బిల్లు ముసాయిదా రెండేళ్ల క్రితం వెల్లడైనప్పుడు ఇది తమకు సమ్మతం కాదని వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు తేల్చి చెప్పారు. అదే సమయంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) పని తీరు సక్రమంగా లేదన్న విష యంలో అందరికీ ఏకీభావం ఉంది. కానీ దాని స్థానంలో తీసుకొచ్చిన ఎన్ఎంసీ సైతం లొసుగుల మయం అయితే ఎలాగన్నది వారి ప్రశ్న. తమ అభ్యంతరాల తర్వాత కేవలం కొన్ని నిబంధనలు మాత్రమే స్వల్పంగా మారాయని వారంటున్నారు. పాత బిల్లు స్థాయీ సంఘం పరిశీలనకెళ్లాక ప్రధానంగా అందులో రెండు మార్పులు చేశారు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక పట్టా ఇచ్చేముందు విడిగా పెట్టదల్చిన పరీక్షను రద్దు చేశారు. కానీ అదే సమయంలో ఆఖరి సంవత్సరం ‘నేషనల్ ఎగ్జిట్ టెస్ట్’(నెక్ట్స్) పేరిట ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని, అందులో కృతార్థులైనవారే వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా అర్హులని బిల్లులోని సెక్షన్ 15(1) చెబుతోంది. పీజీ కోర్సులకోసం నిర్వహించే ఇప్పు డున్న నీట్ పరీక్ష రద్దును వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. హోమియోతో పాటు భారతీయ వైద్య విధానాలను ప్రాక్టీస్ చేసేవారికి ‘బ్రిడ్జి కోర్సు’ పెట్టి వారు రోగులకు అల్లోపతి మందుల చీటిలు రాయడాన్ని అనుమతించే పాత నిబంధన తొలగించారు. అయితే ‘బ్రిడ్జి కోర్స్’ అనే మాట లేదు తప్ప సామాజిక వైద్య సహాయకుల(సీహెచ్‌పీ) పేరిట కొత్త నిబంధన ఏర్పరిచారు. శిక్షణ పొందాక మండలాల స్థాయిలో వీరు అల్లోపతి ఔషధాలను ఒక స్థాయి వరకూ రోగులకు సూచించవచ్చునని చెబుతున్న నిబంధన వల్ల గ్రామీణ ప్రాంత వైద్య ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నది వైద్యులు, వైద్య విద్యార్థుల వాదన. ఇందులో నిజముంది. మారు మూల ప్రాంతాల్లో నాణ్యమైన, ప్రామాణికమైన వైద్య సేవలందితే నిరుపేద జనం ప్రాణాంతక మైన దీర్ఘ రోగాల బారినపడే అవకాశాలుండవు. వైద్యుల వద్ద కాంపౌండర్లుగా పనిచేసినవారో, ఇతరత్రా కోర్సులు చేసినవారో వైద్యులుగా అవతారమెత్తి ఇష్టానుసారం మందులు రాస్తుండటం వల్ల ఇప్పటికే ఎన్నో సమస్యలొస్తున్నాయి. కొత్తగా ఏర్పరిచే వ్యవస్థ ఈ స్థితిని నిర్మూలించకపోగా, దాన్ని చట్టబద్ధం చేసే ప్రమాదం కనబడుతోంది. ఈ నిబంధన పర్యవసానంగా కొత్తగా రంగంలో కొచ్చే మూడున్నర లక్షలమంది సీహెచ్‌పీలు తమకున్న పరిధులు అతిక్రమించరన్న గ్యారెంటీ లేదు. ఒకపక్క అయిదేళ్లపాటు వైద్య విద్య అభ్యసించినవారికి పట్టా ఇవ్వడం విషయంలోనే తీవ్ర మార్పులు చేసినవారు... వైద్య విద్యతో సంబంధంలేనివారిని సీహెచ్పీలుగా ఉదారంగా అనుమ తించడం మున్ముందు సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. నిజానికి ఈ నిబంధన తొలగిం చాలని స్థాయీ సంఘం సూచించింది. అయినా జరిగిందేమీ లేదు. ఇక వైద్య విద్యకు సంబంధించిన నిబంధనలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు మెడికల్ కళాశాలలు, డీమ్డ్ వర్సిటీల్లో 50 శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల్ని నియంత్రించే నిబంధన వల్ల మిగిలిన 50శాతం సీట్లకూ వారు ఇష్టానుసారం ఫీజులు నిర్ణయించే ప్రమాదం ఉంటుంది. సారాంశంలో ఇది వైద్య విద్యను ప్రైవేటీకరించడమే అవుతుంది. 75శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల్ని నియంత్రించే విధానం ఉన్నప్పుడే సాధారణ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకూ, ప్రతిభ గల విద్యార్థులకూ వైద్య విద్య అందుబాటులో ఉంటుంది. అయితే ఎన్ఎంసీ పరిధిలోకి రాని మిగిలిన 50 శాతం సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల్ని నియం త్రించుకోవచ్చునని ప్రభుత్వం అంటోంది. కానీ ఇది ఆచరణ సాధ్యమవుతుందా? ఎన్ఎంసీలో ఉండే సభ్యులకు సంబంధించిన నిబంధనలో కొంత మార్పులు చేశారు. ఇప్పుడున్న నిబంధన ప్రకారం కేంద్రం 14మందిని నామినేట్ చేస్తుంది. రాష్ట్రాల నుంచి పదిమంది ఉంటారు. వీరుగాక 9మంది స్వతంత్ర సభ్యులుంటారు. అయితే మొత్తంగా వైద్యరంగాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఆ రంగంలోని నిపుణులకే విడిచిపెట్టడం ఉత్తమం. ఆ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వాలు నామినేట్ చేసేవారే అధికంగా ఉంటే ఆ రంగానికి చెందిన నిపుణుల సూచనలు వీగిపోతాయి. దీన్ని గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. అయితే ఎన్ఎంసీ పరిధికింద నాలుగు బోర్డులు ఏర్పాటు చేయడం ఒక రకంగా మంచిదే. దీని ప్రకారం డిగ్రీ స్థాయి విద్య కోసం ఒకటి, పీజీ విద్యా వ్యవహారాలు చూసేందుకు మరొకటి బోర్డులు ఏర్పాటవుతాయి. ఇక వైద్య కళాశాలల పనితీరు మదింపు వేయడం, వాటికి రేటింగ్ నిర్ణయించడంవంటివి పర్యవేక్షించడానికి ఒక బోర్డు, ఈ రంగంలో నైతిక విలువల పరిరక్షణకు, రిజిస్ట్రేషన్ వ్యవహారాలు చూసేందుకు మరొక బోర్డు ఏర్పాటవుతాయి. ఇన్నాళ్లూ అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరించడంవల్ల పర్యవేక్షణ లోపం మాత్రమే కాదు... అవినీతి కూడా ఊడలు వేసిందని అందరూ అనుకుంటున్నదే. మొత్తానికి ఎన్నో ఏళ్ల తర్వాత సమగ్రమైన మార్పులు చేయడానికంటూ తీసుకొచ్చిన బిల్లు సైతం ఆ రంగంలోనివారికి పెద్దగా సంతృప్తినీయకపోవడం విచారకరం. ఈ విషయంలో కేంద్రం మరిన్ని సంప్రదింపులు జరిపి ఉంటే బాగుండేది. -
యూఏపీఏ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : చట్ట వ్యతిరేక కార్యకలపాల (నిరోధక) సవరణ బిల్లు (యూఏపీఏ)కు శుక్రవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో అనుకూలంగా 147 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 42 మంది ఎంపీలు ఓటు చేశారు. వ్యక్తులనూ ఉగ్రవాదులుగా ప్రకటించేందుకు వెసులుబాటు కల్పించే ఈ బిల్లు ప్రస్తుత పరిస్థితుల్లో కీలకమైనదని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఉగ్ర సంస్థలపై నిషేధం విధిస్తున్న సందర్భాల్లో వ్యక్తులు మరో కొత్త సంస్థలను ఉనికిలోకి తెస్తున్నారని ఆయన అన్నారు. పెద్దలో సభలో బిల్లు ఆమోదానికి ముందు బిల్లుపై వాడివేడి చర్చ సాగింది. ఉగ్రవాదానికి మతం లేదని, కాలానుగుణంగా చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందని చర్చను ప్రారంభిస్తూ అమిత్ షా అన్నారు. గతంలో ఈ తరహా కేసులను రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించారని, యూఏపీఏ బిల్లును ఓ మతాన్ని టార్గెట్ చేస్తుందనే దుష్ర్పచారం సాగిందని చెప్పారు. బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యులను ఉద్దేశిస్తూ ఎమర్జెన్సీ సమయంలో మీడియాను నిషేధించి, విపక్ష నేతలందరినీ జైలు పాలు చేసిన మీకు చట్టాలను దుర్వినియోగం చేస్తున్నామని మమ్మల్ని ఆరోపించే అర్హత లేదని మండిపడ్డారు. యూఏపీఏ బిల్లు రెండు విభిన్న అంశాలతో కూడిఉందని చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యులు, మాజీ కేంద్ర మంత్రి చిదంబరం చెప్పుకొచ్చారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు, ఉగ్రవాదం రెండు భిన్న అంశాలను ఒకే బిల్లులో ఎలా పొందుపరుస్తారని ప్రశ్నించారు. వ్యక్తులను శిక్షించే అధికారం ప్రస్తుత చట్టంలో ఉండగా సవరణ బిల్లు అవసరం ఏముందని ప్రశ్నించారు. ఉగ్రవాదులో కూడిన ఉగ్ర సంస్ధలను నిషేధిస్తే తిరిగి వ్యక్తులను ఉగ్రవాదులుగా ప్రకటించడం ఎందుకని నిలదీశారు. వివాదాస్పద అంశాలతో కూడిన బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని చిదంబరం కోరారు. -
ఆర్టీఐ బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టానికి కేంద్రం తీసుకొచ్చిన సవరణల బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ‘సమాచార హక్కు (సవరణ) బిల్లు–2019’ని లోక్‌సభ సోమవారమే ఆమోదించగా, తాజాగా రాజ్యసభ కూడా ఆమోదించడంతో ఆ బిల్లు పార్లమెంటులో గట్టెక్కింది. అయితే ఈ బిల్లును క్షుణ్నంగా పరిశీలించేందుకు ఎంపిక కమిటీకి పంపాల్సిందేనని రాజ్యసభలో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు పట్టుబట్టడంతో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. చివరకు బిల్లును ఎంపిక కమిటీకి పంపాలా? వద్దా? అనే విషయంపై ఓటింగ్ నిర్వహించగా, ఆ ఓటింగ్ సమయంలో తమకు అనుకూలంగా ఓటు వేయాల్సిందిగా ఎంపీలను మంత్రులు, అధికార పార్టీ సభ్యులు భయపెట్టేందుకు ప్రయత్నించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇటీవలే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సీఎం రమేశ్, ఓటు రశీదులను తీసుకెళ్లి సభ్యుల చేత వాటిపై సంతకాలు చేయిస్తుండటం కనిపించడంతో ప్రతిపక్షాలు తీవ్రంగా ప్రతిస్పందించాయి. విపక్ష సభ్యులు సీఎం రమేశ్‌తో గొడవకు దిగి, ఆయన చేతుల్లో నుంచి ఆ రశీదులను లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. అధికార పార్టీ లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లను ఎలా గెలిచిందో మనకు సభలోనే సాక్ష్యం కనిపిస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షనేత గులాం నబీ ఆజాద్ అన్నారు. సీఎం రమేశ్ చర్యను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులంతా వెల్‌లోకి వచ్చి ఆందోళనలు చేస్తూ నిరసన తెలిపారు. సిబ్బంది, శిక్షణ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఆర్టీఐ చట్టంలో గతంలో ఉన్న లోటుపాట్లను తమ ప్రభుత్వం సరిచేస్తోందని చెప్పుకొచ్చారు. అయితే ఆజాద్ మాట్లాడుతూ ‘మీరు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారు. మీ మీద మాకు నమ్మకం లేదు. కాబట్టి మేం బయటకు వెళ్లిపోతున్నాం’ అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ మాట్లాడుతూ సమాచార కమిషనర్లు గతంలో ప్రభుత్వానికి, ప్రధానికి వ్యతిరేకంగా పలు తీర్పులు ఇచ్చినందున, ఇప్పుడు మోదీ సమాచార కమిషన్‌పై పగ తీర్చుకుంటున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌తోపాటు తృణమూల్ కాంగ్రెస్, వామపక్షాలు, సమాజ్‌వాదీ పార్టీ తదితర ప్రతిపక్ష పార్టీలు ఈ బిల్లును, సభలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ బయటకు వెళ్లిపోయాయి. అనంతరం ఓట్లు లెక్కపెట్టగా, బిల్లును ఎంపిక కమిటీకి పంపవద్దని 117 ఓట్లు, పంపాలని 75 ఓట్లు వచ్చినట్లు తెలిసింది. దీంతో విపక్ష సభ్యులెవరూ సభలో లేకపోవడంతో సవరణ బిల్లును రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) సహా సమాచార కమిషనర్లందరి పదవీ కాలం, వేతనాలను కేంద్రమే నిర్ణయించేలా ఈ బిల్లులో నిబంధనలు ఉన్నాయి. -
జీఎస్టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్టీ బిల్లులో నాలుగు కీలక సవరణలు చేస్తూ పెద్దల సభ ఆమోదించింది. జీఎస్టీ చట్టం అయితే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి అన్నాడీఎంకే వాకౌట్ చేసింది. డివిజన్‌కు కాంగ్రెస్ పట్టుబట్టడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అంగీకరించారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ నాలుగు సవరణలను ప్రతిపాదించింది. చివరగా, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలపై రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. జీఎస్టీ బిల్లుకు అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లులో పలు సవరణలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జీఎస్టీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.