వైద్యరంగం మేలుకేనా?! | National Medical Commission Bill Passed In Rajya Sabha | Sakshi
Sakshi News home page

వైద్యరంగం మేలుకేనా?!

Published Sat, Aug 3 2019 12:57 AM | Last Updated on Sat, Aug 3 2019 2:11 AM

National Medical Commission Bill Passed In  Rajya Sabha - Sakshi

భ్రష్టుపట్టిన వైద్య రంగానికి, వైద్య విద్యకు చికిత్స చేయడం కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జాతీయ వైద్య కమిషన్‌(ఎన్‌ఎంసీ) బిల్లుకు గురువారం రాజ్యసభ కూడా ఓకే అనడంతో పార్లమెంటు ఆమోదం లభించినట్టయింది. ఈ బిల్లుకు వైద్యులు, వైద్య విద్యార్థులు మొదటి నుంచీ వ్యతిరేకం. నిరుడు జనవరిలో తొలిసారి లోక్‌సభలో దీన్ని ప్రవేశపెట్టినప్పుడు వారు దేశ వ్యాప్తంగా 12 గంటల సమ్మె చేశారు. సభలో సైతం వ్యతిరేకత వెల్లువెత్తడంతో అప్పట్లో బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపారు. అయితే తాము ఆదినుంచీ వ్యతిరేకిస్తున్న పలు అంశాలు ఇప్పటికీ ఈ బిల్లులో ఉన్నాయన్నది వైద్యులు, వైద్య విద్యార్థుల ప్రధాన ఆరోపణ. ఈమధ్యకాలంలో ఈ స్థాయిలో వివాదాస్పదమై, తీవ్ర నిరసనలు వ్యక్తమైన బిల్లు ఇదే. ఈ బిల్లు ముసాయిదా రెండేళ్ల క్రితం వెల్లడైనప్పుడు ఇది తమకు సమ్మతం కాదని వైద్యరంగ నిపుణులు, విద్యార్థులు తేల్చి చెప్పారు. అదే సమయంలో భారతీయ వైద్య మండలి(ఎంసీఐ) పని తీరు సక్రమంగా లేదన్న విష యంలో అందరికీ ఏకీభావం ఉంది. కానీ దాని స్థానంలో తీసుకొచ్చిన ఎన్‌ఎంసీ సైతం లొసుగుల మయం అయితే ఎలాగన్నది వారి ప్రశ్న. తమ అభ్యంతరాల తర్వాత కేవలం కొన్ని నిబంధనలు మాత్రమే స్వల్పంగా మారాయని వారంటున్నారు.

పాత బిల్లు స్థాయీ సంఘం పరిశీలనకెళ్లాక ప్రధానంగా అందులో రెండు మార్పులు చేశారు. ఎంబీబీఎస్‌ పూర్తయ్యాక పట్టా ఇచ్చేముందు విడిగా పెట్టదల్చిన పరీక్షను రద్దు చేశారు. కానీ అదే సమయంలో ఆఖరి సంవత్సరం ‘నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్ట్‌’(నెక్ట్స్‌) పేరిట ఉమ్మడి పరీక్ష నిర్వహించాలని, అందులో కృతార్థులైనవారే వైద్య వృత్తిలో ప్రవేశించేందుకైనా, పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరడానికైనా అర్హులని బిల్లులోని సెక్షన్‌ 15(1) చెబుతోంది. పీజీ కోర్సులకోసం నిర్వహించే ఇప్పు డున్న నీట్‌ పరీక్ష రద్దును వైద్య విద్యార్థులు, రెసిడెంట్‌ డాక్టర్లు వ్యతిరేకిస్తున్నారు. హోమియోతో పాటు భారతీయ వైద్య విధానాలను ప్రాక్టీస్‌ చేసేవారికి ‘బ్రిడ్జి కోర్సు’ పెట్టి వారు రోగులకు అల్లోపతి మందుల చీటిలు రాయడాన్ని అనుమతించే పాత నిబంధన తొలగించారు. అయితే ‘బ్రిడ్జి కోర్స్‌’ అనే మాట లేదు తప్ప సామాజిక వైద్య సహాయకుల(సీహెచ్‌పీ) పేరిట కొత్త నిబంధన ఏర్పరిచారు. శిక్షణ పొందాక మండలాల స్థాయిలో వీరు అల్లోపతి ఔషధాలను ఒక స్థాయి వరకూ రోగులకు సూచించవచ్చునని చెబుతున్న నిబంధన వల్ల గ్రామీణ ప్రాంత వైద్య ఆరోగ్య వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందన్నది వైద్యులు, వైద్య విద్యార్థుల వాదన.

ఇందులో నిజముంది. మారు మూల ప్రాంతాల్లో నాణ్యమైన, ప్రామాణికమైన వైద్య సేవలందితే నిరుపేద జనం ప్రాణాంతక మైన దీర్ఘ రోగాల బారినపడే అవకాశాలుండవు. వైద్యుల వద్ద కాంపౌండర్లుగా పనిచేసినవారో, ఇతరత్రా కోర్సులు చేసినవారో వైద్యులుగా అవతారమెత్తి ఇష్టానుసారం మందులు రాస్తుండటం వల్ల ఇప్పటికే ఎన్నో సమస్యలొస్తున్నాయి. కొత్తగా ఏర్పరిచే వ్యవస్థ ఈ స్థితిని నిర్మూలించకపోగా, దాన్ని చట్టబద్ధం చేసే ప్రమాదం కనబడుతోంది. ఈ నిబంధన పర్యవసానంగా కొత్తగా రంగంలో కొచ్చే మూడున్నర లక్షలమంది సీహెచ్‌పీలు తమకున్న పరిధులు అతిక్రమించరన్న గ్యారెంటీ లేదు. ఒకపక్క అయిదేళ్లపాటు వైద్య విద్య అభ్యసించినవారికి పట్టా ఇవ్వడం విషయంలోనే తీవ్ర మార్పులు చేసినవారు... వైద్య విద్యతో సంబంధంలేనివారిని సీహెచ్‌పీలుగా ఉదారంగా అనుమ తించడం మున్ముందు సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదు. నిజానికి ఈ నిబంధన తొలగిం చాలని స్థాయీ సంఘం సూచించింది. అయినా జరిగిందేమీ లేదు. 

ఇక వైద్య విద్యకు సంబంధించిన నిబంధనలు కూడా విమర్శలకు తావిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు మెడికల్‌ కళాశాలలు, డీమ్డ్‌ వర్సిటీల్లో 50 శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల్ని నియంత్రించే నిబంధన వల్ల మిగిలిన 50శాతం సీట్లకూ వారు ఇష్టానుసారం ఫీజులు నిర్ణయించే ప్రమాదం ఉంటుంది. సారాంశంలో ఇది వైద్య విద్యను ప్రైవేటీకరించడమే అవుతుంది. 75శాతం సీట్లకు సంబంధించిన ఫీజుల్ని నియంత్రించే విధానం ఉన్నప్పుడే సాధారణ కుటుంబాల నుంచి వచ్చే విద్యార్థులకూ, ప్రతిభ గల విద్యార్థులకూ వైద్య విద్య అందుబాటులో ఉంటుంది. అయితే ఎన్‌ఎంసీ పరిధిలోకి రాని మిగిలిన 50 శాతం సీట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఫీజుల్ని నియం త్రించుకోవచ్చునని ప్రభుత్వం అంటోంది. కానీ ఇది ఆచరణ సాధ్యమవుతుందా? ఎన్‌ఎంసీలో ఉండే సభ్యులకు సంబంధించిన నిబంధనలో కొంత మార్పులు చేశారు. ఇప్పుడున్న నిబంధన ప్రకారం కేంద్రం 14మందిని నామినేట్‌ చేస్తుంది.

రాష్ట్రాల నుంచి పదిమంది ఉంటారు. వీరుగాక 9మంది స్వతంత్ర సభ్యులుంటారు. అయితే మొత్తంగా వైద్యరంగాన్ని పర్యవేక్షించే వ్యవస్థను ఆ రంగంలోని నిపుణులకే విడిచిపెట్టడం ఉత్తమం. ఆ వ్యవస్థ నిర్వహణలో ప్రభుత్వాలు నామినేట్‌ చేసేవారే అధికంగా ఉంటే ఆ రంగానికి చెందిన నిపుణుల సూచనలు వీగిపోతాయి. దీన్ని గురించి ఆలోచించి ఉంటే బాగుండేది. అయితే ఎన్‌ఎంసీ పరిధికింద నాలుగు బోర్డులు ఏర్పాటు చేయడం ఒక రకంగా మంచిదే. దీని ప్రకారం డిగ్రీ స్థాయి విద్య కోసం ఒకటి, పీజీ విద్యా వ్యవహారాలు చూసేందుకు మరొకటి బోర్డులు ఏర్పాటవుతాయి. ఇక వైద్య కళాశాలల పనితీరు మదింపు వేయడం, వాటికి రేటింగ్‌ నిర్ణయించడంవంటివి పర్యవేక్షించడానికి ఒక బోర్డు, ఈ రంగంలో నైతిక విలువల పరిరక్షణకు, రిజిస్ట్రేషన్‌ వ్యవహారాలు చూసేందుకు మరొక బోర్డు ఏర్పాటవుతాయి. ఇన్నాళ్లూ అన్నిటినీ ఒకేచోట కేంద్రీకరించడంవల్ల పర్యవేక్షణ లోపం మాత్రమే కాదు... అవినీతి కూడా ఊడలు వేసిందని అందరూ అనుకుంటున్నదే. మొత్తానికి ఎన్నో ఏళ్ల తర్వాత సమగ్రమైన మార్పులు చేయడానికంటూ తీసుకొచ్చిన బిల్లు సైతం ఆ రంగంలోనివారికి పెద్దగా సంతృప్తినీయకపోవడం విచారకరం. ఈ విషయంలో కేంద్రం మరిన్ని సంప్రదింపులు జరిపి ఉంటే బాగుండేది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement