జీఎస్‌టీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) సవరణ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. జీఎస్‌టీ బిల్లులో నాలుగు కీలక సవరణలు చేస్తూ పెద్దల సభ ఆమోదించింది. జీఎస్‌టీ చట్టం అయితే దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలులోకి రానుంది. ఈ నేపథ్యంలో జీఎస్‌టీ బిల్లును వ్యతిరేకిస్తూ సభ నుంచి అన్నాడీఎంకే వాకౌట్ చేసింది. డివిజన్‌కు కాంగ్రెస్ పట్టుబట్టడంతో రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ అంగీకరించారు.
చివరి నిమిషంలో కాంగ్రెస్ నాలుగు సవరణలను ప్రతిపాదించింది. చివరగా, ప్రతిపక్షాలు ప్రతిపాదించిన పలు సవరణలపై రాజ్యసభలో ఓటింగ్ నిర్వహించారు. జీఎస్‌టీ బిల్లుకు అనుకూలంగా 197 ఓట్లు వచ్చాయి. దాంతో బిల్లులో పలు సవరణలపై కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. జీఎస్‌టీ బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. బిల్లుకు ఆమోదం తెలిపిన అనంతరం సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ ప్రకటించారు.