
GST reward scheme: జీఎస్టీ లక్కీ డ్రా 'మేరా బిల్ మేరా అధికార్'(Mera Bill Mera Adhikar) పథకం ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో శుక్రవారం (సెప్టెంబర్ 1) ప్రారంభమైంది. కేంద్ర, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రివార్డ్ స్కీమ్ కోసం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 30 కోట్ల కార్పస్‌ను కేటాయించాయి.
‘మేరా బిల్ మేరా అధికార్’ మొబైల్ యాప్‌ను ఇప్పటివరకు 50,000 మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్నారని హర్యానా ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా తెలిపారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ 'మేరా బిల్ మేరా అధికార్' జీఎస్టీ లక్కీ డ్రాను ఆరు రాష్ట్రాల్లో పైలట్ ప్రాతిపదికన ప్రారంభిస్తున్నామని, ప్రైజ్ మనీని కేంద్రంతో పాటు రాష్ట్రాలు కూడా సమానంగా జమచేస్తాయని తెలిపారు.
ఇదీ చదవండి: High Profit Farming Business: ఈ గడ్డి సాగుతో రూ. లక్షల రాబడి.. పెట్టుబడీ తక్కువే!
అస్సాం, గుజరాత్, హర్యానా రాష్ట్రాలు, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ, డామన్ & డయ్యూ కేంద్ర పాలిత ప్రాంతాల్లో సెప్టెంబర్ 1న ప్రయోగాత్మకంగా మేరా బిల్ మేరా అధికార్ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నెలా 810 లక్కీ డ్రాలు ఉంటాయి. అలాగే ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. నెలవారీ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.10,000 చొప్పున 800 మందికి అందిస్తారు. రూ. 10 లక్షల బహుమతితో 10 డ్రాలు ఉంటాయి. ఇక ప్రతి త్రైమాసికంలో రెండు బంపర్ డ్రాలలో ఒక్కో విజేతకు రూ.1 కోటి ఉంటుంది.