
ఢిల్లీ: మూడు నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు.
బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ కూడా బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.
ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్‌ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్‌లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు.
దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
Comments
Please login to add a commentAdd a comment