Criminal procedure
-
సంకెళ్ల సంస్కృతి మళ్లీ మొదలా?
మన దేశంలో నిందితులకు బేడీలు వేయడం అతి మామూలు విషయం. ఈ విధంగా బేడీలు వేయడం చట్టబద్ధమేనా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. బేడీలు వేయడానికి చట్టబద్ధత లేదా? నిందితులు తప్పించుకుంటే ఎలా అన్న ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 49 ప్రకారం అరెస్ట్ అయిన వ్యక్తి తప్పించుకోకుండా కావలసిన నిర్బంధాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అంతేకాని నిందితులకి సాధారణంగా బేడీలు వేయకూడదు. ఈ విషయాన్ని చాలా కేసులలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. అరెస్ట్ అంటే ఒక వ్యక్తి స్వేచ్ఛను నిలుపుదల చేయడం. అది కోర్టు ఉత్తర్వుల వల్ల కావచ్చు లేక అతని మీద ఆరోపించబడిన నేరానికి జవాబు చెప్పటం కోసం కావచ్చు. అరెస్ట్ ఉద్దేశ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి అతనిపై ఉన్న క్రిమినల్ ఆరోపణలకు అతను కోర్టులో జవాబు చెప్పటానికి, రెండవది అతను ఏదైనా నేరం చేయకుండా నిరోధించటానికి. అరెస్ట్ చేసే క్రమంలో అవసరమైన బలప్రయోగాన్ని పోలీసులు ఉపయోగించవచ్చు. అయితే ఆ వ్యక్తి అరెస్ట్‌ని నిరోధించినప్పుడు మాత్రమే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది. జీవిత ఖైదు కానీ మరణ శిక్ష కానీ విధించే నేరం చేసిన వ్యక్తులను అవసరమైతే చంపటానికి కూడా అవకాశం ఉంది. అంతే కానీ సంకెళ్ళు వేయాలని చట్టంలో ఎక్కడా చెప్పలేదు. సంకెళ్ళు వేయడాన్ని చట్టం ఆమోదించదు. సంకెళ్ళు వేయడం లాంటి చర్యలు అమానుషమనీ, ముద్దాయి గౌరవానికి భంగం కలిగించడమనీ చాలా కేసుల్లో సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 21 లకు సంకెళ్ళు వేయడం అనేది విరుద్ధం. సంకెళ్ళు, బంధనాలు శిక్షపడిన ఖైదీలకు కానీ విచారణలో ఉన్న ఖైదీలకు కానీ వేయడానికి వీలులేదు. కోర్టు ముందు హాజరు పరిచిన ముద్దాయిలకు సంకెళ్ళు వేయాలంటే మెజిస్ట్రేట్ అనుమతి అవసరం. ఆ వ్యక్తి పారిపోడానికి ప్రయత్నం చేస్తాడని ఆధారాలు ఉన్నపుడు, పోలీసుల కస్టడీ నుంచి పారిపోతాడని కచ్చితంగా భావించినప్పుడు, అరుదైన కేసుల్లో, హింసాత్మకమైన ప్రవృత్తి ఉన్నప్పుడు, వాళ్ళు అపాయకరమైన వ్యక్తులు అయినప్పుడు మేజిస్ట్రేట్ ఈ అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అలా నిర్ణయానికి రావడానికి మేజిస్ట్రేట్ కారణాలు కూడా రాయాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు చాలా కేసుల్లో స్పష్టం చేసింది. అందులో ప్రముఖమైన కేసు ప్రేమ్ శంకర్ శుక్లా వర్సెస్ ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ (ఏఐఆర్ 1980 సుప్రీం కోర్టు 1535). ఒకవేళ పోలీసులు సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ఉల్లంఘించి సంకెళ్ళు వేసినట్లైతే వారు కోర్టు ధిక్కార నేరం కింద శిక్షింపబడతారని సుప్రీంకోర్టు సిటిజెన్స్ డెమొక్రసీ వర్సెస్ స్టేట్ ఆఫ్ అస్సాం 1996 సుప్రీంకోర్టు కేసెస్ (క్రిమినల్) 612 లో స్పష్టం చేసింది. సంకెళ్ళు వేయకుండా ముద్దాయి తప్పించుకోకుండా ఉండడానికి సుప్రీంకోర్టు ప్రేమ్ శంకర్ శుక్లా కేసులో కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది. అవి ఎస్కార్ట్‌లో ఉన్న పోలీసుల సంఖ్య పెంచాలి. వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి. వారికి సరైన శిక్షణ కూడా ఇవ్వాలి. అయితే కొత్తగా వచ్చిన ‘భారతీయ నాగరిక సురక్ష సంహిత’ సంకెళ్ళు వేయడం విషయంలో అనుమతి ఇచ్చింది. ఈ కొత్త చట్టం లోని సెక్షన్ 43లో అరెస్ట్ ఎలా చేయాలో చెప్పారు. అదే విధంగా సబ్ సెక్షన్ 3లో అరెస్ట్ చేసినప్పుడు సంకెళ్ళు వేయడం గురించి కూడా చెప్పారు. నేర స్వభావాన్ని నేర తీవ్రతను బట్టి అరెస్ట్ చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. అలవాటుపడిన నేరస్థులకు, మళ్ళీ మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు, కస్టడీ నుంచి తప్పించుకున్న వ్యక్తులకు, వ్యవస్థీకృత నేరం చేసిన వ్యక్తులకు, తీవ్రవాద చర్యలు పాల్పడిన వ్యక్తులకు, మాదక ద్రవ్యాల నేరాలు చేసిన వ్యక్తులకు, ఆయుధాలు, మందుగుండు సామాను అక్రమంగా కలిగిన వ్యక్తులకు; హత్య, రేప్, యాసిడ్ దాడి, నకిలీ నాణాలు, నోట్లు కలిగి ఉన్న వ్యక్తులకు, మనుషుల అక్రమ రవాణా చేసే వ్యక్తులకు, పిల్లలపై సెక్స్ నేరాలు చేసిన వ్యక్తులకు, రాజ్యంగ వ్యతిరేకంగా వ్యవహరించిన వ్యక్తులకు పోలీసులు సంకెళ్ళు వేయవచ్చని ఈ నిబంధన చెప్తుంది. రాజ్యానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు ఏమిటి అనే విషయంలో స్పష్టత లేదు. అందుకని అందరికీ సంకెళ్ళు వేసే అవకాశం ఉంది. మళ్ళీ నేరం చేసిన వ్యక్తులకు సంకెళ్ళు వేయవచ్చు. దీన్ని చట్టంలో నిర్వచించలేదు. అందుకని ఇది కూడా దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఉదాహరణకు భార్యా భర్తల మధ్య తగువు ఏర్పడి కట్నం కోసం వేధిస్తున్నారన్న దరఖాస్తుతో బాటు మరెన్నో కేసులను పెట్టిన సందర్భాలను మనం చూస్తున్నాం. ఆ కేసులు నిజమైనవా అబద్ధమైనవా అన్న విషయం అప్పుడు తెలియదు. ఈ కేసులు భర్త మీదే కాకుండా కుటుంబ సభ్యులందరి మీదా పెడుతున్నారు. అలాంటప్పుడు వారందరికీ సంకెళ్ళు వేసే పరిస్థితి చట్టం కల్పిస్తుంది. అప్పుడు వాళ్ళు ఎంతటి అసౌకర్యానికి గురవుతారో, ఎంతటి అవమానానికి గురవుతారో ఊహించవచ్చు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇట్లా ఎన్నో కేసులను ఉదాహరించవచ్చు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడే సంకెళ్ల సంస్కృతి మన దేశంలో ఉంది. సంకెళ్ళు వేయడమే కాదు నేరారోపణలకు గురి అయిన వ్యక్తులను ఊరేగించడం మనం చూస్తున్నాం. ప్రజలు ఆవిధంగా కోరుకుంటున్నారు కాబట్టి మేము ఊరేగిస్తున్నామని పోలీసులు అంటారు. చట్టం అనుమతి ఇవ్వనప్పుడు ఆ విధంగా ఊరేగించటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు కొన్ని సందర్భాలలో సంకెళ్ళు వేయడాన్ని చట్టం అనుమతి ఇస్తుంది. ఇలాంటప్పుడు సంకెళ్ళు వేసి దుర్వినియోగం చేసే పరిస్థితి ఎక్కువ అవుతుంది. సంకెళ్ళు వేయడం రాజ్యాంగ విరుద్ధం, మానవ హక్కుల ఉల్లంఘన అని సుప్రీం కోర్టు చాలా కేసుల్లో చెప్పింది. ఆ తీర్పులన్నింటినీ ప్రక్కన పెట్టి కొత్త చట్టంలో సంకెళ్ళు వేసే వెసులుబాటును పార్లమెంటు కల్పించింది. ఈ వెసులుబాటు మరెంత దుర్వినియోగం అవుతుందో వేచి చూడాలి.డా‘‘ మంగారి రాజేందర్ వ్యాసకర్త తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడెమీ డైరెక్టర్ ‘ 9440483001 -
నేర చట్టాలు సరికొత్తగా..
సాక్షి, హైదరాబాద్: బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), క్రిమినల్ ప్రొసిజర్ కోడ్ (సీఆర్పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఏఈ) స్థానంలో దేశవ్యాప్తంగా సోమవారం నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి వచ్చాయి. భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియం (బీఎస్ఏ)లోని వివిధ సెక్షన్ల కిందే దేశంలో కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలో తొలి ఎఫ్ఐఆర్ చార్మినార్‌లో నమోదైంది. నంబర్ ప్లేట్ లేకుండా ద్విచక్ర వాహనం నడిపిన వ్యక్తిపై కొత్త చట్టాల్లోని సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు.కొత్త రకాల నేరాలకు చోటు.. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద చర్యల గురించి ఈ కొత్త చట్టాల్లో స్పష్టంగా నిర్వచించారు. రాజద్రోహం అనే పదాన్ని తొలగించి దాని స్థానంలో దేశ సార్వ¿ౌమత్వం, సమగ్రతలకు భంగం కలిగించే చర్యలను శిక్షార్హం చేశారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపులకు కొత్త అధ్యాయాన్ని చేర్చారు. పెళ్లి పేరుతో మహిళలను లోబరుచుకొని మోసగించడం, చిన్నారులపై సామూహిక అత్యాచారాలు, మూక దాడుల వంటి నేరాలకు ఐపీసీలో ప్రత్యేక సెక్షన్లు లేవు. ఆ లోటును భారతీయ న్యాయ సంహితలో భర్తీ చేశారు. సత్వర న్యాయం కోసం ప్రతి అంశంలో గడువు నిర్దేశిస్తూ బీఎన్ఎస్ఎస్లో 45 సెక్షన్లు చేర్చారు. అరెస్టు, తనిఖీ, సీజ్, దర్యాప్తులో పోలీసుల జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి 20కిపైగా కొత్త సెక్షన్లు ప్రవేశపెట్టారు.కొత్త నేర చట్టాల్లోని కొన్ని ముఖ్యమైన సెక్షన్ల గురించి కుప్లంగా.. ఈ–ఎఫ్ఐఆర్సెక్షన్ 173 (1) బీఎన్ఎస్ఎస్ ప్రకారం.. నేరం జరిగిన చోటు నుంచే కాకుండా దేశంలో ఎక్కడ ఉన్నా ఆన్లైన్లో ఈ–ఎఫ్ఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అది ప్రజల హక్కు. అనంతరం పోలీసుల నుంచి జాప్యం లేకుండా సెక్షన్ 173 (2) ప్రకారం ఎఫ్ఐఆర్ కాపీని పొందవచ్చు. సెక్షన్ 193 (3) (2) ప్రకారం 90 రోజుల్లోగా కేసు దర్యాప్తు పురోగతిని బాధితులకు విధిగా తెలియజేయాలి. మరణశిక్షే.. తప్పుడు హామీతో మహిళను లోబరుచుకొని లైంగిక అవసరాలు తీర్చుకుంటే సెక్షన్ 69 కింద కఠిన నేరంగా పరిగణిస్తారు. బాలికపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడితే సెక్షన్ 70 (2) ప్రకారం మరణశిక్ష విధించే అవకాశం ఉంది. సెక్షన్ 176 (1) ప్రకారం బాధితుల ఆడియో, వీడియో రికార్డింగ్‌కు అనుమతి తీసుకోవాలి. బాధిత మహిళకు వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా సెక్షన్ 184 (1) ప్రకారం ఆమె అనుమతి తప్పనిసరి. సెక్షన్ 184 (6) కింద వారంలోగా వైద్య పరీక్షల నివేదికను సంబంధిత వైద్యుడు దర్యాప్తు అధికారి ద్వారా కోర్టుకు అందజేయాలి. డిజిటల్ రికార్డులు... ఎల్రక్టానిక్, డిజిటల్ రికార్డులను కూడా ప్రాథమిక సాక్ష్యంగా పరిగణిస్తారు. సెక్షన్ 2 (1) (డీ) ప్రకారం డాక్యుమెంట్ నిర్వచనాన్ని పొడిగించి అందులో వీటిని భాగం చేశారు. సెక్షన్ 61 కింద ఇతర డాక్యుమెంట్లతో సమానంగా డిజిటల్ డాక్యుమెంట్లను పరిగణిస్తారు. సెక్షన్ 62, 63 ప్రకారం కోర్టులో ఎల్రక్టానిక్ రికార్డులకు ఆమోదం ఉంటుంది. ఈ–బయాన్.. సెక్షన్ 530 కింద కోర్టుల్లో బాధితుల నుంచి ఎల్రక్టానిక్ స్టేట్మెంట్ తీసుకొనేందుకు అనుమతి. ఆన్లైన్ ద్వారా సాక్షులు, నిందితుల హాజరు.(బీఎస్ఏలోని సెక్షన్ 2 కూడా ఇదే అంశాన్ని చెబుతోంది) గడువు నిర్దేశం.. సెక్షన్ 251: తొలి విచారణ చేపట్టిన 60 రోజుల్లోగా అభియోగాలను నమోదు చేయాలి. సెక్షన్ 346: క్రిమినల్ కేసుల విచారణలో రెండు వాయిదాలకు మించి వేయడానికి వీలులేదు. సెక్షన్ 258: క్రిమినల్ కోర్టుల్లో విచారణ పూర్తయిన 45 రోజుల్లోగా తీర్పు వెల్లడించాలి.పర్యవేక్షణ.. సెక్షన్ 20: కేసుల విచారణ వేగవంతం, అప్పీల్ దాఖలుపై అభిప్రాయాలను జిల్లా డైరెక్టరేట్ ప్రాసిక్యూషన్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్ పర్యవేక్షిస్తుంటాయి. అండర్ ట్రయల్స్ విడుదల... సెక్షన్ 479: నిందితులు చేసిన నేరంలో మూడింట ఒక వంతు జైలులో ఉంటే వారి విడుదలకు అనుమతి. అయితే వారికి అదే తొలి నేరమై ఉండాలి.తనిఖీల వీడియో రికార్డు.. సెక్షన్ 105: పోలీసులు తనిఖీలు, సీజ్‌లు చేసేటప్పుడు వీడియో రికార్డింగ్ తప్పనిసరి. సెక్షన్ 35 (7): కేసులో మూడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే అవకాశం ఉండి.. అనారోగ్యంతో బాధపడతున్నా లేదా 60 ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న వారి అరెస్టుకు డిప్యూటీ ఎస్పీ ర్యాంక్ అధికారి అనుమతి తీసుకోవాలి. సెక్షన్ 76: ఏడేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే నేరాలకు ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనిసరి. ఉగ్రవాదానికి నిర్వచనం.. బీఎన్ఎస్ సెక్షన్ 113: దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమాధికారం, భద్రత, ఆర్థిక భద్రతకు ముప్పవాటిల్లే చర్యలు చేపడితే ఉగ్రవాదంగా పరిగణిస్తారు. ఆన్‌లైన్‌లోనూ సమన్లు.. నిందితులు లేదా ప్రతివాదులకు ఎస్ఎంఎస్, వాట్సాప్ లాంటి ఎల్రక్టానిక్ మాధ్యమాల ద్వారా కూడా సమన్లు జారీ చేయొచ్చు. దీంతో తమకు సమన్లు అందలేదని వారు తప్పించుకొనే వీలుండదు. చైన్ స్నాచింగ్.. గతంలో చైన్ స్నాచింగ్ లాంటి వాటికి ప్రత్యేక శిక్షలు లేవు. భారతీయ న్యాయ సంహితలో స్నాచింగ్‌ను కూడా నేరంగా పేర్కొన్నారు. స్నాచింగ్‌కు పాల్పడిన వారిని నేరస్తులుగా గుర్తిస్తారు. దేశద్రోహం.. భారతీయ శిక్షాస్మృతిలోని రాజద్రోహాన్ని ఇప్పుడు దేశద్రోహంగా మార్పు చేశారు. కులం, మతంతో పాటు మరే ఇతర కారణంతోనైనా సామూహిక దాడులు, హత్యకు పాల్పడితే యావజ్జీవ శిక్ష పడనుంది. -
నూతన క్రిమినల్ చట్టాలు అమలు ఎప్పటి నుంచో తెలుసా?
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మూడు నూతన క్రిమినల్ చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ మేరకు నూతన చట్టాలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం చదవండి: నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం -
నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం
ఢిల్లీ: మూడు నూతన క్రిమినల్ బిల్లులకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. దీంతో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య బిల్లులు చట్టంగా మారాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశంలో మూడు క్రిమినల్ బిల్లులను పార్లమెంట్ ఉభయసభలు ఆమోదించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ బిల్లులను రాష్ట్రపతి అనుమతి కోసం పంపించారు. బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ కూడా బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం -
Winter Parliament Session 2023: క్రిమినల్ చట్టాలకు ఆమోదం
న్యూఢిల్లీ: బ్రిటిష్ వలస పాలన నాటి క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న మూడు కీలక బిల్లులకు గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదించిన విషయం తెలిసిందే. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశ పెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్–1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్–1898, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్–1872 స్థానంలో ఈ మూడు బిల్లులను తీసుకొచ్చారు. ‘ఈ బిల్లులు చట్ట రూపం దాల్చితే ఎఫ్ఐఆర్ నమోదు ప్రక్రియ మొదలుకొని తీర్పు వరకు అన్నీ ఆన్లైన్ అవుతాయి. దేశ విద్రోహ చట్టం రద్దయి పోయింది. రాజద్రోహాన్ని దేశద్రోహంగా మార్చారు. దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించే చర్యలకు కొత్త చట్టం ప్రకారం శిక్షలుంటాయి’అని అమిత్ షా వివరించారు. దేశంలోని అన్ని పోలీస్ స్టేషన్లు, కోర్టులు డిజిటైజ్ అవుతాయని చెప్పారు. వీటిల్లో చండీగఢ్ మొట్టమొదటగా డిజిటైజ్ అవుతుందన్నారు. బ్రిటిష్ పాలనలో గాంధీజీ, తిలక్, సావర్కర్ వంటి వారిని జైళ్లకు పంపిన నిబంధనలను తొలగించడం సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు. బిల్లుపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులు సభలో లేనప్పటికీ మంత్రి ఆ పార్టీపై విమర్శలు చేశారు. ఇటాలియన్ అద్దాలు ధరించిన వారు భారత పార్లమెంట్ కొత్త క్రిమినల్ చట్టాలను రూపొందించడాన్ని సగర్వంగా భావించరంటూ కాంగ్రెస్ నేత సోనియానుద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. -
యూఎస్ కాపిటల్ భవనంపై దాడి.. ట్రంప్‌పై 4 క్రిమినల్ కేసులు?
వాషింగ్టన్: గతేడాది అమెరికా కాపిటల్ భవనంపై జరిగిన దాడిని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెస్ కమిటీ యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర అభియోగాలు మోపింది. పార్లమెంట్ భవనంపై హింసకు ట్రంప్ బాధ్యుడని పేర్కొంటూ అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సోమవారం సిఫారుసు చేసింది. తిరుగుబాటు దారులకు సాయం చేయడం, పార్లమెంట్ కార్యాకలాపాలను అడ్డుకోవడం, యూఎస్ ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కుట్ర పన్నడం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి నాలుగు నేరారోపణలతో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేయాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్యానెల్ న్యాయశాఖను కోరింది. ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు మోపడానికి తమ విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయని నమ్ముతున్నట్లు ప్యానెల్ ప్రతినిధి జామీ రాస్కిన్ తెలిపారు. విచారణలో 1,000 కంటే ఎక్కువ సాక్షులను ఇంటర్వ్యూ చేసి, వేలాది డాక్యుమెంట్లను సేకరించిన తర్వాతే డెమెక్రాటిక్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ న్యాయశాఖకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం ఓ మాజీ అధ్యక్షుడిని కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. కాగా కమిటీ సిఫారసుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను మళ్లీ వైట్‌హౌస్‌కు పోటీ చేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తప్పుడు అభియోగాలు మోపినట్లు ఆరోపించారు. ఇక 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. నలుగురు కాపిటల్ పోలీసు అధికారులు మృతి చెందారు. -
ఇదేం పాడు బుద్ధి...పోలీసు అయ్యి ఉండి క్రిమినల్స్‌లా..
న్యూఢిల్లీ: పోలీసులే క్రిమనల్స్‌లా ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఈ ఘటన ఢిల్లీలోని షహదారాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....ఇద్దరు డిల్లీ పోలీసులు సేల్స్ ట్యాక్స్ ఏజెంట్‌ని శనివారం షహదారాలోని జీటీబీ ఎనక్లేవ్ వద్ద కిడ్నాప్ చేసి తప్పుడు కేసు పెడతామంటూ బెదిరింపులకు దిగారు. బాధితుడు తన కుటుంబంతో జీటీబీ ఎనక్లేవ్ వద్ద నివశిస్తున్నాడు. అతడు ఇన్‌కం ట్యాక్స్ డిపార్ట్‌మెట్‌లో సేల్స్ ట్యాక్స్ ఏజేంట్‌గా పనిచేస్తున్నడు. అక్టోబర్ 11న రాత్రి అతను తన కారులో ఇంటికి తిరిగి వస్తుండగా... షహదారాలోని ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చేటప్పటికీ ఒక తెల్లటి రంగులోని కారు తన కారుని ఓవర్‌టెక్ చేసుకుని ముందుకు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ముగ్గురు వ్యక్తులు దిగి సదరు ట్యాక్స్ ఏజెంట్‌ని చితకబాది, బలవంతంగా అతని కారులోని వెనుకసీటులో కూర్చొబెట్టారు. బాధితుడితో ఆ వ్యక్తులు తాము క్రైం బ్రాంచ్‌కి చెందిన వ్యక్తులమని చెప్పారు. ఒక వ్యక్తి తుపాకిని గుండెకి గురిపెట్టి బాధితుడి జేబులో ఉన్న రూ. 35 వేలు తీసుకున్నాడు. మరో వ్యక్తి సుమారు రూ. 5 లక్షలు ఇస్తే వదిలేస్తామని లేదంటే తప్పుడు కేసులు పెట్టి జైల్లోపెడతామంటూ బెదిరించారు. ఆ తర్వాత అతనిని షహదారాలోని స్పెషల్ స్టాఫ్ ఆఫీస్‌కి తీసుకువెళ్లారు. నిందితులు అక్కడ ఒక ఆఫీసర్‌తో మాట్లాడి తదనంతరం అతడిని మళ్లీ కారు వెనుక కూర్చొబెట్టి బాధితుడి ఇంటికి తీసుకువెళ్లారు. అక్కడ ఆ నిందితులు అతడ వద్ద నుంచి సుమారు రూ. 50 వేలు తీసుకున్నారని, పైగా అతను తన స్నేహితుడి నుంచి దాదాపు రూ. 70 వేలు అప్పుగా తీసుకుని నిందితుడు గౌరవ్ అలియాస్ అన్నా భార్య అకౌంట్‌కి ట్రాన్సఫర్ చేసినట్లు పోలీసులకు తెలిపాడు. ఆ తర్వాత తనను విడుదల చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు బాధితుడు పిర్యాదు మేరకు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. అంతేగాదు విచారణలో... ఢిల్లీలోని సీమపురీ పోలీస్‌స్టేషన్‌కి చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు సందీప్, రాబిన్ తోపాటు మరోవ్యక్తి వహీద్ని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అలాగే ఈ కేసుకి సంబంధించి మరో ఇద్దరు నిందితులు ఢిల్లీ పోలీసు అమిత్, సీమపురికి చెందిన గౌరవ్ అలియాస్ అన్నా అనే వ్యక్తులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఐతే విచారణలో.. కానిస్టేబుల్ అమిత్ ఈ కుట్రకు ప్లాన్ చేసినట్లు తెలిపారు. నిందితుడు వహిద్ కారుని ఉపయోగించి ఈ నేరానికి పాల్పడినట్లు చెప్పారు. గౌరవ్ కూడా ఈ నేరంలో పాలు పంచుకున్నట్లు వెల్లడించారు. ఇందులో ఓ సబ్ఇన్స్పెక్టర్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు బాధితుడి నుంచి సుమారు రూ.1.5 లక్షలు తీసుకున్నట్లు తేలింది. (చదవండి: ఇదేం విడ్డూరం...పెంపుడు కుక్కే యజమానులపై ఘోరంగా దాడి...) -
క్రిమినల్ ప్రొసీజర్ బిల్లుపై అనుమానాలొద్దు
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(గుర్తింపు)బిల్లులోని అంశాలతో పోలీసులు, దర్యాప్తు అధికారులు నేరగాళ్ల పనిపడతారని హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముసాయిదా చట్టంపై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ఆయన సోమవారం ప్రతిపక్ష నేతలకు సూచించారు. లోక్‌సభలో ఈ బిల్లుపై చర్చ సందర్భంగా మంత్రి ప్రతిపాదిత చట్టంతో డేటా దుర్వినియోగం అవుతుందన్న ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలపై స్పందించారు.‘ప్రపంచవ్యాప్తంగా ఇదే జరుగుతోంది. మనమూ అదే అనుసరిస్తున్నాం. గడిచిన రెండున్నరేళ్లుగా వాహనాల చోరీలు సహా పలు కేసులను పరిష్కరించేందుకు డేటా బేస్‌ను వాడుతున్నాం’అని తెలిపారు. అనంతరం బిల్లును సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
నిందితుడి పూర్వాపరాలు విచారించాకే బెయిల్
న్యూఢిల్లీ: నిందితుడికి బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయస్థానాలు అతడి పూర్వాపరాలను సమగ్రంగా విచారించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అతడి నేర చరిత్రను పరిశీలించాలని సూచించింది. ఒకవేళ బెయిల్ ఇస్తే బయటకు వెళ్లాక తీవ్రమైన నేరాలకు పాల్పడే అవకాశం ఉందా? అనేది తెలుసుకోవాలని పేర్కొంది. హత్య, సాక్ష్యాధారాలను మాయం చేయడం వంటి కేసుల్లో నిందితుడైన ఇందర్‌ప్రీత్ సింగ్‌కు పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాల ధర్మాసనం విచారణ చేపట్టింది. నిందితుడికి బెయిల్ ఇస్తూ పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. పూర్వాపరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతే బెయిల్‌పై నిర్ణయం తీసుకోవాలని కోర్టులకు సూచించింది. జరిగిన నేరం, లభించిన సాక్ష్యాధారాలు కూడా బెయిల్‌ను ప్రభావితం చేస్తాయని తెలిపింది. నేరం రుజువైతే విధించబోయే శిక్ష తీవ్రతను కూడా బెయిల్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. -
అసలు నేరస్తులు ఎవరు?
దిశను దారుణంగా హతమార్చిన దుర్మార్గులకు మరణ దండన విధించాలనేవారు కొందరయితే, వాళ్లను ఇంకా ఎందుకు బతకనిస్తున్నారు వెంటనే చంపేయండి, లేకపోతే మీకు తుపాకులెందుకు అని పోలీసులను రెచ్చ గొట్టేవారు ఇంకెందరో. ఫేస్బుక్, ట్విట్టర్లో అడ్డూ అదుపులేకుండా నోటికి వచ్చింది రాస్తున్నారు. మరణదండన వద్దనే వారిని తిడుతున్నారు. లైంగిక నేరాల బాధితులను వివరించే చిత్రాలను చూపవద్దని, వారి పేర్లు వెల్లడి చేయవద్దనే నియమాలను పట్టించుకోకుండా హతురాలి పేరు రాసి, ఫొటోలు వేసి నేరాలు చేసినవారు కోకొల్లలు. సభ్యత సంస్కారాలు కనీస జ్ఞానం కూడా లేకుండా చదువుకున్నవారు, రచయితలు, కవులు, ఫేస్బుక్ నీతివంతులు కూడా ఇష్టంవచ్చినట్టు అనవసరంగా ఈ నేరాలు చేస్తూ, రేప్ నేరగాళ్లను కఠినంగా శిక్షించాలని కోరే అర్హత ఉందా? చాటుమాటుగా సాగిన అత్యాచారాన్ని మాటలతో మళ్లీ చేయడంతో సమానం–బాధితురాలి వివరాలు ఫొటోలు ప్రచురించడం. నాలుగైదు రోజులపాటు మీడియాలో, సోషల్ మీడియాలో బాధితురాలి వివరాలను బాధ్యతారహితంగా వాడిన తరువాత పోలీసు ఉన్నతాధికారి సజ్జనార్ ఆమె పేరు దిశ అని మార్చి పుణ్యం కట్టుకున్నారు. రేప్ బాధితురాలు బతికి ఉంటే ఆమెను వైద్యంపేరుతో మెడికల్ రేప్‌నకు గురిచేస్తారు. పోలీసులు దర్యాప్తు రేప్‌నకు పాల్పడతారు. తరువాత కేసు విచారణ పేరుతో లాయర్లు లీగల్ రేప్‌తో బాధిస్తారు. ఇక సందర్భం వచ్చిన ప్రతిసారీ పత్రికల కలం వీరులు టీవీల కెమెరా వీరులు మీడియా రేప్ సాగిస్తూ ఉంటారు. సందర్భం ఉన్నా లేకపోయినా వారి వివరాలు రాస్తూ ఫేస్బుక్ వగైరాలలో మాటల అత్యాచారాలు నిర్వహించే నీతిమంతులకు లెక్కే లేదు. ఇటువంటి వాటికి అందరినీ జైళ్లలో పెట్టడం సాధ్యం కాదు. కానీ లైంగిక నేరాల బాధితులైన బాలికలు, మహిళల పేర్లు వెల్లడి చేస్తే రెండేళ్ల కఠిన లేదా సాధారణ కారాగార శిక్ష విధించాలని సెక్షన్ 228ఏ వివరిస్తున్నది. ఐపీసీ సెక్షన్లు 376, 376ఏ, 376బి, 376సి, 376డిలో లైంగిక నేరాల నిర్వచనాలు ఉన్నాయి, ఈ నేరాలలో బాధితురాలి పేరును ప్రచురించినా, లేదా మరేరకంగానైనా వెల్లడించినా (వచన కవితలతో సహా) రెండేళ్ల కఠిన లేదా సాధా రణ కారాగార శిక్షను, దాంతోపాటు జరిమానా కూడా విధించవచ్చు. పరిశోధనకు దర్యాప్తునకు అవ సరమనుకున్నపుడు పోలీసు అధికారి లిఖితపూ ర్వక అనుమతితో బాధితురాలి పేరును ప్రస్తావించ వచ్చు. లేదా బాధితురాలు లిఖితపూర్వక అనుమతితో ప్రచురించవచ్చు. బాధితురాలు జీవించి లేకపోతే లేదా మానసిక స్థిమితం లేకపోతే ఆమె దగ్గరి బంధువు లిఖిత పూర్వకంగా సంబంధిత సంక్షేమ సంస్థ అధ్యక్షుల ద్వారా అనుమతి ఇచ్చి ఉంటే ప్రచురించవచ్చు. కోర్టు వ్యవహారాలలో పేరు రాయడం తప్పనిసరి అనుకుంటే కోర్టు అనుమతితో ప్రచురించవచ్చు. ఈ సెక్షన్ కింద ఇచ్చిన ఒక వివరణలో, హైకోర్టు సుప్రీంకోర్టు తీర్పులో బాధితురాలిపేరు ప్రచురించడం నేరం కాదని పేర్కొన్నారు. అంటే సుప్రీం కోర్టు హైకోర్టు కాకుండా మరే కోర్టు తీర్పులోనైనా బాధితురాలి పేరు రాయడం నేరమే అవుతుందని చాలా స్పష్టం. క్రిమినాలజీ అని ఒక బోధనాంశం ఉంది. అందులో నేరాలు చేయడానికి సామాజిక కారణాలు ఏమిటి అని పరిశోధిస్తారు. బోధిస్తారు. చాలా కాలం కిందట అక్కినేని నాగేశ్వరరావు నిర్మించి నటించిన సుడిగుండాలు సినిమాలో కుటుంబంలో పరిస్థితులు, సమాజంలో బలహీనతలు, లోపాలు, పత్రికలు, డిటెక్టివ్ లేదా అశ్లీల నవలలు (ఆనాటి మీడియా) లో వచ్చిన రాతలు, నిరుద్యోగం వల్ల పనిలేని తనం, విచ్చల విడిగాపారే మద్యం, టోకు మద్యం దుకాణాలుగా మారిపోయి, ఆ సొమ్ముమీద బతికే అవినీతి ప్రభుత్వాలు ఏ విధంగా ఒక కౌమార వయస్కుడైన జులాయిని హత్యచేసే స్థాయికి దిగజార్చాయో వివరిస్తూ, అతని నేరానికి దోహదం చేసిన వారు నేరగాళ్లు కారా, అయితే ఎవరెవరిని, ఎందరిని, ఉరి తీయాలి? అని ప్రశ్నిస్తాడు కథానాయకుడు. దిశ విషయంలో కలం వీరులు బాధితురాలి ఫొటో చూపడానికి కారణాలేమిటి? ఈనేరానికి వేలాదిమందిని రెండేళ్ల పాటు జైళ్లలో పెట్టడానికి ముందుగా జైళ్లు కట్టాలి. కడదామా? తరువాత మేపడానికి తిండి ఏర్పాట్లు చేయాలి. చేద్దామా? వ్యాసకర్త మాడభూషి శ్రీధర్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్, madabhushi.sridhar@gmail.com. -
డిటో...
2009లో ఖాద్రీ... 2016లో అభయ్ కారణాలు వేరైనా ఒకే నేర విధానం రెండూ జరిగింది బుధవారమే దక్షిణ మండల పరిధిలోని శాలిబండ ప్రాంతంలో 2009లో జరిగిన ఖాద్రీ... పశ్చిమ మండల పరిధిలోని షాహినాయత్‌గంజ్ ఠాణా పరిధిలో బుధవారం చోటు చేసుకున్న అభయ్... ఈ రెండు ఉదంతాల మధ్య అనేక సారూప్యతలు ఉన్నాయి. వీరి అపహరణలు జరగడానికి కారణాలు వేరైనా... హత్యలు జరిగిన విధానం మాత్రం ఒక్కటే. ఈ కేసుల్లోనూ ముగ్గురేసి చొప్పునే నిందితులు ఉండగా... బుధవారమే కిడ్నాప్‌లు, అదే రోజు హత్యలు జరిగాయి. ఈ కేసుల్లో నిందితులు తప్పించుకునే ప్రయత్నాల్లో రాష్ట్రం దాటిన వారే. ఈ రెండు కిడ్నాప్, హత్యల మధ్య సారూప్యతలు ఇలా... - సాక్షి, సిటీబ్యూరో హతుడు ⇒ సయ్యద్ ఉస్మాన్ మహ్మద్ ఖాద్రి (10) నివాసం ⇒ పాతబస్తీలోని శాలిబండలో ఉన్న ఖాజీపుర జరిగింది: 20.05.2009 (బుధవారం) నిందితులు ⇒ వ్యాపార భాగస్వామి, బాలుడి తండ్రైన సయ్యద్ అబ్దుల్ ఖాదర్ ఖాద్రీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తనను మోసం చేస్తున్నాడని భావించిన అనీసుద్దీన్ కిడ్నాప్ ఇలా ఖాదర్ ఇంట్లో చనువు ఉన్న అనీస్... ఖాద్రీకి బైకు డ్రైవింగ్ నేర్పిస్తానని చెప్తూ వల్లో వేసుకున్నాడు. బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చిన బాలుడిని డ్రైవింగ్ నేర్పుతాన ంటూ తన పల్సర్ వాహనంపై ఎక్కించుకుని కిడ్నాప్ చేశాడు. హతమైందిలా శంషాబాద్ వైపు వెళ్లే మార్గంలో జతకట్టిన మిగిలిన ఇద్దరు నిందితులూ... ఖాద్రీని మారుతీ వ్యాన్‌లోకి మార్చారు. మార్గం మధ్యలో పోలీసుల చెక్‌పోస్ట్ ఉండటంతో వారి కంట పడకూడదని భావించారు. దీనికోసం అప్పటికే గొడవ చేస్తున్న ఖాద్రీని ఆ పాయింట్ దాటే వరకు నోరు మూసి వాహనం కిటికీల్లోంచి కనపడనంత కిందకు ఉంచాలని భావించిన నిందితులు... పొరపాటున నోరు కూడా మూసేయడంతో చనిపోయాడు. మృతదేహాన్ని ఏం చేశారంటే చెకింగ్ పాయింట్ దాటిన తర్వాత ఖాద్రీని గమనించిన నిందితులు అతడు చనిపోయినట్లు గుర్తించారు. దీంతో మృతదేహాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో షాద్‌నగర్ ప్రాంతంలో పూడ్చి పెట్టారు. చంపేశాక డిమాండ్లు కిడ్నాప్ చేసిన గంటలోపే బాలుడిని చంపేసిన దుండగులు ఆపై బోగస్ వివరాలతో తీసుకున్న సిమ్‌కార్డులు వినియోగించి అతడి తండ్రికి ఫోన్లు చేసి,ఎస్సెమ్మెస్‌లు ఇచ్చి డబ్బు డిమాండ్ చేశారు. చిక్కే ముందు హై‘డ్రామా’ పదో తరగతి మాత్రమే చదివిన అనీస్ నేరం చేశాక తెలివిగా వ్యవహరించాడు. అరెస్టుకు ముందు శాలిబండ పోలీసులు అదుపులోకి తీసుకునేసరికి... తనకు అనేక రుగ్మతలు ఉన్నాయని, ఇంటరాగేషన్ చేయకూడదంటూ నకిలీ పత్రాలు చూపించి బయటపడ్డాడు. వెంటనే తన తండ్రి సహాయంతో తానే కిడ్నాప్ అయినట్లు డ్రామా ఆడించాడు.హైదరాబాద్ నుంచి పరారైన నిందితులు మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్‌ల్లో తిరిగారు. ఎట్టకేలకు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చిక్కారు. హతుడు ⇒ అభయ్ మోదాని (15) నివాసం ⇒ షాహినాయత్‌గంజ్ పరిధిలోని జ్ఞాన్‌బాగ్‌కాలనీ జరిగింది: 16.03.2016 (బుధవారం) నిందితులు ⇒ ఇందుగుగమల్లి శేషుకుమార్ అలియాస్ సాయిరామ్, పొందర రవి, నంబూరి మోహన్ కారణం ⇒ సినిమాల్లో చేరేందుకు నటనా పాటవంతో పాటు డబ్బు కూడా అవసరమని భావించిన ముగ్గురు నిందితులు కిడ్నాప్ ఇలా అభయ్ ఇంటికి సమీపంలోని ఇంట్లో పని చేసిన సాయికి బాలుడితో చనువు ఉంది. టిఫిన్ తీసుకురావడానికి వచ్చిన అభయ్‌ను లిఫ్ట్ ఇవ్వమని కోరి అతడి వాహనం పైనే కిడ్నాప్ చేసి రూమ్‌కు తీసుకువెళ్లాడు. హతమైందిలా బాలుడిని హిందీనగర్‌లోని తమ ఇంటికి తీసుకువెళ్లిన తర్వాత కిడ్నాప్ చేస్తున్నట్లు చెప్పారు. దీంతో అతడు వద్దని చెప్పడంతో గలాభా చేస్తారని భయపడ్డారు. అలా కాకుండా ఉండాలని చేతులకు, నోటికి ప్లాస్టర్ వేయడానికి ఉపక్రమించారు. ఆ ప్లాస్టర్ పొరపాటున నోటితో పాటు ముక్కుకూ పడటంతో అభయ్ చనిపోయాడు. పది నిమిషాల తర్వాత నిందితులు ఈ విషయాన్ని గుర్తించారు. మృతదేహాన్ని ఏం చేశారంటే ఫ్రిజ్‌కు చెందిన అట్టపెట్టే, ప్లాస్టిక్ గన్నీ బ్యాగ్స్‌లో పార్శిల్ చేసి ఆటో ట్రాలీ, ప్యాసింజర్ ఆటోల్లో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు తీసుకువెళ్లారు. రైలులో వదిలేద్దామని భావించినా... సాధ్యంకాకపోవడంతో ఆల్ఫా హోటల్ వద్ద విడిచిపెట్టేశారు. చంపేశాక డిమాండ్లు కిడ్నాప్ జరిగిన గంటలోనే అనుకోకుండా హత్య జరగడంతో పారిపోయేందుకు సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ ఎక్కిన దుండగులు రైలు నుంచే బేరసారాలు మొదలెట్టారు. చిక్కే ముందు హై‘డ్రామా’ పదో తరగతి మాత్రమే చదివిన ప్రధాన నిందితుడు సాయి... పరారైన నాటి నుంచి మీడియాను గమనిస్తూ పోలీసుల కదలికలు తెలుసుకున్నాడు. ఎలాగైనా దొరికిపోతానని భావించి ఆత్మహత్యాయత్నం చేశాడు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు పారిపోయిన నిందితులు పొరుగున ఉన్న ఒడిశాలోకీ ఎంటర్ అయ్యారు. టాస్క్‌ఫోర్స్ బృందాలకే చిక్కారు.