వాషింగ్టన్: గతేడాది అమెరికా కాపిటల్ భవనంపై జరిగిన దాడిని దర్యాప్తు చేస్తున్న కాంగ్రెస్ కమిటీ యూఎస్ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై తీవ్ర అభియోగాలు మోపింది. పార్లమెంట్ భవనంపై హింసకు ట్రంప్ బాధ్యుడని పేర్కొంటూ అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సోమవారం సిఫారుసు చేసింది. తిరుగుబాటు దారులకు సాయం చేయడం, పార్లమెంట్ కార్యాకలాపాలను అడ్డుకోవడం, యూఎస్ ప్రభుత్వాన్ని మోసం చేసేందుకు కుట్ర పన్నడం, తప్పుడు ప్రకటనలు చేయడం వంటి నాలుగు నేరారోపణలతో ట్రంప్‌ను ప్రాసిక్యూట్ చేయాలని హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్యానెల్ న్యాయశాఖను కోరింది.
ట్రంప్‌పై క్రిమినల్ అభియోగాలు మోపడానికి తమ విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయని నమ్ముతున్నట్లు ప్యానెల్ ప్రతినిధి జామీ రాస్కిన్ తెలిపారు. విచారణలో 1,000 కంటే ఎక్కువ సాక్షులను ఇంటర్వ్యూ చేసి, వేలాది డాక్యుమెంట్లను సేకరించిన తర్వాతే డెమెక్రాటిక్ నేతృత్వంలోని సెలెక్ట్ కమిటీ న్యాయశాఖకు సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం ఓ మాజీ అధ్యక్షుడిని కాంగ్రెస్ కమిటీ సిఫార్సు చేయడం చరిత్రలో ఇదే తొలిసారి. ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో పోటీ చేయాలన్న ట్రంప్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి.
కాగా కమిటీ సిఫారసుపై ట్రంప్ తీవ్రంగా స్పందించారు. తనను మళ్లీ వైట్‌హౌస్‌కు పోటీ చేయకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే తప్పుడు అభియోగాలు మోపినట్లు ఆరోపించారు. ఇక 2021 జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. నలుగురు కాపిటల్ పోలీసు అధికారులు మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment