ఢిల్లీ: సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌కు మరోసారి హెచ్చరికలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్లు నిండడం గమనార్హం. అమెరికాలో భారత్ చేపట్టిన తన హత్య కుట్ర విఫలమైందని పేర్కొంటూ పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు.
'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్‌ను వీడియోలో పన్నూ ప్రదర్శించాడు. తనను చంపడానికి భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని పన్నూన్ పేర్కొన్నాడు. డిసెంబరు 13 లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తూ వీడియోను విడుదల చేశాడు.
ఈనెల 2 నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పన్నూ బెదిరింపులకు పాల్పడటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత వ్యతిరేక విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐకి చెందిన కే-2 (కశ్మీర్-ఖలిస్థాన్) విభాగం పన్నూకి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి.
అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఇటీవల పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాతో భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి.
ఇదీ చదవండి: పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం
Comments
Please login to add a commentAdd a comment