Threat to India
-
‘నవంబరు 1-19 వరకు ఎయిరిండియా విమానాల్లో ప్రయాణించొద్దు’
దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు. గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. -
Narendra Modi: బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు
జంషెడ్పూర్: జార్ఖండ్‌లో అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కూటమి ఓటుబ్యాంకు రాజకీయాలు చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. రాజకీయ లబ్ధి కోసం బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. వెల్లువలా వచి్చపడుతున్న బంగ్లాదేశీలు, రోహింగ్యాలతో జార్ఖండ్‌కు పెనుముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘అక్రమ వలసల వల్ల సంథాల్ పరగణాలు, కోల్హాన్ ప్రాంతాల్లో జనాభా స్థితిగతుల్లో వేగంగా మార్పులొస్తున్నాయి. స్థానికులు మైనారీ్టలుగా మారిపోయే ప్రమాదముంది. స్థానికేతరుల ఆధిపత్యం వల్ల గిరిజన జనాభా క్రమంగా తగ్గిపోతోంది. అక్రమ వలసదారులు పంచాయతీ వ్యవస్థపై పెత్తనం చెలాయిస్తున్నారు. భూములు కబ్జా చేస్తున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తమకు భద్రత లేదని జార్ఖండ్‌లో ప్రజలు భావిస్తున్నారు’’ అని అభిప్రాయపడ్డారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో ‘పరివర్తన్ మహార్యాలీ’లో మోదీ ప్రసంగించారు. విదేశాల నుంచి అక్రమంగా వలస వచి్చన వారికి జేఎంఎం అండగా నిలుస్తోందని మండిపడ్డారు. అధికార పార్టీపై అక్రమ వలసదారులు పట్టు బిగించారన్నారు. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లపై దర్యాప్తు కోసం స్వతంత్ర కమిటీ వేయాలని హైకోర్టు ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. జనమే బుద్ధి చెబుతారు జార్ఖండ్‌కు జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెసే అతిపెద్ద శత్రువులని మోదీ అన్నారు. అధికార దాహంతో అవి ఓటు బ్యాంకు రాజకీయాలనే నమ్ముకున్నాయని ఆక్షేపించారు. ‘‘గిరిజనుల ఓట్లతో అధికారం దక్కించుకున్న జేఎంఎం ఇప్పుడు వారికి అన్యాయం చేస్తున్న శక్తులతో చేతులు కలిపింది. రాజకీయ స్వార్థం కోసం దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలను బలి పెడుతోంది. గిరిజన సీఎం చంపయ్ సోరెన్‌ను అన్యాయంగా పదవి నుంచి తప్పించి ఘోరంగా అవమానించారు. జార్ఖండ్‌లో గిరిజనులకు జరుగుతున్న ద్రోహానికి ఇదో ఉదాహరణ అని తెలిపారు. సీఎం హేమంత్ సోరెన్ తన వదిన సీతా సోరెన్‌కే తగిన గౌరవమివ్వడం లేదు. జేఎంఎంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయం’’ అన్నారు. మతం పేరిట జేఎంఎం కూటమి ఓటు బ్యాంకును పెంచుకోజూస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి ముప్పు తప్పాలంటే బీజేపీని బలోపేతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జార్ఖండ్‌లో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తథ్యమని మోదీ ధీమా వ్యక్తంచేశారు. ఐదేళ్లపాటు జరిగిన అవినీతి అక్రమాలు, కుంభకోణాలపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో దేశాన్ని విచి్ఛన్నం చేసేందుకు విపక్షాలు పెద్ద కుట్ర పన్నాయని ఆరోపించారు. జార్ఖండ్ సంక్షేమానికి కేంద్రం ఎంతో చేసిందన్నారు. గిరిజన మహిళను రాష్ట్రపతిగా ఎన్నుకున్నామని గుర్తు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (పీఎంఏవై–జి) కింద జార్ఖండ్‌లో 32 వేల మంది లబ్ధిదారులకు ఈ సందర్భంగా మోదీ వర్చువల్‌గా అనుమతి పత్రాలు పంపిణీ చేశారు. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గృహాలు పొందిన మరో 46 వేల మందికి తాళాలు అందజేశారు. జార్ఖండ్‌లో రూ.660 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు.నేడే వందేమెట్రోకు పచ్చజెండారాంచీ: మెట్రో నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణాల కోసం దేశంలోనే తొలి వందే మెట్రో రైలు సేవలను మోదీ సోమవారం ప్రారంభించనున్నారు. ఇది గుజరా త్‌లోని భుజ్ నుంచి అహ్మదాబాద్‌కు 359 కి.మీ. దూరాన్ని కేవలం 5.45 గంటల్లో చేరనుంది. ఆరు వందే భారత్ రైళ్లను మోదీ ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఇవి టాటానగర్–పట్నా, బ్రహ్మపూర్–టాటానగర్, రుర్కెలా–హౌరా, దేవ్‌గఢ్–వారణాసి, భాగల్పూర్–హౌరా, గయా–హౌరా మార్గాల్లో ప్రయాణిస్తాయి. -
అదే రోజున పార్లమెంట్‌పై దాడి..! భారత్‌కు పన్నూ బెదిరింపులు
ఢిల్లీ: సిక్స్ ఫర్ జస్టిస్ ఉగ్రసంస్థ చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూ భారత్‌కు మరోసారి హెచ్చరికలు చేశాడు. డిసెంబర్ 13 లేదా అంతకంటే ముందే భారత పార్లమెంటుపై దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్ర దాడి జరిగి 22 ఏళ్లు నిండడం గమనార్హం. అమెరికాలో భారత్ చేపట్టిన తన హత్య కుట్ర విఫలమైందని పేర్కొంటూ పన్నూ ఓ వీడియోను విడుదల చేశాడు. 'ఢిల్లీ బనేగా ఖలిస్తాన్' (ఢిల్లీ ఖలిస్తాన్‌గా మారుతుంది) అనే శీర్షికతో 2001 పార్లమెంటు దాడి దోషి అఫ్జల్ గురు పోస్టర్‌ను వీడియోలో పన్నూ ప్రదర్శించాడు. తనను చంపడానికి భారత ఏజెన్సీలు చేసిన కుట్ర విఫలమైందని పన్నూన్ పేర్కొన్నాడు. డిసెంబరు 13 లేదా అంతకంటే ముందు పార్లమెంటుపై దాడి చేసి ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తూ వీడియోను విడుదల చేశాడు. ఈనెల 2 నుంచి డిసెంబర్ 22 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పన్నూ బెదిరింపులకు పాల్పడటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. భారత వ్యతిరేక విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి చెందిన కే-2 (కశ్మీర్-ఖలిస్థాన్) విభాగం పన్నూకి ఆదేశాలు ఇచ్చినట్లు భారత నిఘా సంస్థలు గుర్తించాయి. అమెరికన్-కెనడియన్ పౌరుడు, సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూపై హత్యకు కుట్ర జరిగిందని అమెరికా న్యాయ శాఖ ఇటీవల పేర్కొంది. భారతీయ పౌరుడు నిఖిల్ గుప్తా ఈ కుట్రకు బాధ్యుడంటూ కేసు నమోదు చేసినట్లు యుఎస్ అటార్నీ ఒక ప్రకటనలో తెలియజేసింది. నికిల్ గుప్తాతో భారతీయ ఏజెన్సీకి చెందిన ఉద్యోగితో సంబంధం ఉన్నట్లు పేర్కొంది. పన్నూను హత్య చేయడానికి గుప్తాను కిరాయికి మాట్లాడుకున్నట్లు అమెరికా నిఘా వర్గాలు ఆరోపించాయి. ఇదీ చదవండి: పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్సైట్లపై కేంద్రం నిషేధం -
తవాంగ్ ఘర్షణ: ఎటునుం‘చైనా’.. హెచ్చరిస్తున్న ఛాయా చిత్రాలు..
కయ్యాలమారి చైనా దుందుడుకుగా వ్యవహరిస్తూ ఈశాన్య రాష్ట్రాలపై గురి పెట్టింది. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్‌లో ఇటీవల ఘర్షణల అనంతరం టిబెట్‌లోని వైమానిక స్థావరాల్లో భారీ సంఖ్యలో డ్రోన్లు, యుద్ధ విమానాలను మోహరించి మనపై కయ్యానికి కాలు దువ్వే ప్రయత్నాలు చేసింది. మల్టీ నేషనల్ ఐటీ కంపెనీ మక్సర్ తీసిన హై రిజల్యూషన్ ఉప గ్రహ ఛాయాచిత్రాల ద్వారా ఈ విషయం తేటతెల్లమైంది. మన వైమానిక దళం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ చైనా కవ్వింపు చర్యల్ని దీటుగా ఎదుర్కొంది. గగనతలంలో నిరంతరం యుద్ధ విమానాలతో గస్తీ నిర్వహిస్తూ డ్రాగన్ దేశం కార్యకలాపాలను గట్టిగా అడ్డుకుంటామని చాటి చెప్పింది. భవిష్యత్‌లో చైనా నుంచి ఎటు నుంచైనా ముప్పు పొంచి ఉందని ఈ ఛాయా చిత్రాలు హెచ్చరిస్తున్నాయి. బాంగ్డా వైమానిక కేంద్రం డబ్ల్యూజెడ్–7 ‘‘సోరింగ్ డ్రాగన్’’ డ్రోన్, ఈ డ్రోన్‌ని గత ఏడాది చైనా అధికారికంగా వైమానిక దళంలోకి ప్రవేశపెట్టింది. 10 గంటల సేపు నిరంతరాయంగా ప్రయాణించగలదు. నిఘా వ్యవస్థకు ఈ డ్రోన్ పెట్టింది పేరు. భారత్‌లో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించడానికి క్రూయిజ్ క్షిపణులు పని చేసేలా డేటాను ప్రసారం చేసే సామర్థ్యం కూడా ఈ డ్రోన్ కలిగి ఉంది. ఈ తరహా డ్రోన్లు భారత్ వద్ద లేవు. ఇక డిసెంబర్ 14నాటి ఉపగ్రహ ఛాయా చిత్రాల్లో బాంగ్డాలో ఫ్లాంకర్ టైప్ యుద్ధ విమానాలు రెండు మోహరించి ఉన్నాయి. ఈ యుద్ధ విమానాలు భారత్ దగ్గర ఉన్న ఎస్‌యూ–30ఎంకేఐ మాదిరిగా పని చేస్తాయి. లాసా వైమానిక కేంద్రం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకి 260 కి.మీ. దూరం నాలుగు జే–10 యుద్ధవిమానాలను సిద్ధంగా ఉంచింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీలో ఈ యుద్ధ విమానాలు అత్యంత విశ్వసనీయమైనవిగా గుర్తింపు పొందాయి. 1988 నుంచి వీటిని వాడుతున్న చైనా ఆర్మీకి ఈ యుద్ధ విమానాలు బాక్ బోన్ అని చెప్పొచ్చు. ఇక లాసాలో మౌలిక సదుపాయాల కల్పనకి సంబంధించిన పనులు కూడా యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తోంది. రెండో రన్‌వే నిర్మాణం శరవేగంగా సాగుతోంది. షిగాట్సే వైమానిక కేంద్రం సిక్కిం సరిహద్దుకి 150కి.మీ. దూరం ఇక్కడ చైనా అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ (యూఏవీ)లను మోహరించింది. టిబెట్‌లో మొత్తం రక్షణ వ్యవస్థనే ఆధునీకరిస్తోంది. ఆధునిక యుద్ధ విమానాలైన జే–10సీ, జే–11డీ, జే–15 విమానాలు కూడా మోహరించి ఉన్నాయి. ఇవన్నీ గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ వినియోగించే జెట్స్‌ను అడ్డుకునే అవకాశాలున్నాయి. బలం పెంచుకుంటున్న ఇరుపక్షాలు 2017లో డోక్లాం సంక్షోభం తర్వాత భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఆయుధాలపరంగా, సదుపాయాలపరంగా బలం పెంచుకుంటున్నాయి. వివాదాస్పద జోన్లలో భారత్ సైన్యం కదలికల్ని అనుక్షణం అంచనా వేయడానికి చైనా వైమానిక సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోతోంది. సరిహద్దుల్లో చైనా మోహరిస్తున్న ఆధునిక యుద్ధ విమానాలు, ఇతర కొత్త ప్రాజెక్టులు, నిర్మాణాలు డ్రాగన్ బలాన్ని విపరీతంగా పెంచేస్తున్నాయని టిబెట్ ప్రాంతంలో ఆ దేశ మిలటరీ కార్యకలాపాలను నిరంతరం ట్రాక్ చేసే మిలటరీ అనలిస్ట్ సిమ్ టాక్ అభిప్రాయపడ్డారు. టిబెట్, తూర్పు లద్దాఖ్ మీదుగా చైనా బలగాలను అనుసంధానం చేయడానికి కొత్త మార్గాలను నిర్మించే పనిలో డ్రాగన్ దేశం ఉందని చెప్పారు. అస్సాం, బెంగాల్లో మైదాన ప్రాంతాలైన తేజ్‌పూర్, మిసామరి, జోర్హాట్, హషిమారా, బాగ్డోగ్రాలో దశాబ్దాలుగా భారతీయ యుద్ధ విమానాల నిర్వహణ మన దేశానికి ఎంతో కలిసొస్తోంది. కొండ ప్రాంతాల్లోని టిబెట్ వైమానిక స్థావరాల నిర్వహణలో చైనాకు యుద్ధ విమానాల బరువుపై పరిమితులున్నాయి. మనకది లేకపోవడం కలిసొచ్చే అంశమని విశ్లేషకులు అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
సైబర్ నేరాలు.. ఏటా రూ.10 లక్షల కోట్ల భారం !
న్యూఢిల్లీ: సైబర్ నేరాలనేవి డిజిటలీకరణకు అతి పెద్ద ముప్పుగా పరిణమిస్తున్నాయి. వీటి వల్ల 2025 నాటి కల్లా ఎకానమీలపై ఏటా 10 లక్షల కోట్ల మేర భారం పడనుందని అంచనాలు నెలకొన్నాయి. ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇండియా ప్రెసిడెంట్ అనంత్ మహేశ్వరి ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. సైబర్ నేరాల వల్ల ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలపై ఏటా 6 లక్షల కోట్ల డాలర్ల మేర భారం పడుతోందని, 2025 నాటికి ఇది దాదాపు 10 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయని ఆయన వివరించారు. వ్యాపారంలో టెక్నాలజీ వినియోగ తీవ్రతను బట్టే ప్రతి కంపెనీ వృద్ధి ఆధారపడి ఉంటోందని మహేశ్వరి తెలిపారు. పరిశ్రమ వృద్ధి చెందే కొద్దీ, కంపెనీలు సైబర్ సెక్యూరిటీపైనా, విశ్వసనీయ టెక్నాలజీపైనా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. డిజిటల్‌కు మారే క్రమంలో భారత్ .. క్లౌడ్ సాంకేతికతకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. -
భారత్ భద్రతకు చైనా నుంచి అతిపెద్ద ముప్పు
న్యూఢిల్లీ: భారత్ భద్రతకు డ్రాగన్ దేశం చైనా నుంచి అతిపెద్ద ముప్పు పొంచి ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎఫ్) బిపిన్ రావత్ ఉద్ఘాటించారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం గత ఏడాది తరలించిన వేలాది మంది సైనికులను, ఆయుధాలను ఇప్పుడే వెనక్కి తీసుకొచ్చే అవకాశం లేదని తెలిపారు. సమీప భవిష్యత్తులోనూ అది సాధ్యం కాదని అన్నారు. భారత్–చైనా మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం లభించడం లేదని, ఇరు దేశాల మధ్య విశ్వాసం కొరవడడం, అనుమానాలు పొడసూపుతుండడమే ఇందుకు కారణమని వివరించారు. సరిహద్దులో గానీ, సముద్రంలో గానీ ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా ధీటుగా బదులు చెప్పేందుకు భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని బిపిన్ రావత్ స్పష్టం చేశారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ పాలన పునఃప్రారంభం కావడం భారత్ భద్రతకు ప్రమాదకరమైన పరిణామమేనని వివరించారు. అఫ్గానిస్తాన్ నుంచి అందే ఆయుధాలతో జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు బలం పుంజుకొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ఏడాది జూన్‌లో వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద ఇరు దేశాల సైన్యం మధ్య భీకర ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఇరు పక్షాలు పదుల సంఖ్యలో ప్రాణనష్టాన్ని ఎదుర్కొన్నాయి. సరిహద్దుకు భారత్, చైనా భారీగా సైన్యాన్ని, ఆయుధాలను తరలించాయి. సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి ఆరు పక్షాల మధ్య ఇప్పటిదాకా 13 దఫాలు చర్చలు జరిగాయి. అయినప్పటికీ పరిస్థితిలో మాత్రం మార్పు రాలేదు. ఇరు దేశాలు ఎల్ఏసీ వద్ద పెద్ద సంఖ్యలో సైన్యాన్ని మోహరించాయి. సరిహద్దు వెంట తమ భూభాగాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటున్నాయి. -
చైనా ముప్పును ఎదుర్కొందాం
వాషింగ్టన్: ఇండియా, మలేసియా, ఇండోనేíసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ సేనలను పంపించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. గురువారం జర్మన్ మార్షల్ ఫండ్‌కు చెందిన బ్రసెల్స్ ఫోరమ్–2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియాలో పలు దేశాలకు ముప్పుగా పరిణమించిన పీఎల్ఏకు దీటైన సమాధానం చెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు. క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి తాము సరైన రీతిలోనే స్పందిస్తామని వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరులను ఉపయోగిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకత్వంలో తమ వ్యూహం ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో తమ సైనిక బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి తరలించే తమ బలగాలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. ఇండియా, వియత్నాం, మలే సియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా సముద్రంలో తమ సేనల అవసరం ఉందన్నారు. మనమంతా కలిసికట్టుగా పని చేయాలి శత్రువు విసురుతున్న సవాళ్ల నుంచి మన స్వేచ్ఛాయుత సమాజాలను, మన శ్రేయస్సు, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు. అదంత సులభం కానప్పటికీ మన కృషిని కొనసాగించాలని అన్నారు. చైనా వల్ల ప్రయోజనాలు పొందుతున్న వ్యాపార వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ, నియంతృత్వం మధ్య ఎప్పుడూ రాజీ కుదరదని స్పష్టం చేశారు. చైనా ఇతర దేశాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మన భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ చైనా సముద్రంలో, ఇండియాతో సరిహద్దు విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు. చైనాపై ఇండియన్ అమెరికన్ల నిరసన తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులు తిష్టవేయడాన్ని నిరసిస్తూ షికాగోలోని చైనా కాన్సులేట్ వద్ద పలువురు ఇండియన్ అమెరికన్లు చైనా వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేపట్టారు. చైనా దుందుడుకు చర్యలపై తాము మౌనంగా ఉండబోమని వారు స్పష్టం చేశారు. అలా చేస్తే పర్యవసానాలు తీవ్రం సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చే ప్రయత్నాలు చేయవద్దు చైనాకు భారత్ హెచ్చరిక బీజింగ్: సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే పరిణామాలు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ చైనాను ఘాటుగా హెచ్చరించింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలగడమే కాకుండా, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లో కార్యకలాపాలను నిలిపేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలతో ఆ దేశంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా ఉండాలంటే.. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అత్యంతావశ్యకమన్న విషయం చైనా గుర్తించాలని మిస్త్రీ హితవు పలికారు. గల్వాన్ లోయ తమదేనని చైనా పదేపదే చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వాస్తవాధీన రేఖపై భారత్‌కు పూర్తిగా అవగాహన ఉందని, ఎల్ఏసీకి ఇటువైపు, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చాన్నాళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని గుర్తు చేశారు. జూన్ 15 నాటి ఘర్షణకు కారణం భారత సైనికులేనన్న చైనా వాదనను విక్రమ్ మిస్త్రీ తోసిపుచ్చారు. ‘ఏప్రిల్, మే నెలల్లో గల్వాన్ లోయలో చైనా కార్యకలాపాలు పెరిగాయి. భారత పెట్రోలింగ్‌ను పదేపదే అడ్డుకున్నారు. అందుకే ఘర్షణలు చోటు చేసుకున్నాయి’ అని స్పష్టం చేశారు. రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ భేటీ న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ పరిస్థితిని, భారత సైన్యం సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. జూన్ 23, 24 తేదీల్లో జనరల్ నరవణె లద్దాఖ్‌లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్ కూడా 22 నుంచి 24 వరకు రష్యాలో పర్యటించి వచ్చారు. సరిహద్దుల రక్షణ బాధ్యత సర్కారుదే: సోనియా న్యూఢిల్లీ: భారత సరిహద్దులను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. లడ్దాఖ్ పరిస్థితుల విషయంలో దేశప్రజల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని లడ్దాఖ్లో ప్రాణత్యాగాలు చేసిన సైనిక అమరవీరుల స్మారకార్థం కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’కార్యక్రమంలో సోనియా వీడియో సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీ చెప్పినట్టు భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని రాకపోతే, 20 మంది భారత సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని ప్రశ్నించారు. మన సైన్యానికి సంపూర్ణ సహకారాన్ని, శక్తిని అందించడమే నిజమైన దేశభక్తి అవుతుందని సోనియా అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని చెప్పడం పొరుగు దేశానికి మేలు చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన వీడియో సందేశంలో ఆయన..తూర్పు లడ్దాఖ్లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఉపగ్రహ చిత్రాలు, రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. -
భారత్‌కు అంతర్జాతీయ పరిణామాల ముప్పు’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత్‌పై క్రమంగా పెరుగుతోందని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ వై.వి.రెడ్డి అన్నారు. అలాగే అంతర్జాతీయ పరిణామాలకు భారత్ కూడా కారణం అవుతోందని చెప్పారు. ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీస్ ఇన్ కాంప్లెక్స్ చాయిసెస్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన రెండు రోజుల సదస్సులో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. ‘చైనా, ఇరాన్, మధ్యప్రాచ్య దేశాల్లో ప్రస్తుతం తలెత్తిన పరిస్థితుల ప్రభావం చమురు లభ్యత, నిధుల ప్రవాహానికి అవరోధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు భారత్‌కు స్వల్ప కాలానికి హాని కలుగజేసే సమస్యలే. అంతర్జాతీయ వ్యాపారంపై చైనా ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై యూఎస్ఏ ఆధిపత్యం ఉంది. ఇది కూడా అంతర్జాతీయ సంఘర్షణకు ఒక కారణం. ఇరు దేశాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ రెండు దేశాల దయాదాక్షిణ్యాలపై ప్రపంచం నడుస్తోంది. యూఎస్‌లో వినియోగం కోసం ఉన్న యూఎస్ డాలర్‌ను అంతర్జాతీయ కరెన్సీగా వాడుతున్నాం’ అని వ్యాఖ్యానించారు. -
వాతావరణమే.. విలన్
పారిస్: వాతావరణంలో వస్తున్న పెనుమార్పులు ప్రపంచవ్యాప్తంగా పసిమొగ్గల జీవితాన్ని ఛిద్రం చేస్తున్నాయని లాన్సెట్ నివేదిక హెచ్చరించింది. శిలాజ ఇంధన ఉద్గారాలను కట్టడి చేయకపోతే భారత్ ఒకతరం ఆరోగ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తేల్చింది. భారత్‌లో దీని ప్రభావం అత్యధికంగా కనబడుతోందని వెల్లడించింది. గత 50 ఏళ్లుగా చిన్నారుల ఆరోగ్యానికి భారత్ ఎంతో కృషి చేసిందని, కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటివరకు చేసినదంతా వృథా కానుందని అంచనా వేసింది. ఇవాళ పుట్టిన ప్రతీ బిడ్డ భవిష్యత్‌ను వాతావరణంలో మార్పులే నిర్దేశిస్తాయని నివేదిక సహ రచయిత్రి పూర్ణిమ చెప్పారు. లాన్సెట్ కౌంట్‌డౌన్ ఆన్ హెల్త్, క్లైమేట్ ఛేంజ్ కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంకు సహా మరో 35 సంస్థలకు చెందిన 120 మంది పర్యావరణ నిపుణులు అధ్యయనం చేశారు. వాతావరణంలో మార్పులు, ప్రభావానికి సంబంధించి 41 అంశాలను అధ్యయనం చేసి నివేదిక రూపొందించారు. ఆరోగ్యంపై ప్రభావం చూపించే అంశాలు ► కరువు పరిస్థితులు ► అంటు వ్యాధులు ► వరదలు ► వడగాడ్పులు ► కార్చిచ్చులు ఏయే వ్యాధులు వచ్చే అవకాశం ► నీటి కాలుష్యంతో డయేరియా ► వాయు కాలుష్యంతో ఆస్తమా, ఇతర శ్వాసకోశ వ్యాధులు ► చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ► డెంగీ వ్యాధి విజృంభణ ► గుండెపోటు ఏయే దేశాలపై ప్రభావం ► అత్యధిక జనాభా కలిగిన దేశాలు, వైద్య ఖర్చులు పెనుభారంగా మారిన దేశాలు, అసమానతలు, పేదరికం, పౌష్టికాహార లోపాలు కలిగిన భారత్ వంటి దేశాలపై వాతావరణంలో వస్తున్న మార్పులు పసివాళ్ల ఉసురు తీస్తున్నాయి. ► భారత్‌లో 2.1 కోట్ల మందిపై వాతావరణ మార్పుల ప్రభావం ► చైనాలో 1.7 కోట్ల మందికి ఆరోగ్య సమస్యలు ► 196 దేశాలకు గాను 152 దేశాలపై వాతావరణంలో మార్పులు అత్యధిక ప్రభావాన్ని చూపిస్తాయి. ► 2015లో భారత్‌లో వీచిన వడగాడ్పులతో వేలాది మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఇకపై సర్వసాధారణం కానున్నాయి. పరిష్కార మార్గాలేంటి ? ► ప్రతీ ఏడాది ప్రపంచ దేశాలు సగటున 7.4 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తే 2050 నాటికి 1.5 డిగ్రీల ఉష్ణోగ్రతకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని చేరుకోగలరు ► భారత్ థర్మల్ విద్యుత్ వినియోగాన్ని తగ్గించి సంప్రదాయేతర ఇంధనంపైనే ఆధారపడాలి. ► ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలి ► చెత్త, పంట వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా ఎదుర్కోవాలి. -
భారత్‌లో ఐఎస్ఐఎస్ ముప్పు!
న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థపై ఫ్రాన్స్ ప్రకటించిన యుద్ధానికి భారత్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నుంచి దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పారిస్ స్థాయి నగరంలోనే అసాధారణస్థాయి దాడులతో ఇస్లామిక్ స్టేట్ విరుచుకుపడిన నేపథ్యంలో దాని నుంచి పొంచి ఉన్న ముప్పును మరోసారి సమీక్షించాలని భారత భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పారిస్ దాడుల అనంతరం ఐఎస్ఐఎస్ నుంచి పొంచి ముప్పును హైలెవల్‌గా భావిస్తున్నామని, అదేవిధంగా దేశంలో దాని కార్యకలాపాలను నిరోధించేందుకు కౌంటర్ వ్యూహాన్ని తీసుకురావావాలని అనుకుంటున్నామని నిఘా వర్గాలు తెలిపాయి. యూరప్‌లోనే అత్యంత కీలకమైన నగరం, అత్యంత భద్రత ఉండే ప్రదేశమైన పారిస్‌లోనే భారీ దాడులు నిర్వహించడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బలం, ఆత్మవిశ్వాసం పుంజుకునే అవకాశముందని, ఈ నేపథ్యంలో సహజంగానే మరిన్ని భారీ దాడులకు పాల్పడేందుకు అది ప్రయత్నిస్తుందని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఏ నగరాన్నైనా ఐఎస్ఐఎస్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకోగలదని, ఈ నేపథ్యంలో ముందుగానే ఈ ముప్పు గుర్తించి దానికి అనుగుణమైన భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు. ఐఎస్ఐఎస్ను ఎదుర్కోవడంలో ఫ్రాన్స్‌కు పూర్తి సహకారమందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఐఎస్ఐఎస్పై పోరులో ఫ్రాన్స్‌కు భారత్ ఏ తరహా సాయం అందిస్తుందనే దానిపై ఇంకా ఒక స్పష్టత రాలేదని అధికార వర్గాలు తెలిపాయి. -
ముప్పును ఎదుర్కొంటాం
భారత్‌కు సత్తా ఉందన్న వైమానిక దళం చీఫ్ అరూప్ రాహా న్యూఢిల్లీ: అల్‌కాయిదా వంటి ఉగ్రవాద గ్రూపుల నుంచి భారత్‌కు ముప్పు ఉన్నప్పటికీ వాటిని ఎదుర్కొనే సత్తా దేశానికి ఉందని వైమానిక దళం చీఫ్ అరూప్ రాహా వ్యాఖ్యానించారు. ఉపఖండంలో కార్యకలాపాల విస్తరణే లక్ష్యంగా అల్‌కాయిదా ఇక్కడ తన ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు వచ్చిన కథనాలపై ఆయన స్పందించారు. ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉన్నా.. దాన్ని ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. ‘1965లో పాక్‌తో యుద్ధంలో భారత వైమానిక దళం పాత్ర’ అనే అంశంపై శుక్రవారం జరిగిన సదస్సులో అరూప్ రాహా మాట్లాడారు. తీవ్రంగా పరిగణించాల్సిందే: భారత ఉపఖండంలో జిహాద్ కోసం ‘ఖైదత్ అల్ జిహాద్’ పేరుతో అల్‌కాయిదా ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడాన్ని భారత్ తీవ్రంగా పరిగణించాలని అమెరికా భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీపై ఇస్లాంకు శత్రువుగా ముద్ర వేయాలని అల్‌కాయిదా కోరుకుంటోందని వారు చెబుతున్నారు. పాకిస్థాన్ తో మకాం వేసి లష్కరే తోయిబా అండతో భారత్‌కు అది పెద్ద ముప్పుగా పరిణమించే ప్రమాదముందని అమెరికా నిఘా సంస్థ సీఐఏ మాజీ విశ్లేషకుడు బ్రూస్ రీడెల్ హెచ్చరించారు. అయితే అమెరికా మాత్రం ఈ విషయానికి అంతగా ప్రాముఖ్యతనివ్వలేదు. మరోవైపు తాజా పరిణామంపై బంగ్లాదేశ్ కూడా అప్రమత్తమైంది.