దేశంలో విమానలకు గత కొన్ని రోజులుగా వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాల వేళ ఖలిస్థానీ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నూ.. విమానాలకు సంబంధి హెచ్చరికలు చేయడం తీవ్ర కలకలం రేపింది. నవంబరు 1 నుంచి 19 వరకు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దని గురుపత్వంత్ సింగ్ ప్రయాణికులను హెచ్చరించాడు.
భారత్‌లో సిక్కు వ్యతిరేక అల్లర్లు జరిగి 40 ఏళ్లు కావొస్తున్న సందర్భంగా ఎయిర్ ఇండియా విమానాలపై దాడి జరిగే అవకాశం ఉందని, కావును ఆయా తేదీల్లో ఆ సంస్థ విమానాల్లో ప్రయాణించొద్దంటూ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నాడు. కాగా సిక్కుల ఫర్ జస్టిస్ (ఎస్‌జేఎఫ్) వ్యవస్థాపకుడైన పన్నూ ఇలాంటి హెచ్చరికలు చేయడం ఇది మొదటి సారి కాదు.
గతేడాది కూడా నవంబర్ నెలలోనే ఇలాంటి బెదిరింపులే చేశాడు. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో సిక్కులు ప్రయాణించొద్దని సూచించాడు. లేని పక్షంలో మీ ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించాడు. ‘నవంబర్ 19న ఎయిర్ ఇండియాలో ప్రయాణించవద్దని సిక్కు ప్రజలను కోరుతున్నాం. ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ఎయిర్ ఇండియాను దిగ్బంధిస్తాం. నవంబర్ 19న ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించవద్దు. లేదంటే మీ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది’ అని పేర్కొన్నాడు.
అంతేగాక నవంబరు 19న దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఆ రోజు మూతపడుతుందని, దాని పేరు కూడా మార్చేస్తామని గతేడాది అతడు ఓ వీడియోలో హెచ్చరించాడు. చట్టవ్యతిరేక కార్యకలాపాల చట్టం (ఉపా) కింద భారత ప్రభుత్వం పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇతడికి కెనడాతోపాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment