వాషింగ్టన్: ఇండియా, మలేసియా, ఇండోనేíసియా, ఫిలిప్పైన్స్ తదితర దేశాలకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్‌ఏ) నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్ పాంపియో చెప్పారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి ఆయా దేశాలకు మద్దతుగా తమ సేనలను పంపించే విషయం ఆలోచిస్తున్నామని తెలిపారు. గురువారం జర్మన్ మార్షల్ ఫండ్‌కు చెందిన బ్రసెల్స్ ఫోరమ్–2020 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆసియాలో పలు దేశాలకు ముప్పుగా పరిణమించిన పీఎల్‌ఏకు దీటైన సమాధానం చెప్పాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.
క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను బట్టి తాము సరైన రీతిలోనే స్పందిస్తామని వ్యాఖ్యానించారు. సవాళ్లను ఎదుర్కొనేందుకు వనరులను ఉపయోగిస్తామని చెప్పారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మార్గదర్శకత్వంలో తమ వ్యూహం ఉంటుందని, అందులో భాగంగానే జర్మనీలో తమ సైనిక బలగాలను 52,000 నుంచి 25,000కు తగ్గిస్తున్నట్లు తెలిపారు. జర్మనీ నుంచి తరలించే తమ బలగాలను నిర్దేశిత ప్రాంతాల్లో మోహరిస్తామన్నారు. ఇండియా, వియత్నాం, మలే సియా, ఇండోనేసియా, ఫిలిప్పైన్స్, దక్షిణ చైనా సముద్రంలో తమ సేనల అవసరం ఉందన్నారు.
మనమంతా కలిసికట్టుగా పని చేయాలి
శత్రువు విసురుతున్న సవాళ్ల నుంచి మన స్వేచ్ఛాయుత సమాజాలను, మన శ్రేయస్సు, మన భవిష్యత్తును కాపాడుకోవడానికి మనమంతా కలిసికట్టుగా పని చేయాలని మైక్ పాంపియో పిలుపునిచ్చారు. అదంత సులభం కానప్పటికీ మన కృషిని కొనసాగించాలని అన్నారు. చైనా వల్ల ప్రయోజనాలు పొందుతున్న వ్యాపార వర్గాలు భిన్నమైన వాదన వినిపిస్తున్నాయని గుర్తుచేశారు. స్వేచ్ఛ, నియంతృత్వం మధ్య ఎప్పుడూ రాజీ కుదరదని స్పష్టం చేశారు. చైనా ఇతర దేశాలను రెచ్చగొడుతోందని ఆరోపించారు. మన భవిష్యత్తును చైనా కమ్యూనిస్టు పార్టీ నిర్దేశించడం ఏమిటని ప్రశ్నించారు. దక్షిణ చైనా సముద్రంలో, ఇండియాతో సరిహద్దు విషయంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని తప్పుపట్టారు.
చైనాపై ఇండియన్ అమెరికన్ల నిరసన
తూర్పు లద్దాఖ్‌లో చైనా సైనికులు తిష్టవేయడాన్ని నిరసిస్తూ షికాగోలోని చైనా కాన్సులేట్ వద్ద పలువురు ఇండియన్ అమెరికన్లు చైనా వ్యతిరేక నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు చేతబూని ప్రదర్శన చేపట్టారు. చైనా దుందుడుకు చర్యలపై తాము మౌనంగా ఉండబోమని వారు స్పష్టం చేశారు.
అలా చేస్తే పర్యవసానాలు తీవ్రం
సరిహద్దుల్లో యధాతథ స్థితిని
మార్చే ప్రయత్నాలు చేయవద్దు
చైనాకు భారత్ హెచ్చరిక
బీజింగ్: సరిహద్దుల్లో యధాతథ స్థితిని మార్చాలని ప్రయత్నిస్తే పరిణామాలు, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని భారత్ చైనాను ఘాటుగా హెచ్చరించింది. అలాంటి ప్రయత్నాలు చేస్తే సరిహద్దుల్లో శాంతికి విఘాతం కలగడమే కాకుండా, విస్తృతమైన ద్వైపాక్షిక సంబంధాలపై పెను ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేసింది. తూర్పు లద్దాఖ్‌లో కార్యకలాపాలను నిలిపేయాలని చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం స్పష్టం చేశారు. సరిహద్దుల్లో చైనా దుందుడుకు చర్యలతో ఆ దేశంపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు.
ద్వైపాక్షిక సంబంధాలు సజావుగా ఉండాలంటే.. సరిహద్దుల్లో శాంతి నెలకొనడం అత్యంతావశ్యకమన్న విషయం చైనా గుర్తించాలని మిస్త్రీ హితవు పలికారు. గల్వాన్ లోయ తమదేనని చైనా పదేపదే చెప్పడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుందని హెచ్చరించారు. వాస్తవాధీన రేఖపై భారత్‌కు పూర్తిగా అవగాహన ఉందని, ఎల్‌ఏసీకి ఇటువైపు, ఇండియన్ ఆర్మీ పెట్రోలింగ్ చాన్నాళ్లుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా కొనసాగుతోందని గుర్తు చేశారు. జూన్ 15 నాటి ఘర్షణకు కారణం భారత సైనికులేనన్న చైనా వాదనను విక్రమ్ మిస్త్రీ తోసిపుచ్చారు. ‘ఏప్రిల్, మే నెలల్లో గల్వాన్ లోయలో చైనా కార్యకలాపాలు పెరిగాయి. భారత పెట్రోలింగ్‌ను పదేపదే అడ్డుకున్నారు. అందుకే ఘర్షణలు చోటు చేసుకున్నాయి’ అని స్పష్టం చేశారు.
రాజ్‌నాథ్‌తో ఆర్మీ చీఫ్ భేటీ
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల్లోని తూర్పు లద్దాఖ్‌లో వాస్తవ పరిస్థితిని, భారత సైన్యం సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు వివరించారు. జూన్ 23, 24 తేదీల్లో జనరల్ నరవణె లద్దాఖ్‌లో పర్యటించి, క్షేత్ర స్థాయి పరిస్థితిని సమీక్షించిన విషయం తెలిసిందే. రాజ్‌నాథ్ కూడా 22 నుంచి 24 వరకు రష్యాలో పర్యటించి వచ్చారు.
సరిహద్దుల రక్షణ బాధ్యత సర్కారుదే: సోనియా
న్యూఢిల్లీ: భారత సరిహద్దులను కాపాడే బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పించుకోలేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. లడ్దాఖ్ పరిస్థితుల విషయంలో దేశప్రజల అభిప్రాయాలను విశ్వాసంలోకి తీసుకోవాలని ప్రధాని మోదీకి సూచించారు. భారత్ చైనా సరిహద్దుల్లోని లడ్దాఖ్‌లో ప్రాణత్యాగాలు చేసిన సైనిక అమరవీరుల స్మారకార్థం కాంగ్రెస్ చేపట్టిన ‘స్పీక్ అప్ ఫర్ అవర్ జవాన్స్’కార్యక్రమంలో సోనియా వీడియో సందేశం ఇచ్చారు.
ప్రధాని మోదీ చెప్పినట్టు భారత భూభాగంలోకి చైనా చొచ్చుకొని రాకపోతే, 20 మంది భారత సైనికులు ఎందుకు ప్రాణాలు కోల్పోయారని ప్రశ్నించారు. మన సైన్యానికి సంపూర్ణ సహకారాన్ని, శక్తిని అందించడమే నిజమైన దేశభక్తి అవుతుందని సోనియా అన్నారు. చైనా మన భూభాగాన్ని ఆక్రమించుకోలేదని ప్రధాని చెప్పడం పొరుగు దేశానికి మేలు చేయడమేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తన వీడియో సందేశంలో ఆయన..తూర్పు లడ్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని ఉపగ్రహ చిత్రాలు, రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment