న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి పూర్తిస్థాయిలో శాంతి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని భారత్, చైనా ఒక అంగీకారానికి వచ్చాయి. తూర్పు లద్దాఖ్‌లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. ఇరు దేశాల దౌత్య ప్రతినిధులు మరోసారి శుక్రవారం ఆన్‌లైన్ ద్వారా చర్చలు జరిపారు. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతిస్థాపన కోసం సరిహద్దుల్లో సైన్యాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవడానికి ఇరు దేశాల ప్రతినిధులు అంగీకరించారు. ఎల్‌ఏసీ వెంబడి సైనికుల ఉపసంహరణ పురోగతిపై సమీక్షించారు. భారత్, చైనా సరిహద్దుల్లో పరిస్థితులపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం అమెరికా రక్షణ మంత్రి మార్క్ టీ ఎస్పర్‌తో చర్చలు జరిపారు.
తూర్పు లద్దాఖ్‌లో పరిస్థితిపై రాజ్‌నాథ్ సమీక్ష
తూర్పు లద్దాఖ్ సరిహద్దుల్లోని ఘర్షణాత్మక ప్రాంతాల నుంచి చైనా బలగాల ఉపసంహరణ అనంతర పరిస్థితులపై శుక్రవారం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష జరిపారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే, నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఆర్‌కేఎస్ బదౌరియాతోపాటు పలువురు సీనియర్ సైనికాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒప్పందం ప్రకారం సరిహద్దుల్లో బలగాల ఉపసంహరణలో మొదటి దశ పూర్తయినట్లేనని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
భారత్ అమ్ముల పొదిలో మరిన్ని ‘అపాచీ’లు
భారత్ చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్‌కు 22 అపాచీ, 15 చినూక్ హెలికాప్టర్ల అందజేత పూర్తి చేసినట్లు అమెరికా విమానయాన సంస్థ బోయింగ్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం అపాచీ యుద్ధ హెలికాప్టర్లలోని చివరి ఐదింటిని ఇటీవల భారత వైమానిక దళానికి అందజేసినట్లు బోయింగ్ సంస్థ వెల్లడించింది. (చైనా హెచ్చరికలు.. ఖండించిన కజకిస్థాన్!)
Comments
Please login to add a commentAdd a comment