
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్‌లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్‌కు బుధవారం హాజరైన భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్‌లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు.
చర్చల ద్వారా సమస్యల పరిష్కారం
ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్‌ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment