Repentance
-
జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోవాల్సిందే
ముంబై: ‘మరణశిక్ష అనేది దోషులకు పశ్చాత్తాపం నుంచి వెంటనే విముక్తి పొందేలా చేస్తుంది. జీవితఖైదు విధిస్తేనే వారు జీవితాంతం పశ్చాత్తాపంతో కుంగిపోతారు’ అంటూ సామూ హిక అత్యాచార కేసు దోషుల మరణశిక్ష నుంచి జీవితఖైదుకు తగ్గిస్తూ బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. ‘ రేప్ అనేది అత్యంత హేయమైన చర్య. బాధితురాలు శారీరకంగానే కాదు మానసికం గానూ అత్యంత వేదనకు గురవుతారు. మహిళ గౌరవాన్ని కించపరుస్తూ, అత్యంత తీవ్రస్థాయిలో ఉల్లంఘనకు పాల్పడిన ఈ దోషులెవరూ జీవితకాలంలో ఎన్నడూ సమాజంలోకి తిరిగి వెళ్లలేరు. జీవితాంతం తమ ఘోరమైన నేరానికి పశ్చాత్తాపం చెందాలంటే మరణశిక్షకు బదులు యావజ్జీవ కారాగార శిక్షే సరైంది’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. 2013 ఆగస్ట్ 22న సెంట్రల్ ముంబైలోని నిరుపయోగంగా ఉన్న శక్తి మిల్స్ కాంపౌండ్‌లో 22 ఏళ్ల మహిళా ఫొటో జర్నలిస్ట్‌పై ఐదుగురు అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘటనలో దోషులుగా తేలిన ఐదుగురుకీ మరణశిక్ష విధిస్తూ ఏడేళ్ల క్రితమే ట్రయల్ కోర్టు శిక్ష ఖరారుచేసింది. వీరిలో విజయ్ జాధవ్, మొహమ్మద్ ఖాసిం బెంగాలీ షేక్, మొహమ్మద్ అన్సారీ మరణశిక్షను సవాల్ చేస్తూ 2014 ఏప్రిల్‌లో బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును జస్టిస్ సాధనా జాధవ్, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌ల డివిజన్ బెంచ్ గురువారం విచారించింది. ‘ దోషులకు మరణశిక్ష సరిపోదు. అంతకు మించిన శిక్ష విధించాలి. జీవితాంతం వీరు పశ్చాత్తాపంతో కుంగిపోవాలనే ఉద్దేశంతోనే, కింది కోర్టు ఖరారుచేసిన మరణశిక్షను జీవితఖైదుగా మారుస్తున్నాం’ అని హైకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు తీర్పులో పేర్కొన్నారు. ‘ ఏ నేరానికి ఏ శిక్ష అనే విధానంలో.. ఇలాంటి దారుణమైన ఘటనల్లో మరణశిక్షకు బదులుగా యావజ్జీవ శిక్ష విధించాలనే ఒక నియమంగా పెట్టాలి’ అని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ‘సంచలనం రేపిన ఈ కేసులో ప్రజల్లో వ్యక్తమైన ఆగ్రహావేశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పులు చెప్పడం కుదరదు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్‌లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్‌కు బుధవారం హాజరైన భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్‌లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్‌ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు. -
పశ్చాత్తాప దీపం
దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న కాలంలో ఒక తప్పు చేశాడు. దేవుని చేత పంపబడిన నాతాను ప్రవక్త తెలిపిన వెంటనే తన తప్పును గుర్తించి, పశ్చాత్తాప పడ్డాడు. సరైన సమయంలో ఒప్పుకున్నాడు. కనుక క్షమాపణ పొందాడు. అలాగే హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి సోకినప్పుడు యెషయా ప్రవక్త దైవ ప్రేరణతో అతని వద్దకు వచ్చి ‘‘నువ్వు త్వరలో మరణించబోతున్నావు, నీ ప్రాణ దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో’’ అని హెచ్చరించాడు. రాజు వెంటనే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రభువు అతన్ని బాగు చేసి, పదిహేను సంవత్సరాలు అధిక ఆయుష్షును ఇచ్చాడు. ఈ ఉదంతాలలో.. తమ స్థితిని గుర్తించి, వెంటనే సరిదిద్దుకున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. అయితే ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుని కూడా తప్పించుకోక, దాన్నే కౌగిలించుకుని, తన ప్రాణానికే ఉరి తెచ్చుకున్నాడు. అతడే యూదా ఇస్కరియోతు! యేసు ప్రభువు తన మరణానికి ముందు రోజు రాత్రి, శిష్యులతో కలిసి పస్కా భోజనం చేస్తూ, ‘‘మీలో ఒకరు నన్ను శత్రువుల చేతికి అప్పగించబోతున్నారు. లేఖనాల్లో రాయబడిన ప్రకారం నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తాను, మరల వస్తాను. కాని ఎవని చేత దైవ కుమారుడు అప్పగించబడ బోతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ!’’ అని చెప్పినప్పుడు, యూదా ‘‘ప్రభువా? నేనా?’’ అని అడిగి, ‘‘నువ్వన్నట్టే’’ అన్న స్పష్టమైన జవాబును ప్రభువు నుండి పొంది కూడా, పశ్చాత్తాప పడలేదు... వెనుతిరగలేదు. పవిత్ర ప్రేమకు సూచన అయిన ముద్దుతో తన గురువుగారిని శత్రువుకు అప్పగించి కేవలం ముప్ఫై వెండి నాణాలకు అమ్ముడుపోయిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. సిలువలో వేళ్లాడుతూ, రక్తమోడుతున్న తన ప్రభువును చూసి.. తట్టుకోలేక, గుండె పగిలేలా ఏడ్చాడు, మెడకు ఉరేసుకుని పొట్టపగిలి పేగులు వేలాడి చచ్చిపోయాడు! అందుకే దీపం ఉండగానే ఇంటిని సరిదిద్దుకొమ్మన్నారు పెద్దలు! – ఝాన్సీ కె.వి. కుమారి -
బీజేపీతో పొత్తు ఘోర తప్పిదం
బెంగళూరు: 12 ఏళ్ల క్రితం తండ్రి మాటకు ఎదురుచెప్పి బీజేపీతో జతకట్టి ఘోర తప్పిదం చేశానని జేడీఎస్ నాయకుడు హెచ్డీ కుమారస్వామి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఫలితంగా తన తండ్రి దేవెగౌడ లౌకిక సిద్ధాంతాలను ప్రజలు ప్రశ్నించారని, ఆ మరకను తొలగించుకునే అవకాశం ఇప్పుడొచ్చిందని అన్నారు. జేడీఎస్ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తరువాత కుమారస్వామి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆనాడు తన పార్టీని కాపాడుకోవడానికే బీజేపీ వెంట నడిచినట్లు చెప్పారు. తన తండ్రి లౌకిక సిద్ధాంతాల్ని ప్రజలు వేలెత్తిచూపడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని తెలిపారు. 2006లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడంపై స్పందిస్తూ..తాను, తన తండ్రి సంకీర్ణం పేరిట డ్రామా ఆడుతున్నామని ప్రజలు అనుకున్నారని, కానీ ఆ నిర్ణయం తన ఒక్కడిదేనని స్పష్టతనిచ్చారు. ఆ ఒక్కసారే తన తండ్రి మాటకు విరద్ధంగా వ్యవహరించానని, అంతకుముందు, ఆ తరువాత ఎప్పుడూ అలా జరగలేదని తెలిపారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లు తనకు ఆఫర్ ఇచ్చాయని, కానీ బేషరతు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తానని అన్నారు. అంత తేలిగ్గా వదిలిపెట్టం ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్ ఆహ్వానించండపై కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తూ గవర్నర్ లేఖ రాసిన వెంటనే కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ‘దీన్ని మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం’ అని అన్నారు. బలనిరూపణకు యడ్యూరప్పకు నాలుగైదు రోజులు కాకుండా ఏకంగా 15 రోజుల సమయాన్ని ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ అనేక ప్రలోభాలకు గురిచేస్తోందని కుమారస్వామి ఆరోపించారు. -
జగదీశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పరస్పర పశ్చాత్తాపం
-
జగదీశ్‌రెడ్డి, కిషన్‌రెడ్డి పరస్పర పశ్చాత్తాపం
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి గురువారం సభలో పరస్పరం పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. విద్యుత్ పద్దుపై బుధవారం సాయంత్రం జరిగిన చర్చలో జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ రాష్ట్రానికి కోట్ల రూపాయలేమైనా ఇచ్చారా? లోయర్ సింగూరు ప్రాజెక్టు కుట్రలో భాగంగా ఏడు మండలాలను చంద్రబాబుకు అప్పగించారు’ అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో కిషన్‌రెడ్డి వెల్‌లోకి వచ్చి తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. మంత్రి క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఈ అంశంపై గురువారం సభ ప్రారంభమవగానే మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడారు. తాను పొరపాటుగా మాట్లాడలేదని, ఏమైనా అభ్యంతరకర వ్యాఖ్యలుంటే క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘గత ముఖ్యమంత్రులు వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిల సమయంలోనూ అసెంబ్లీ వేదికగా పోరాటం చేశాను. మోదీపై విమర్శలు చేయడంతో తొందరపడ్డాను. వెల్‌లోకి వచ్చినందుకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాను’ అని ప్రకటించారు.