ఇస్కరియోతు యూదా (కుడి చివర)
దావీదు ఇజ్రాయేలు దేశానికి రాజుగా ఉన్న కాలంలో ఒక తప్పు చేశాడు. దేవుని చేత పంపబడిన నాతాను ప్రవక్త తెలిపిన వెంటనే తన తప్పును గుర్తించి, పశ్చాత్తాప పడ్డాడు. సరైన సమయంలో ఒప్పుకున్నాడు. కనుక క్షమాపణ పొందాడు. అలాగే హిజ్కియా రాజుకు మరణకరమైన వ్యాధి సోకినప్పుడు యెషయా ప్రవక్త దైవ ప్రేరణతో అతని వద్దకు వచ్చి ‘‘నువ్వు త్వరలో మరణించబోతున్నావు, నీ ప్రాణ దీపముండగానే నీ ఇల్లు చక్కబెట్టుకో’’ అని హెచ్చరించాడు. రాజు వెంటనే దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు. ప్రభువు అతన్ని బాగు చేసి, పదిహేను సంవత్సరాలు అధిక ఆయుష్షును ఇచ్చాడు.
ఈ ఉదంతాలలో.. తమ స్థితిని గుర్తించి, వెంటనే సరిదిద్దుకున్న వ్యక్తుల్ని చూస్తున్నాం. అయితే ఒక వ్యక్తి తన తప్పు తెలుసుకుని కూడా తప్పించుకోక, దాన్నే కౌగిలించుకుని, తన ప్రాణానికే ఉరి తెచ్చుకున్నాడు. అతడే యూదా ఇస్కరియోతు! యేసు ప్రభువు తన మరణానికి ముందు రోజు రాత్రి, శిష్యులతో కలిసి పస్కా భోజనం చేస్తూ, ‘‘మీలో ఒకరు నన్ను శత్రువుల చేతికి అప్పగించబోతున్నారు. లేఖనాల్లో రాయబడిన ప్రకారం నేను మరణిస్తాను, తిరిగి లేస్తాను, తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్తాను, మరల వస్తాను. కాని ఎవని చేత దైవ కుమారుడు అప్పగించబడ బోతున్నాడో ఆ మనుష్యునికి శ్రమ!’’ అని చెప్పినప్పుడు, యూదా ‘‘ప్రభువా? నేనా?’’ అని అడిగి, ‘‘నువ్వన్నట్టే’’ అన్న స్పష్టమైన జవాబును ప్రభువు నుండి పొంది కూడా, పశ్చాత్తాప పడలేదు... వెనుతిరగలేదు. పవిత్ర ప్రేమకు సూచన అయిన ముద్దుతో తన గురువుగారిని శత్రువుకు అప్పగించి కేవలం ముప్ఫై వెండి నాణాలకు అమ్ముడుపోయిన ద్రోహిగా చరిత్రలో మిగిలిపోయాడు. సిలువలో వేళ్లాడుతూ, రక్తమోడుతున్న తన ప్రభువును చూసి.. తట్టుకోలేక, గుండె పగిలేలా ఏడ్చాడు, మెడకు ఉరేసుకుని పొట్టపగిలి పేగులు వేలాడి చచ్చిపోయాడు! అందుకే దీపం ఉండగానే ఇంటిని సరిదిద్దుకొమ్మన్నారు పెద్దలు! – ఝాన్సీ కె.వి. కుమారి
Comments
Please login to add a commentAdd a comment