india-china war
-
ఓటమి నేర్పిన పాఠాలు
భారత్–చైనా యుద్ధానికి 60 ఏళ్లు! నాయకత్వ వైఫల్యాలు, సన్నద్ధంగా లేని సైన్యం కారణంగా భారత్ అందులో పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏమైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామనే చెప్పాలి. అయితే ఆ పాఠాలు చొరబాట్లను ఎదుర్కోడానికి మాత్రమే పనికొచ్చేవి. సరిహద్దు సమస్యల్ని పరిష్కారించుకోడానికైతే మిగిలి ఉన్న మార్గం ఒక్కటే. 1959–60 ప్రతిపాదనల ప్రకారం... ఇరుదేశాలు ‘ఇచ్చిపుచ్చుకునే’ ధోరణిలో ముందుకు వెళ్లడం! అక్సాయ్ చిన్ను చైనాకు వదిలేసి, అరుణాచల్ ప్రదేశ్‌ను భారత్ ఉంచుకోవడం. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం! సరైన ఆయుధాలు, దుర్భేద్యమైన సైనిక దుస్తులు లేకుండా ఈశాన్య సరిహద్దు ప్రాంతం (నార్త్ ఈస్ట్ ఫ్రాంటియర్ ఏజెన్సీ – ఎన్.ఇ.ఎఫ్.ఎ.)లో గస్తీ కాస్తున్న భారత దళాలు ఒక హఠాత్పరిణామంగా 1962 అక్టోబర్ రాత్రి 19–20 తేదీల మధ్య చైనా జరిపిన చొరబాటు దాడులతో అనేక ప్రాధాన్య స్థావరాలను కోల్పోయాయి. ఆశ్చర్యకరంగా, చైనా సైని కుల్ని వెనక్కి తరిమికొట్టే బాధ్యత... దానికి ఎంతమాత్రమూ తగని ‘గజరాజ్ కోర్’ సేనాని, నెహ్రూ మనిషిగా పరిగణన పొందిన లెఫ్ట్‌నెంట్ జనరల్ బి.ఎం.కౌల్‌పై పడింది! ఆ అయోమయంలో ఆయన వెంటనే ఢిల్లీ వెళ్లిపోయారు. ఈశాన్య సరిహద్దు ప్రాంతంలో వ్యూహమంటూ లేని మన గందరగోళం గురించి ఢిల్లీలోని రాజకీయ దిగ్గజాలకు నివేదించడం ఆయన ఉద్దేశం. ఈశాన్య భారతదేశానికి, టిబెట్‌కు మధ్య ఉన్న మక్‌మహన్ సరిహద్దు రేఖ వెంబడే చైనా మూకల చొరబాట్లు కొనసాగుతూ ఉండటంతో ఢిల్లీ వెళ్లిన కౌల్ మళ్లీ తిరిగిరాలేదు. సైనిక దళాల మోహరింపు, యుద్ధ ప్రణాళికలకు వ్యూహరచన జరుగుతుండే ఢిల్లీలోనూ అయోమయం నెలకొంది. చైనా వెన్నుపోటు పొడిచిందని నెహ్రూ, ఆయన అనుచరులు ఆ తర్వాత వాదిస్తూ వచ్చారు కానీ, మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు నాయకత్వం ఏం చేయనుందో 1950ల చివరి నుంచీ చాలినన్ని హెచ్చరికలు కనిపిస్తూనే ఉన్నాయి. చైనాను బుజ్జగించడానికి టిబెట్ స్వాతంత్య్రానికి మద్దతు ఇవ్వడం మానేస్తామని భారత్ ఇచ్చిన హామీపై 1954లో ‘పంచశీల’ ఒప్పందానికి చైనా అంగీకారం తెలిపింది. అయినప్పటికీ అక్సాయ్ చిన్లోగానీ, తవాంగ్‌లో మక్‌మహన్ నియంత్రణ రేఖను మీరిన భాగాన్ని కూడా తనదేనన్న వాదననుగానీ చైనా వదులుకోలేదు. 1959లో లోంగ్జులో జరిగిన వాగ్వివాదాలను భారత్ తేలిగ్గా తీసుకుంది. లోంగ్జులో వందలాది భారత సైనిక దళాలు తమ భూభాగం లోకి ప్రవేశించాయంటూ చైనాలోని భారత రాయబార కార్యాలయా నికి చైనా నిరసన పత్రం పంపినప్పుడు భారత్ ఏమాత్రం దీటైన జవాబు ఇవ్వలేకపోయింది. మావో, కృశ్చేవ్‌ల మధ్య కుదిరిన ఒప్పం దాన్ని అనుసరించి సోవియట్ వైమానిక, భూ ఉపరితల సేనల సహ కారంతో టిబెట్ భూభాగంపై చైనా తన సైనిక బలగాలను స్థిరంగా పెంచు కుంటూ పోయింది. ఆ పరిణామాన్ని కూడా భారత్ పట్టించు కోలేదు. 1959లో అమెరికా సాయంతో టిబెట్ నుంచి భారత్‌కు తప్పించుకున్న దలైలామా, ఆయన అనుచరులు భారత్‌లో ఆశ్రయం పొందడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. నిజానికి ముందుగా అనుకున్నది వారు అమెరికా వెళ్తారని. అన్నిటినీ మించి చైనా కోపానికి కారణమైన అంశం... అమెరికా కార్యకలాపాలకు భారత్ ఒక ప్రధాన కేంద్రం అవడం. సీఐఏ శిక్షణ పొందిన సాయుధ టిబెటన్ తిరుగు బాటు దళాల్ని టిబెట్‌లోకి పంపించేందుకు భారత్‌ను అమెరికా ఒక ‘లాంచ్ ప్యాడ్’గా ఉపయోగించుకుంది. ఇక స్వదేశంలో ఒత్తిళ్లకు లోనైన నెహ్రూ భారత భూభాగాలలోంచి చైనీయులను విసిరి బయట పడేయమని భారత సైన్యాన్ని ఆదేశించారు. ఆ దూకుడులో ఆయన చైనా ప్రధాని చౌ ఎన్–లై 1960లో ఇండియా పర్యటించినప్పుడు చేసిన ప్రతిపాదనలను సైతం విస్మరించారు. అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని చైనాకు ఉంచి, మక్‌మహన్ రేఖకు దక్షిణ వైపున ఉన్న ప్రాంతాన్ని భారత్ తీసుకోవడం ద్వారా సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నదే ఆ ప్రతిపాదన. నిజానికి 1962 భారత్–చైనా యుద్ధంలో మన సేనలు మెరుగైన ప్రతిఘటననే ఇచ్చాయి. సరిహద్దు వెంబడి ప్రాధాన్య స్థావరాలపై తమ పట్టును కోల్పోకుండా ఉండేందుకు వీరోచితంగా పోరాడాయి. మన సేనాపతులు తమ సైనికులపై ఎన్ని నెపాలు మోపినా గానీ, ఆ సైనికుల అసమాన శౌర్య పరాక్రమాలకు ఎన్నో నిదర్శనాలు కనిపి స్తాయి. అలాగైతే ఎందుకు ఓడిపోయాం? చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ థాపర్, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ (ఈస్ట్రన్ కమాండ్) లెఫ్ట్‌నెంట్ జనరల్ ఎల్.పి.సేన్ల నిస్పృహ కలిగించే పాత్రతో పాటుగా, నెహ్రూ నిర్ణయం కూడా మన పరాజయానికి కారణమైంది. ఇంటెలిజెన్స్ చీఫ్ బి.ఎన్.మాలిక్ సలహాపై భారత వైమానిక దళాలను రంగంలోకి దింపేందుకు నెహ్రూ అనుమతించలేదు. అలా చేస్తే చైనాను మరింతగా రెచ్చగొట్టినట్లు అవుతుందని నెహ్రూ భావించారు! అదొక పెద్ద తప్పిదంగా చరిత్రలో నిలిచిపోయింది. భారత్–చైనా యుద్ధం జరిగి 60 ఏళ్లయింది. ఇప్పుడిక అసలు ప్రశ్న ఏమిటంటే 1962 నాటి ఆ యుద్ధం నుంచి మనం ఏవైనా పాఠాలు నేర్చుకున్నామా అని! నేర్చుకున్నామని చెప్పడమే న్యాయంగా ఉంటుంది. ఇందుకు అనేక ఉదాహరణలను చూపవచ్చు. ముఖ్యంగా, 1967లోనే చైనా నాథు లా పాస్, చో లా పాస్ మార్గాలు వెళ్లే హిమాలయ సరిహద్దు ప్రాంతాల్లో భారత్‌కు వ్యతిరేకంగా కండలు తిప్పడం మొదలు పెట్టీ పెట్టగానే అక్కడి జననల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ మేజర్ జనరల్ సగత్ సింగ్ తన అధీనంలోని కంచె లోపలి భాగంలోకి ఎలాంటి విదేశీ చొరబాట్లను అనుమతించబోనని తన పై అధికారులకు ముందస్తు సమాచారం పంపించారు. అంటే తనిక ఎలాంటి ఆదేశాల కోసమూ ఎదురు చూడబోయేది లేదని. 20 ఏళ్ల పాటు నిశ్శబ్దంగా ఉండిపోయిన చైనా 1986–87లో అరుణాచల్ ప్రదేశ్‌లోని సోమ్డోరోంగ్ లోయలోకి చొరబడింది. ఆర్మీ చీఫ్ జనరల్ సుందర్జీ మెరుపు వేగంతో ప్రతిస్పందించి భారత సేనల్ని గగనతలం గుండా సోమ్డోరోంగ్పై దింపారు. మన సైన్యం చైనా సేనల్ని చుట్టుముట్టింది. ప్రత్యర్థి మూకలు మారు మాట్లాడకుండా వెన కడుగు వేశాయి. ఆ ఘటన ప్రధాని రాజీవ్ గాంధీ రక్తాన్ని ఉత్తేజంతో ఉరకలెత్తించింది. అనంతర పరిణామంగా 1988లో జరిగిన రాజీవ్ చైనా పర్యటన, ఆ సందర్భంగా రెండు దేశాల మధ్య వరుసగా కుది రిన అనేక ఒప్పందాలు ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఇటీవల 2020లో గల్వాన్ లోయలో చైనా చొరబాట్లకు కూడా భారత్ మునుప టంత వేగంగానే స్పందించింది. చైనా మితిమీరి, పరిస్థితి ముదిరితే కనుక గల్వాన్‌లో మన సైనికులు దెబ్బకు దెబ్బ తీసిన విధంగానే వాణిజ్య పరమైన ఆంక్షలను విధించేందుకు కూడా భారత్ సిద్ధమైంది. గగనతలం నుంచి పోరుకు సైతం సన్నద్ధం అయింది. గతం నుంచి మనం ఇంకా నేర్చుకోవలసింది ఏమైనా ఉందీ అంటే అది చైనా ఉద్దేశాలను మరింతగా అర్థం చేసుకోగలగడం. అక్సాయ్ చిన్‌పై చైనా తన నియంత్రణను వదులుకునేలా చేయడానికి బీజింగ్‌తో భారత్ దౌత్యపరమైన సంభాషణలు జరపడం వల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు. అక్సాయ్ చిన్ వ్యూహాత్మకంగా చైనాకు ఎంతో ప్రాముఖ్యమైనది. ముఖ్య నదులు, యురేనియం నిక్షేపాలు ఉన్న ప్రాంతం అది. అక్కడి నుంచే జి 219 హైవే వెళుతుంది. చైనాలోని రెండు కీలక ప్రాంతాలైన షిన్జాంగ్, టిబెట్లను ఆ దారి కలుపుతుంది. మరైతే అక్సాయ్ చిన్ సమస్యకు పరిష్కారం ఏమిటి? ముందుకు వెళ్లే దారేది? ఒక మార్గం అయితే ఉంది. 1959–60 ప్రతిపాదనల ప్రకారం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వెళ్లడం. అప్పుడిక అక్సాయ్ చిన్ చైనాకు, అరుణాచల్ ప్రదేశ్ భౌగోళిక ప్రాంతాలు భారత్ భూభాగానికి వస్తాయి. అంటే సరిహద్దు రేఖల్ని ఉన్నవి ఉన్నట్లుగా ఇరు దేశాలు అంగీకరించడం. ప్రస్తుతం రెండు దేశాలకు శక్తిమంతమైన నాయకులే ఉన్నారు కనుక సరిహద్దు వివాదాలను పరిష్కరించుకుని, రాజకీ యంగా సరళమైన మనుగడ సాగించవచ్చు. అయితే వారు అలా చేయ డానికి సిద్ధంగా ఉన్నారా అన్నదే ప్రశ్న. మరూఫ్ రజా వ్యాసకర్త వ్యూహాత్మక వ్యవహారాల విశ్లేషకులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
డ్రాగన్ శకం ముగిసింది!
గతమెంతో ఘనకీర్తి..?! భవిష్యత్తులో చైనా ఇదేవిధంగా చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందేమో. పిన్ను నుంచి పెద్ద యంత్రం వరకు ఏ ఉత్పత్తిని అయినా తయారు చేయగలదు చైనా. అందుకే అంత వేగంగా ఎదిగి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కాగలిగింది. కానీ, కరోనాతో, అమెరికాతో వాణిజ్య కయ్యం కారణంగా చైనా పరిస్థితి మారిపోనుందని నిపుణులు, పారిశ్రామికవేత్తల మాటలను పరిశీలిస్తే అర్థమైపోతోంది. ‘ప్రపంచానికి పరిశ్రమగా చైనా రోజులు ముగిసినట్టే’.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు... ఫాక్స్‌కాన్ బాస్ యంగ్ లీ!. దీనికి కారణంగా ట్రేడ్ వార్ (వాణిజ్య యుద్ధం)ను ఆయన పేర్కొన్నారు. యాపిల్ ఐఫోన్ల నుంచి, డెల్ కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు ఇలా ఒకటేమిటి అన్నింటికీ తయారీ కేంద్రం చైనాయే. యాపిల్ కు ప్రధాన తయారీ భాగస్వాముల్లో ఒకటైన ఫాక్స్‌కాన్ తోపాటుచైనా కేంద్రంగా విస్తరించిన డజను వరకు టెక్నాలజీ కంపెనీలు ఇప్పుడు చైనా బయట వైపునకు చూస్తున్నాయి. చైనా మార్కెట్‌కు, యూఎస్ మార్కెట్‌కు సరఫరా వ్యవస్థలను వేర్వేరుగా నిర్వహించాల్సిన ఆవశ్యకతను మారిన పరిస్థితుల్లో అవి అవగతం చేసుకున్నాయి. చైనా బయట క్రమంగా మరింత తయారీ సామర్థ్యాన్ని ఏర్పాటు చేసుకోనున్నట్టు హాన్ హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ (ఫాక్స్ కాన్ గా ట్రేడయ్యే సంస్థ) చైర్మన్ యుంగ్ లీ తెలిపారు. ప్రస్తుతానికి మొత్తం తయారీ సామర్థ్యంలో 30 శాతం చైనా బయట ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. గతేడాది జూన్ నాటికి ఇది 25 శాతమే. ఏడాదిలో చైనా వెలుపల 5 శాతం తయారీని పెంచుకున్న ఈ సంస్థ.. భవిష్యత్తులో దీన్ని మరింతగా పెంచుకునే ప్రణాళికలతో ఉంది. చైనాలో తయారై అమెరికాలోకి ప్రవేశించే ఉత్పత్తులపై పెరిగే టారిఫ్‌ల భారం పడకుండా ఉండేందుకు గాను ఫాక్స్ కాన్ సంస్థ భారత్, ఆగ్నేయాసియా, ఇతర ప్రాంతాలకు తయారీని తరలించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కంపెనీ ఫలితాల ప్రకటన సందర్బంగా యంగ్ లీ స్వయంగా మీడియాకు వెల్లడించారు. ‘‘భారత్ లేదా ఆగ్నేయాసియా లేదా అమెరికా.. ఏదైనా సరే ఆయా ప్రాంతాల్లో తయారీ ఎకోసిస్టమ్ ఉంది’’ అని లీ పేర్కొన్నారు. అయితే, ఫాక్స్ కాన్ తయారీలో చైనా ఇక ముందూ కీలకపాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు. కాకపోతే ప్రపంచానికి తయారీ కేంద్రంగా చైనా దశకం ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. భారత్ లో ఫాక్స్ కాన్ విస్తరణ అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి సంస్థలు తమ తయారీ కేంద్రాలను చైనా బయట కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాయి. అవసరమైతే యాపిల్ ఉత్పత్తులను పూర్తిగా చైనా బయట తయారు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని యంగ్ లీ గతేడాదే ఓ సందర్భంలో చెప్పడం గమనార్హం. దీర్ఘకాలంలో చైనాకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రానిక్ తయారీ కేంద్రాలు ఏర్పాటు కావడం తథ్యమని లీ మాటలతో స్పష్టమవుతోంది. ఫాక్స్‌కాన్ కు మన దేశంలోనూ తయారీ కేంద్రాలున్నాయి. మరిన్ని పెట్టుబడులతో సామర్థ్య విస్తరణ చేయనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించింది కూడా. భారత్ లో తయారీకి అమెరికాకు చెందిన యాపిల్ ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో యాపిల్ తయారీ భాగస్వామిగా ఫాక్స్‌కాన్ సంస్థ భారత మార్కెట్ పట్ల విస్తరణ ప్రణాళికలతో ఉంది. అమెరికాకు సరఫరా చేసే ఉత్పత్తుల తయారీకి భారత్ ను ప్రధానంగా ఫాక్స్‌కాన్ పరిశీలిస్తుండడం గమనార్హం. యాపిల్ ఐపాడ్, మ్యాక్ ఉత్పత్తులకు డిమాండ్ కారణంగా ఫాక్స్ కాన్ జూన్ క్వార్టర్ లో 5,835 కోట్ల భారీ లాభాన్ని ప్రకటించడం గమనార్హం. ఈ సంస్థ తైవాన్ కు చెందినది. టెన్సెంట్ హోల్డింగ్స్‌కు చెందిన వీచాట్ వినియోగాన్ని అమెరికా పౌరులు వినియోగించకుండా నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే. పోటీతత్వంతో స్వావలంబన భారత్ భారత్ తన అవసరాలను దేశీయంగా తీర్చుకునేందుకు (ఆత్మ నిర్భర్) దేశీయ పరిశ్రమ కచ్చితంగా మరింత పోటీనిచ్చే విధంగా మారాల్సిన అవసరం ఉందని మాజీ కేంద్ర వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు రక్షణాత్మక విధానాలను అవలంబిస్తున్నతరుణంలో.. భారత్ కూడా తన అవసరాలకు తనపైనే ఆధారపడాల్సిన అవసరం ఉందన్నారు. స్వేచ్ఛాయుత మార్కెట్ కలిగిన అమెరికా సైతం రక్షణాత్మక విధానాలను అనుసరిస్తున్న విషయాన్ని ప్రభు గుర్తు చేశారు. కనుక రానున్న రోజుల్లో ఆత్మనిర్భర్ కు మరే ప్రత్యామ్నాయం లేదని పేర్కొన్నారు. ‘‘మన పరిశ్రమలను మరింత పోటీయుతంగా మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోటీతత్వం మన పరిశ్రమల సమర్థతను పెంచుతుంది. ఆ పోటీయే మనకు మేలు చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అంటూ పీహెచ్ డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహంచిన కార్యక్రమంలో భాగంగా పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనకు కేంద్రం ఎన్నో విధాానాలను అమలు చేసినట్టు ప్రభు చెప్పారు. చైనా ఉత్పత్తులకు తగ్గిన ఆదరణ! న్యూఢిల్లీ: చైనా తయారీ ఉత్పత్తుల పట్ల భారతీయుల్లో ఆసక్తి తగ్గుతోందని సోషల్ మీడియా వేదిక లోకల్‌సర్కిల్స్ తన సర్వేలో వెల్లడించింది. నవంబరు 10–15 మధ్య దేశవ్యాప్తంగా 204 జిల్లాల్లో ఈ సర్వే చేపట్టారు. దీని ప్రకారం సర్వేలో పాలుపంచుకున్న వారిలో పండుగల సీజన్లో కేవలం 29 శాతం మంది మాత్రమే చైనా ఉత్పత్తులను కొనుగోలు చేశారు. గతేడాది ఈ సంఖ్య 48 శాతం ఉంది. 2019లో చేపట్టిన సర్వేలో 14,000 మందికిపైగా పాల్గొన్నారు. 2019తో పోలిస్తే ప్రస్తుత సీజన్లో చైనా ఉత్పత్తులను కొనుగోలు చేసిన వారి సంఖ్య 40 శాతం తగ్గిందని లోకల్‌సర్కిల్స్ ఫౌండర్ సచిన్ తపారియా తెలిపారు. ఈ ఏడాది చైనా ఉత్పత్తులు కొన్నవారిలో 71 శాతం మంది తాము స్పృహతో కొనుగోలు చేయలేదని స్పష్టం చేశారు. డబ్బుకు తగ్గ విలువ కాబట్టే ఆసక్తి చూపామని 66% మంది తెలిపారు. దాడి తర్వాత పెరిగిన వ్యతిరేకత.. జూన్‌లో గాల్వన్ వ్యాలీలో చైనా సైనికుల దాడిలో భారత జవాన్లు వీర మరణం పొందిన సంఘటన తర్వాత చైనా ప్రొడక్ట్స్ పట్ల భారతీయుల్లో వ్యతిరేకత అధికమైంది. వచ్చే ఏడాది కాలంలో చైనా ఉత్పత్తులను బహిష్కరిస్తామని 87 శాతం మంది వెల్లడించారు. దేశీయంగా తయారైన ప్రొడక్ట్స్ ఖరీదు ఉన్నప్పటికీ నాణ్యత మెరుగ్గా ఉంటుందని అత్యధికులు ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. పండుగల సమయంలో లైట్లు, ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఒకసారి మాత్రమే వినియోగించేవి కావడంతో నాణ్యత ప్రధాన అంశం కాదని చాలా మంది అభిప్రాయపడ్డారు. -
రుద్రం.. శత్రు రాడార్లు ఇక ధ్వంసం
బాలాసోర్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి మన దేశం అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. వరసగా క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ భారత వాయుసేనను బలోపేతం చేస్తోంది. శత్రు దేశాల రాడార్లను సర్వ నాశనం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం–1ను భారత్ విజయవంతంగా ప్రయోగించింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఒ) పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విజయవంతంగా పరీక్షించింది. సుఖోయ్–30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి కచ్చితంగా తన లక్ష్యాలను ఛేదించడం ఒక మైలురాయిగా నిలి చిపోయింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడార్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేయడానికి ఈ క్షిపణిని అభివృద్ధి చేశారు. రుద్రం ప్రయోగం విజయంపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హర్షం వ్యక్తం చేసి, శాస్త్రవేత్తలను అభినందించారు. ఇప్పటికే నిర్భయ, శౌర్య వంటి క్షిపణుల్ని ప్రయోగించి చూసిన భారత్ ఈ యాంటీ రేడియేషన్ క్షిపణి ప్రయోగంతో శత్రు దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రుద్రం ప్రత్యేకతలు ► దీన్ని సుఖోయ్–30ఎంకేఐ యుద్ధ విమానాలతో ప్రయోగించవచ్చు. ► శత్రువుల రాడార్, సమాచార వ్యవస్థను పూర్తిస్థాయిలో నిర్వీర్వం చేయగలదు. ► 0.6 మాక్ నుంచి 2 మాక్ వేగంతో ఈ క్షిపణి ప్రయాణిస్తుంది. అంటే ధ్వని వేగం కంటే రెండు రెట్లు ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. ► న్యూ జనరేషన్ యాంటీ రేడియేషన్ మిస్సైల్ (ఎన్‌జీఏఆర్‌ఎం) 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల ఎత్తు నుంచి ప్రయోగించవచ్చు. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి సమర్థవంతంగా ఛేదిస్తుంది ► గగనతలం నుంచి ఉపరితలంపై ఉన్న లక్ష్యాలను ఛేదించే ఈ వ్యూహాత్మక క్షిపణిలోని పాసివ్ హోమింగ్ హెడ్ శత్రు దేశ రక్షణ వ్యవస్థ రేడియేషన్‌ను తట్టుకుంటూ లక్ష్యాలను ఛేదిస్తుంది. ► ఐఎన్ఎస్–జీపీఎస్ ద్వారా దూరంలోని లక్ష్యాలను కచ్చితత్వంతో ఛేదిస్తుంది. ► దీని ప్రయోగానంతరం శత్రుదేశాలు తమ రాడార్ వ్యవస్థను నిలిపివేసినా, ఇది లక్ష్యాలను నాశనం చేయగలదు. ► 2017లో అమెరికా ఈ తరహా యాంటీ రేడియేషన్ క్షిపణిని నావికా రంగంలో ప్రవేశపెట్టింది. అగ్రరాజ్యం సాధించిన మూడేళ్లలోనే భారత్ అలాంటి క్షిపణిని విజయవంతంగా ప్రయోగించడం విశేషం. -
గల్వాన్ ఘటన దురదృష్టకరం: చైనా
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లోని వాస్తవాధీన రేఖ వెంబడి గల్వాన్ ప్రాంతంలో భారత్, చైనా మధ్య జూన్‌లో జరిగిన ఘర్షణలపై డ్రాగన్ దేశం విచారం వ్యక్తం చేసింది. ఆ ఘటన అత్యంత దురదృష్టకరమైనదని పేర్కొంది. అలా జరిగి ఉండాల్సింది కాదంటూ పశ్చాత్తాపం వ్యక్తం చేసింది. చైనా, భారత్ యువత పాల్గొన్న ఒక వెబినార్‌కు బుధవారం హాజరైన భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ చరిత్ర పరంగా చూస్తే ఇది చాలా చిన్న ఘటన అని వ్యాఖ్యానించారు. రెండు దేశాలు ఘర్షణాత్మక వాతావరణాన్ని చూడాలని అనుకోవడం లేదని, ఇక మీదట ఇలా జరగకుండా రెండు దేశాలు సరైన దారిలో ప్రయాణిస్తున్నాయని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఏప్రిల్ నుంచి అడపాదడపా మొదలైన ఉద్రిక్తతలు జూన్‌లో తారస్థాయికి వెళ్లాయి. అప్పుడు చోటు చేసుకున్న ఘటనలో భారత్ సైనికులు 20 మంది ప్రాణాలు కోల్పోతే, చైనా వైపు ప్రాణ నష్టం ఎంత జరిగిందో ఆ దేశం అధికారికంగా వెల్లడించలేదు. భారత్, చైనా మధ్య 70 ఏళ్లుగా దౌత్య సంబంధాలు కొనసాగుతు న్నాయని, ఎన్ని పరీక్షలు , అడ్డంకులు ఎదురైనా మళ్లీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధాలు బలోపేతమవుతున్నాయని సన్ వీడాంగ్ అన్నారు. చర్చల ద్వారా సమస్యల పరిష్కారం ఏ సమస్యకైనా చర్చల ద్వారా సరైన పరిష్కారం లభిస్తుందని రాయబారి వీడాంగ్ అన్నారు. చైనా భారత్‌ని ప్రత్యర్థి కంటే భాగస్వామిగానే చూస్తుందని, పొరుగు దేశం నుంచి ప్రమాదాలని కాకుండా అవకాశాలనే రాబట్టుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. భారత్, చైనా మధ్య ఆర్థికంగా కూడా సంబంధాలు అత్యంత దృఢంగా ఉన్నాయని సన్ వీడాంగ్ వివరించారు. -
డాక్టర్ కావడం కంటే... మనిషి కావడమే కష్టం!
మెడికల్ మెమరీస్: అది 1964వ సంవత్సరం. భారత్-చైనా యుద్ధవాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉన్నాయి. అప్పుడు మేం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఆర్మీ నుంచి మా కాలేజీకి ముగ్గురు ఉన్నతాధికారులు వచ్చారు. మేమా సమావేశానికి హాజరయ్యాం. మాలో ఆసక్తిగలవారిని ‘ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్’గా ఎంపిక చేసుకునేందుకు ఆ అధికారులు వచ్చారని అర్థమైంది. ‘‘మీరు ఆర్మీలో డాక్టర్‌గా చేరదలచుకుంటే నేరుగా ఎంపిక చేసుకుంటాం. ఫైనల్ ఇయర్ పరీక్ష కూడా రాయనవసరం లేదు. ఆ తర్వాత హౌస్‌సర్జెనీ చేయాల్సిన పని కూడా లేదు. నేరుగా సెకండ్ లెఫ్ట్‌నెంట్ కమాండెంట్ హోదాలో తీసుకుంటాం. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయదలచుకుంటే మూడేళ్ల సర్వీసు తర్వాత అర్హత పరీక్షకు హాజరుకావచ్చు. అర్హత సాధిస్తే, మీరు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో ఆర్మీ సగం వేతనం చెల్లించడంతో పాటు, ఆర్నెల్ల స్టడీ లీవ్ కూడా ఇస్తుంది’’ అంటూ సైన్యం డాక్టర్ల జీతభత్యాలూ, ఇతర సదుపాయాల గురించి ఆకర్షణీయంగా వివరించారు. ఇంతలో మా క్లాస్‌లో ఎప్పుడూ హెచ్చులకుపోయే ఓ విద్యార్థి లేచి... కాస్త స్టైలిష్‌గా ‘వాటీజ్ ద ప్రిస్టేజ్ ఆఫ్ ఎ డాక్టర్ ఇన్ ఆర్మీ’ అని అడిగాడు. (సైన్యంలో డాక్టరుకు ఉండే ప్రత్యేక గౌరవం ఏమిటి అనేది అతడి ఉద్దేశం). అతడి ధోరణీ, ఆ బాడీలాంగ్వేజీ ఎప్పుడూ అంతే. ఆ తర్వాత ఆ మిలటరీ అధికారి తన రీతిలో ‘‘యూ సీ... సోల్జర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఆర్మీ. టు హెల్ప్ హిమ్, దేర్ ఈజ్ దోభీ, బార్బర్ అండ్ డాక్టర్’ (సైన్యంలో అందరికంటే ప్రముఖుడు సైనికుడే. అతడికి సహాయపడేందుకే బట్టలుతికేవారూ, క్షురకర్మ చేసేవారూ, డాక్టర్లూ ఉంటారు) అని జవాబిచ్చాడు. అంతే... ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం! అంతలోనే అందరం తేరుకుని సైనికుడి ప్రాధాన్యం గురించి ఆయన చెప్పిన తీరును అభిమానించాం. బాగా ఆలోచించాక... ‘‘వైద్యరంగంలోనూ అంతే... వ్యాధిగ్రస్తుడే ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. అతడికి సేవలందించేందుకే ఈ నర్సులూ, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లూ ఉంటారు. నిజానికి ఆ వ్యాధిగ్రస్తుడే లేకుండా మిగతావారి ఉనికికి అర్థమే లేద’’నిపించింది. దీన్ని ఆకళింపు చేసుకున్నప్పట్నుంచీ నేనందించే వైద్యసేవల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చాను. ఇక మరో సంఘటన... మేము హౌస్‌సర్జన్స్‌గా ఉండగా వార్డుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు పేషెంట్ల గూర్చి శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజున మా సీనియర్స్ వార్డులోకి వస్తూనే... ‘‘ఆ జీజే వేగాటమీకు ఎలా ఉంది? ఈ స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా ఎలా ఉన్నాడు’’ అని అడిగాడు. ‘‘అందరూ బాగానే ఉన్నారు. కానీ కొంచెం ఫీవర్...’’ అంటూ నేనేదో చెబుతున్నాను. మా సంభాషణ వింటున్న మా ప్రిన్సిపల్ డాక్టర్ చలపతినాయుడు మా ముగ్గుర్నీ తన రూమ్‌లోకి రమ్మన్నారు. ఆయనంటే మాకెంతో భక్తిశ్రద్ధలు. ఆయనకు స్టూడెంట్స్ పట్ల ఎంతో వాత్సల్యం. ఆయన స్టూడెంట్స్‌ను ‘‘ఏరా’’ అన్నా... అది మాకు గర్వంగా అనిపించేది. ఆయనంటే మాకున్న గౌరవం అలాంటిది. ‘‘ఏంరా! మీరు మాట్లాడుకుంటున్న పేషెంట్లు హెర్నియా, జీజే, హైడ్రోసిల్‌లు కాదురా. వాళ్లూ మనలాంటి మనుషులే. రైతులో, కూలీయో అయి, గౌరవపూర్వకమైన వృత్తిలో ఉంటారు. మనకూ (డాక్టర్లకూ) ఎప్పుడైనా జబ్బులు రావచ్చు. మిమ్మల్ని జబ్బుపేరుతో పిలిస్తే ఎలా ఫీలవుతారు? ముందు వాళ్ల పేర్లు తెలుసుకోండి. గౌరవించడం నేర్చుకోండి. మీకు వాళ్ల పేర్లే తెలియదంటే, వాళ్లు మనలాంటి మనుషులన్న ధ్యాసే లేదన్నమాట. డాక్టరంటే మందులిచ్చేవాడు మాత్రమే కాదు. అతడూ మనిషి. ముందు మంచి మనిషిగా ఉండటం నేర్చుకోండి’’ అన్నారు. కాస్త తేరుకొని ఆలోచిస్తే ఆయన చెప్పిన విషయంలో ఎంత వాస్తవం ఉందో అర్థమైంది. ఎంతో అనుసరణీయమనిపించింది. ఆరోజు నుంచీ ఒక డాక్టర్‌గా కంటే ఒక మనిషిగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చా. డాక్టర్‌గా ఉండటం కంటే మనిషిగా వ్యవహరించడం చాలా కష్టమైన పని! - నిర్వహణ: యాసీన్ రోగి లేకపోతే... డాక్టరెందుకు? వ్యాధిగ్రస్తుడే ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. అతడికి సేవలందించేందుకే ఈ నర్సులూ, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లూ ఉంటారు. నిజానికి ఆ వ్యాధిగ్రస్తుడే లేకుండా మిగతావారి ఉనికికి అర్థమే లేదు. - డా॥ఎ.పి. విఠల్, ప్రజా వైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట 9848069720