డాక్టర్ కావడం కంటే... మనిషి కావడమే కష్టం! | It's very hard to make a man not doctor | Sakshi
Sakshi News home page

డాక్టర్ కావడం కంటే... మనిషి కావడమే కష్టం!

Published Sun, Apr 12 2015 1:09 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

డాక్టర్ కావడం కంటే... మనిషి కావడమే కష్టం! - Sakshi

డాక్టర్ కావడం కంటే... మనిషి కావడమే కష్టం!

మెడికల్ మెమరీస్: అది 1964వ సంవత్సరం. భారత్-చైనా యుద్ధవాతావరణం ఇంకా కొనసాగుతూనే ఉంది. భారత్-పాక్‌ల మధ్య యుద్ధ మేఘాలు దట్టంగా కమ్ముకుని ఉన్నాయి. అప్పుడు మేం గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్. ఆర్మీ నుంచి మా కాలేజీకి ముగ్గురు ఉన్నతాధికారులు వచ్చారు. మేమా సమావేశానికి హాజరయ్యాం. మాలో ఆసక్తిగలవారిని ‘ఎమర్జెన్సీ కమిషన్డ్ ఆఫీసర్స్’గా ఎంపిక చేసుకునేందుకు ఆ అధికారులు వచ్చారని అర్థమైంది. ‘‘మీరు ఆర్మీలో డాక్టర్‌గా చేరదలచుకుంటే నేరుగా ఎంపిక చేసుకుంటాం. ఫైనల్ ఇయర్ పరీక్ష కూడా రాయనవసరం లేదు. ఆ తర్వాత హౌస్‌సర్జెనీ చేయాల్సిన పని కూడా లేదు. నేరుగా సెకండ్ లెఫ్ట్‌నెంట్ కమాండెంట్ హోదాలో తీసుకుంటాం. పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేయదలచుకుంటే మూడేళ్ల సర్వీసు తర్వాత అర్హత పరీక్షకు హాజరుకావచ్చు. అర్హత సాధిస్తే, మీరు పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసే సమయంలో ఆర్మీ సగం వేతనం చెల్లించడంతో పాటు, ఆర్నెల్ల స్టడీ లీవ్ కూడా ఇస్తుంది’’ అంటూ సైన్యం డాక్టర్ల జీతభత్యాలూ, ఇతర సదుపాయాల గురించి ఆకర్షణీయంగా వివరించారు.
 
 ఇంతలో మా క్లాస్‌లో ఎప్పుడూ హెచ్చులకుపోయే ఓ విద్యార్థి లేచి... కాస్త స్టైలిష్‌గా ‘వాటీజ్ ద ప్రిస్టేజ్ ఆఫ్ ఎ డాక్టర్ ఇన్ ఆర్మీ’ అని అడిగాడు. (సైన్యంలో డాక్టరుకు ఉండే ప్రత్యేక గౌరవం ఏమిటి అనేది అతడి ఉద్దేశం). అతడి ధోరణీ, ఆ బాడీలాంగ్వేజీ ఎప్పుడూ అంతే. ఆ తర్వాత ఆ మిలటరీ అధికారి తన రీతిలో ‘‘యూ సీ... సోల్జర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ ద ఆర్మీ. టు హెల్ప్ హిమ్, దేర్ ఈజ్ దోభీ, బార్బర్ అండ్ డాక్టర్’ (సైన్యంలో అందరికంటే ప్రముఖుడు సైనికుడే. అతడికి సహాయపడేందుకే బట్టలుతికేవారూ, క్షురకర్మ చేసేవారూ, డాక్టర్లూ ఉంటారు) అని జవాబిచ్చాడు. అంతే... ఒక్క క్షణం హాలంతా నిశ్శబ్దం! అంతలోనే అందరం తేరుకుని సైనికుడి ప్రాధాన్యం గురించి ఆయన చెప్పిన తీరును అభిమానించాం.
 
 బాగా ఆలోచించాక... ‘‘వైద్యరంగంలోనూ అంతే... వ్యాధిగ్రస్తుడే ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. అతడికి సేవలందించేందుకే ఈ నర్సులూ, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లూ ఉంటారు. నిజానికి ఆ వ్యాధిగ్రస్తుడే లేకుండా మిగతావారి ఉనికికి అర్థమే లేద’’నిపించింది. దీన్ని ఆకళింపు చేసుకున్నప్పట్నుంచీ నేనందించే వైద్యసేవల్లోనూ అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ వచ్చాను.
 
 ఇక మరో సంఘటన... మేము హౌస్‌సర్జన్స్‌గా ఉండగా వార్డుల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్ విద్యార్థులు పేషెంట్ల గూర్చి శ్రద్ధ తీసుకుంటూ ఉండేవారు. ఒకరోజున మా సీనియర్స్ వార్డులోకి వస్తూనే... ‘‘ఆ జీజే వేగాటమీకు ఎలా ఉంది? ఈ స్ట్రాంగ్యులేటెడ్ హెర్నియా ఎలా ఉన్నాడు’’ అని అడిగాడు. ‘‘అందరూ బాగానే ఉన్నారు. కానీ కొంచెం ఫీవర్...’’ అంటూ నేనేదో చెబుతున్నాను. మా సంభాషణ వింటున్న మా ప్రిన్సిపల్ డాక్టర్ చలపతినాయుడు మా ముగ్గుర్నీ తన రూమ్‌లోకి రమ్మన్నారు. ఆయనంటే మాకెంతో భక్తిశ్రద్ధలు. ఆయనకు స్టూడెంట్స్ పట్ల ఎంతో వాత్సల్యం. ఆయన స్టూడెంట్స్‌ను ‘‘ఏరా’’ అన్నా... అది మాకు గర్వంగా అనిపించేది. ఆయనంటే మాకున్న గౌరవం అలాంటిది.
 
 ‘‘ఏంరా! మీరు మాట్లాడుకుంటున్న పేషెంట్లు హెర్నియా, జీజే, హైడ్రోసిల్‌లు కాదురా. వాళ్లూ మనలాంటి మనుషులే. రైతులో, కూలీయో అయి, గౌరవపూర్వకమైన వృత్తిలో ఉంటారు. మనకూ (డాక్టర్లకూ) ఎప్పుడైనా జబ్బులు రావచ్చు. మిమ్మల్ని జబ్బుపేరుతో పిలిస్తే ఎలా ఫీలవుతారు? ముందు వాళ్ల పేర్లు తెలుసుకోండి. గౌరవించడం నేర్చుకోండి. మీకు వాళ్ల పేర్లే తెలియదంటే, వాళ్లు మనలాంటి మనుషులన్న ధ్యాసే లేదన్నమాట. డాక్టరంటే మందులిచ్చేవాడు మాత్రమే కాదు. అతడూ మనిషి. ముందు మంచి మనిషిగా ఉండటం నేర్చుకోండి’’ అన్నారు. కాస్త తేరుకొని ఆలోచిస్తే ఆయన చెప్పిన విషయంలో ఎంత వాస్తవం ఉందో అర్థమైంది. ఎంతో అనుసరణీయమనిపించింది. ఆరోజు నుంచీ ఒక డాక్టర్‌గా కంటే ఒక మనిషిగా ఉండటానికే ప్రాధాన్యమిచ్చా.  డాక్టర్‌గా ఉండటం కంటే మనిషిగా వ్యవహరించడం చాలా కష్టమైన పని!
 - నిర్వహణ: యాసీన్
 
 రోగి లేకపోతే... డాక్టరెందుకు?
వ్యాధిగ్రస్తుడే ప్రాముఖ్యం ఉన్న వ్యక్తి. అతడికి సేవలందించేందుకే ఈ నర్సులూ, పారామెడికల్ సిబ్బంది, డాక్టర్లూ ఉంటారు. నిజానికి ఆ వ్యాధిగ్రస్తుడే లేకుండా మిగతావారి ఉనికికి అర్థమే లేదు.
 - డా॥ఎ.పి. విఠల్, ప్రజా వైద్యశాల వ్యవస్థాపకులు, సూర్యాపేట
 9848069720

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement